ప్రకాశ్ బుందీవాల్ తన పాన్‌వారీ (తమలపాకు తోట)లో నిల్చొనివున్నారు. దట్టమైన వరుసలుగా ఉన్న సన్నని తమలపాకు తీగలకు హృదయాకారంలో ఉండే పాన్ (తమలం) ఆకులు కాస్తాయి; వీటిని తీక్ష్ణమైన వేడిమి నుంచీ, గాలుల నుంచీ కాపాడేందుకు ఒక సింథటిక్ వల పైకప్పుగా వేసివుంది.
పాన్ ఆకులు (తమలపాకులు) భారతదేశమంతటా ప్రజలు భోజనానంతరం వేసుకునే పాన్ (తాంబూలం) తయారీకి కీలకమైనవి. ఈ తాంబూలానికి ఒక తాజా పరిమళాన్నీ, రుచినీ అందించేందుకు సోఁఫ్ (సోంపు), సుపారి (పోకచెక్కలు), గుల్‌కంద్ (గులాబీరేకులతో చేసే తీపి పదార్థం) వంటి విత్తనాలు, ఎండు గింజలతో పాటు పచ్చటి తమలపాకులో చూనా (సున్నం), కత్థా (కాచు పొడి) వేసి చుడతారు.
11,956 మంది జనాభా ఉండే ఈ గ్రామం మంచి నాణ్యత కలిగిన పాన్ ఆకులకు పెట్టింది పేరు. కుక్దేశ్వర్‌లోని ఇతర కుటుంబాలకు లాగే ప్రకాశ్ కుటుంబం కూడా గుర్తున్నప్పటి కాలం నుంచీ ఈ ఆకులను సాగుచేస్తోంది. వీరు మధ్యప్రదేశ్‌లో ఒబిసి (ఇతర వెనకబడిన తరగతి) వర్గానికి చెందిన తంబోలి సముదాయానికి చెందినవారు. ప్రస్తుతం 60 ఏళ్ళు పైబడిన ప్రకాశ్, తనకు తొమ్మిదేళ్ళ వయసప్పటి నుంచీ ఈ పాన్వారీలో పనిచేస్తున్నారు.
కానీ బుందీవాల్‌లకు చెందిన 0.2 ఎకరాల పొలంలో అంతా సజావుగా ఏంలేదు. 2023 మే నెలలో వచ్చిన బిపర్‌జాయ్ తుఫాను వలన వచ్చిన భారీ గాలులు ఈ చిన్న రైతుకు పెద్ద ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాయి. "మాకు ఎటువంటి బీమా సౌకర్యాన్ని అందించలేదు సరికదా, ఈ తుఫాను గాలికి మొత్తం పంట నాశనమైపోయినా ప్రభుత్వం మాకు ఎటువంటి సహాయాన్నీ ప్రకటించలేదు," అన్నారు ప్రకాశ్.
కేంద్రప్రభుత్వం దేశీయ వ్యవసాయ బీమా పథకం (NAIS) కింద వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు వాతావరణ సంబంధిత బీమాను అందిస్తోంది, అయితే ఆ పథకం కిందకు రాని ఉత్పత్తులలో తమలపాకులు కూడా ఒకటి.










