"మొబైల్ ఫోన్లు, టివిలు, వీడియో గేమ్స్ రావటంతోనే తోలుబొమ్మలాటలు, కథ చెప్పటం వంటి చారిత్రాత్మక సంప్రదాయాలు తమ ఉనికిని కోల్పోవటం ప్రారంభమయింది," రాజస్థాన్‌లోని సీకర్ జిల్లా, దాంతా రామ్‌గఢ్‌కు చెందిన తోలుబొమ్మలాటల కళాకారుడు పూరణ్ భాట్ అన్నారు. తాము సొంతంగా తయారుచేసుకున్న తోలుబొమ్మలతో పిల్లల పార్టీలలో, పెళ్ళిళ్ళ వేడుకలలో, ప్రభుత్వ కార్యక్రమాలలో హాస్య నాటికలను (స్కిట్స్) ప్రదర్శించిన కాలాన్ని ఆ 30 ఏళ్ళ వయసున్న కళాకారుడు గుర్తుచేసుకున్నారు.
"ఇప్పుడు జనం విభిన్నమైన కార్యక్రమాలను కోరుకుంటున్నారు. ఇంతకుముందు మహిళలు ఢోలక్ పై పాడేవారు, కానీ ఇప్పుడు జనం హార్మోనియంపై సినిమా పాటలు కావాలనుకుంటున్నారు. మాకు ఆదరణ లభిస్తే, మా పూర్వీకులు మాకు నేర్పించిన వాటిని మేం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం,” అని ఆయన చెప్పారు
భాట్ ఈ సంవత్సరం (2023) ఆగస్టులో జైపూర్‌లోని మూడు దశాబ్దాల నాటి బహుళ కళలకు కేంద్రమైన జవహర్ కళా కేంద్రంలో ఉన్నారు. రాజస్థాన్‌లోని అనేక జానపద కళాకారుల సమూహాలు ఈ రాష్ట్ర-ప్రాయోజిత ఉత్సవానికి తరలివచ్చాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారి కళనూ, జీవనోపాధిని కొనసాగించడానికి కష్టపడుతున్న కళాకారుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది.
ముఖ్యమంత్రి లోక్ కళాకార్ ప్రోత్సాహన్ యోజన అని పిలిచే ఈ పథకం, ప్రతి జానపద కళాకారుల కుటుంబానికి రోజుకు రూ. 500 వేతనంతో ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించేలా హామీ ఇస్తుంది. గ్రామీణ ప్రాంత కుటుంబాలకు 100 రోజుల ఉపాధిని వచ్చేలా చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, దీనికి పూర్వ ప్రమాణంగా నిలిచింది.
కళాకారులకు, వృత్తినైపుణ్యం కలవారి కోసం సెప్టెంబర్ 2023లో కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ యోజనను ప్రకటించారు. అయితే ఈ పథకం - కళాకర్ యోజన - కాల్‌బేలియా, తెరహ్ తాలీ, బహురూపియా, ఇంకా ఇతర క ళా సముదాయాలకు మొదటిది. రాజస్థాన్‌లో దాదాపు 1-2 లక్షల మంది జానపద కళాకారులు ఉన్నారని కార్యకర్తలు అంచనా వేస్తున్నారు, అయితే ఇప్పటివరకు ఎవరూ మొత్తం లెక్కలు వేయలేదు. ఈ పథకం గిగ్ కార్మికులను (రవాణా, బట్వాడా చేసేవారు), వీధి వ్యాపారులను కూడా సామాజిక భద్రతా వలయంలోకి తీసుకువస్తుంది.
“మేం పెళ్ళిళ్ళ సీజన్‌లో కొద్ది నెలలు మాత్రమే పని చేస్తాం, మిగిలిన సంవత్సరమంతా ఇంట్లోనే ఉంటాం. ఈ పథకం ద్వారా, మేం క్రమం తప్పకుండా సంపాదించుకోగలమని ఆశిస్తున్నాం." ఆశాజనకంగా మాట్లాడుతూ అన్నది, జైపూర్ సమీపంలోని మహలాన్ గ్రామానికి చెందిన 28 ఏళ్ళ కాల్‌బేలియా కళాకారిణి లక్ష్మీ సపేరా. "నా పిల్లలు కోరుకుంటే తప్ప, నేను వారిని మా ఈ పూర్వీకుల కళను చేపట్టమని ఒత్తిడిచేయను. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే మంచిది."
"ముఖ్యంగా 2021లో [కోవిడ్ సమయంలో], 'రాష్ట్రంలోని జీవన కళలు, నైపుణ్యాల'కు చెందిన జానపద కళాకారులు ఘోరంగా దెబ్బతిన్నారు. వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే వారు తమ కళను విడిచిపెట్టి ఎన్ఆర్ఇజిఎ కార్మికులుగా మారిపోయేవారు,” అని జవహర్ కళా కేంద్రం డైరెక్టర్ జనరల్ గాయత్రి ఎ. రాఠోడ్ చెప్పారు. కోవిడ్-19 సమయంలో, రాత్రికిరాత్రి అన్ని ప్రదర్శనలు ఆగిపోయాయి, కళాకారులు చేతిసాయాల దయపై ఆధారపడాల్సివచ్చింది.
"కోవిడ్ సమయంలో మా సంపాదనలు అడుగంటిపోయాయి. ఇప్పుడీ కళాకారుల గుర్తింపు పత్రం వలన ఏమైనా మెరుగుపడవచ్చు," అంటోంది పూజా కామడ్. జోధ్‌పుర్‌లోని పాలీ జిల్లా, పదర్లా గ్రామానికి చెందిన 26 ఏళ్ళ పూజా, తెరహ్ తాలీ కళాకారిణి.
"మాంగనియార్(పశ్చిమ రాజస్థాన్‌కు చెందిన పురాతన సంగీతకారుల సముదాయాలు) వంటి జానపద సంగీతంలో, కేవలం ఒక్క శాతం మంది కళాకారులు మాత్రమే విదేశాలలో ప్రదర్శనలిచ్చి సంపాదించుకోగలిగారు; 99 శాతం మందికి ఏమీ లేదు," అంటారు ముకేశ్ గోస్వామి. కాల్‌బేలియాలలో (పూర్వం పాములనాడించేవారుగా, నాట్యకారులుగా గుర్తింపు పొందిన సంచార బృందాలు), కొంతమంది ఎంపికచేసిన 50 మందికి మాత్రమే పని దొరుకుతుంది, మిగిలినవారికి లేదు.
'కోవిడ్ సమయంలో మా సంపాదనలు అడుగంటిపోయాయి. ఇప్పుడీ కళాకారుల గుర్తింపు పత్రం వలన ఏమైనా మెరుగుపడవచ్చు,' అంటోంది పాలీ జిల్లా, పదర్లా గ్రామానికి చెందిన తెరహ్ తాలీ కళాకారిణి, పూజా కామడ్
గోస్వామి మజ్దూర్ కిసాన్ శక్తి సంగఠన్ (ఎమ్‌కెఎస్ఎస్) కార్యకర్త. "జానపద కళాకారులు జీవనోపాధినీ గౌరవాన్నీ పొందేందుకు అతి ముఖ్యమైన ఏడాది పొడవునా ఉపాధి అన్నది ఎన్నడూ లేనేలేదు..." అన్నారతను. ఎమ్‌కెఎస్ఎస్ మధ్య రాజస్థాన్‌లో 1990 నుంచి శ్రామికుల రైతుల సాధికారత కోసం పనిచేస్తోన్న ప్రజా సంస్థ.
అట్టడుగున ఉన్న కళాకారులు ప్రభుత్వం నుండి సామాజిక భద్రత, ప్రాథమిక జీవనోపాధి పొందితే, వారికి ఇతర నగరాలకు వలస వెళ్ళే అవసరం ఉండదు. “ మజ్దూరీ భీ కళా హై [శ్రమ కూడా ఒక కళ],” అని గోస్వామి పేర్కొన్నారు
ఈ కొత్త పథకం కింద వారు తమను కళాకారులుగా గుర్తిస్తూ ఇచ్చిన ఒక గుర్తింపు పత్రాన్ని పొందుతారు. ప్రభుత్వ వేడుకలలో ప్రదర్శనలు ఇచ్చేందుకు వారు అర్హులవుతారు. వివరాలను స్థానిక సర్పంచ్ పరిశీలించిన తర్వాత, ఆ ప్రదర్శనల ద్వారా సంపాదించిన డబ్బు వారి ఖాతాలో జమవుతుంది.
" హమ్ బహురూపి రూప్ బదల్తే హై ," అన్నారు అక్రమ్ ఖాన్, తన సాంప్రదాయిక కళ అయిన బహురూపి గురించి ప్రస్తావిస్తూ. ఇందులో నటులు అనేక మతపరమైన, పౌరాణిక పాత్రలను మార్చి మార్చి ప్రదర్శిస్తారు. రాజస్థాన్‌లో ఉద్భవించిన ఈ కళ నేపాల్, బంగ్లాదేశ్‌లకు ప్రయాణించిందని చెబుతారు. "చారిత్రాత్మకంగా, పోషకులు రకరకాల జంతువులుగా [వారి వినోదం కోసం] వేషాలు మారి రావాలని మాకు చెబుతారు. బదులుగా వారు మాకు ఆహారాన్నీ భూమినీ ఇచ్చి మా బాగోగుల్ని చూసుకుంటారు," అని ఆయన చెప్పారు.
హిందూ, ముస్లిములిరువురూ ప్రదర్శించే ఈ కళా రూపంలో తనవంటి ప్రదర్శనకారులు కేవలం 10,000 మంది మాత్రమే మిగిలివుంటారని ఆయన అంచనా వేశారు.
"దీన్ని (పథకాన్ని) చట్టంగా మార్చాలి. అలా చేస్తే ప్రభుత్వం మారినా, ఉపాధి హామీ మిగిలే ఉంటుంది," అంటారు ఎమ్‌కెఎస్ఎస్ కార్యకర్త శ్వేతా రావ్. కుటుంబానికి 100 రోజుల ఉపాధి హామీ కాకుండా, కళాకారులు ఒక్కొక్కరికీ 100 రోజుల ఉపాధి హామీ ఉండాలని ఆమె అన్నారు. "ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో జజమానీ [పోషక] వ్యవస్థలో ప్రదర్శన ఇస్తుండే అసలైన కళాకారులకు ఇది చేరాల్సిన అవసరం ఉంది, వారు ప్రయోజనం పొందగలగాలి."
2023 మే నుండి ఆగస్ట్ నెలల మధ్యకాలంలో 13,000 - 14,000 మంది కళాకారులు ఈ కొత్త పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్ట్ వరకూ 3,000 మంది ఆమోదాన్ని పొందారు. ఉత్సవం ముగిసిన తర్వాత, దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 20,000-25,000 వరకూ పెరిగిపోయింది.
ప్రతి కళాకారుడి కుటుంబానికి తమ వాయిద్యాన్ని కొనుగోలు చేయడానికి ఒకేసారి రూ. 5,000 కూడా ఇస్తున్నారు. "కళాకారుల సొంత జిల్లాల్లో కళ, సంస్కృతికి సంబంధించిన ఉనికి లేనందున మేం ఇప్పుడు కార్యక్రమాల క్యాలెండర్‌ను రూపొందించుకోవాలి. వారి కళారూపాలను, స్థానిక భాషను ఉపయోగించి ప్రభుత్వ సందేశాలను వ్యాప్తిచేసేలా చూడాలి," అని రాఠోడ్ చెప్పారు.
సీనియర్ కళాకారులు తమ జ్ఞానాన్ని తమ సముదాయంలోనూ, వెలుపల కూడా పంచుకునేలా జానపద కళలను ప్రదర్శించడానికి ఒక సంస్థ అవసరం కూడా ఉంది. ఇది కళాకారుల పనిని సంరక్షించడానికి, దానిని భద్రపరచదానికి (ఆర్కైవ్ చేయడానికి), జ్ఞానాన్ని కోల్పోకుండా చూసుకోవడానికి సహాయపడుతుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి