ధనికులైనా పేదవారైనా, చిన్నవారైనా పెద్దవారైనా, అందరూ తమ పాదరక్షలు తీసి మహారాజు పాదాలను తాకాల్సిందే. అయితే, దుర్బలంగా కనిపిస్తోన్న ఒక యువకుడు మహారాజు కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిటారుగా నిలబడి, నమస్కరించడానికి నిరాకరించాడు. ఎలాంటి భిన్నాభిప్రాయాలనైనా నిర్దాక్షిణ్యంగా అణిచివేయడంలో పేరుగాంచిన మహారాజు ముందు ఆ ధిక్కార చర్య, పంజాబ్‌లోని జోగా గ్రామ పెద్దలను భయాందోళనలకు గురిచేసింది; నిరంకుశ రాచరికానికి కోపం తెప్పించింది.
ఆ యువకుడు జాగీర్ సింగ్ జోగా. బాలీవుడ్ సెలబ్రిటీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్‌ను, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టడానికి తొమ్మిది దశాబ్దాలకు ముందే జోగా ఈ సాహసోపేతమైన వ్యక్తిగత నిరసనను వెలిబుచ్చాడు. జోగా అసమ్మతి పటియాలా మహారాజా భూపిందర్ సింగ్‌ను, పేద రైతుల భూమిని లాక్కోవడానికి ప్రయత్నించిన అతని భూస్వామ్య దుండగులను ఉద్దేశించినది. అది జరిగింది 1930లలో. తర్వాత వెంటనే ఏమి జరిగిందో జానపదాలలో గాని, నిరూపించదగిన చరిత్రలో కానీ కానరాలేదు. కానీ జోగా మరొక రోజున పోరాడటానికి జీవించారు.
ఒక దశాబ్దం తరువాత జోగా, అప్పటి లాల్ పార్టీకి చెందిన అతని సహచరులు కిషన్‌గఢ్ (ప్రస్తుతం సంగ్రూర్ జిల్లాలో ఉంది) చుట్టుపక్కల యుగయుగాల పోరాటానికి నాయకత్వం వహించారు, భూపిందర్ సింగ్ కుమారుడి నుండి 784 గ్రామాలలో వేలాది ఎకరాల భూమిని లాక్కొని భూమిలేని వారికి పంచారు. ప్రస్తుత పటియాలా మాజీ రాజవంశీకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపిందర్ సింగ్ మనవడు.
ఆ భూపోరాటం, ఇతర పోరాటాలననుసరించి 1954లో నభా జైలులో ఉన్నప్పుడే ప్రజలు రాష్ట్ర అసెంబ్లీకి జోగాకు ఓటు వేశారు. 1962, 1967, 1972లలో కూడా ఆయనను తిరిగి శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు.












