తెర వెనుక ఒక యువకుడు సరిగ్గా సమయానికి దూసుకువెళ్ళి దియా (దీపం) మలిగిపోకుండా ఆపుతాడు. ఒక గంటపాటు జరిగే ప్రదర్శనలో అతను ఈ విధంగా చాలాసార్లు చేయవలసివుంటుంది. అక్కడి సామగ్రికి కానీ తనతోపాటు పనిచేసేవారికి కానీ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అతను ఇదంతా చేస్తాడు.
వీరంతా తమ ప్రేక్షకుల కంటపడకుండా ప్రదర్శననిచ్చే తోల్‌పావకూత్తు బొమ్మలాట ఆడించే కళాకారులు.
తోలు బొమ్మలను చేతపట్టుకొని ఈ బొమ్మలాట ఆడించేవారు తెల్లని నూలు తెర వెనుక నిర్విరామంగా తిరుగుతూనే ఉంటారు. వారి పాదాల వద్ద వరసగా ఉపయోగించడానికి వీలుగా 50-60 తోలుబొమ్మలు సిద్ధంగా ఉంటాయి. స్పీకర్లలో కథను వినిపిస్తూ, నీడల ద్వారా కథను చూపిస్తుంటారు.
ఈ కళ స్వభావం ఎలాంటిదంటే, నిజమైన ప్రదర్శనకు గుర్తింపు ఉండదు. 2021లో తోలుబొమ్మలాట కళాకారుడు రామచంద్ర పులవర్‌కి దేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించినప్పుడు, అది వేడుకచేసుకోవటానికి కారణమయింది, అది ఈ కళ గుర్తింపు పొందిన సమయం కూడా. ఈ సందర్భంగా ఆ తోల్‌పావకూత్తు కళాకారుడు తన ప్రసంగంలో ఇలా అన్నారు: "ఈ గుర్తింపు... తోలుబొమ్మల నాటకరంగం మనుగడ కోసం సంవత్సరాలుగా మొత్తం బృందం చేసిన సమష్టి కృషికి చెందుతుంది."
పులవర్, ఆయన బృందానికి లభించిన ఈ విజయం అంత తేలికగా వచ్చిందేమీ కాదు. ఈ కళను ఒక వ్యాపారంగా మార్చారని విమర్శకులూ భక్తులూ వారిపై నిందారోపణులు చేశారు. ఈ విమర్శను రామచంద్ర పెద్దగా పట్టించుకున్నది లేదు. "మా తిండికీ, మేం బ్రతకటానికీ ఇది ఒక వ్యాపారమే కావాలి," అంటారాయన. "నటులూ, నృత్యకారులూ వారు చేసినదానికి డబ్బులు తీసుకుంటున్నప్పుడు అదే పని తోలుబొమ్మలాట ఆడించేవారు ఎందుకు చేయకూడదు?"
సాంప్రదాయికంగా తోల్‌పావకూత్తు ను కేరళలో కోతల పండుగ సమయంలో కేవలం దేవాలయ ప్రాంగణాలలోనే ప్రదర్శిస్తారు. అయితే గత 20 సంవత్సరాలలో పాలక్కాడ్ జిల్లాలోని కవళప్పార బొమ్మలాటల బృందం 63 ఏళ్ళ రామచంద్ర నాయకత్వంలో ఒక ఆధునిక రంగంలో తోల్‌పావకూత్తు ప్రదర్శనలను కొన్సాగించేందుకు గొప్ప ప్రయత్నాలే చేసింది. నేడు తోలుబొమ్మలాట రంగస్థల కళ తన శైలిలో చాలా మార్పులకు, ప్రయోగాలకు లోనైంది. ఈ సంప్రదాయ పండుగ ప్రదర్శన గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు తోల్‌పావకూత్తు బొమ్మలాట అందరికోసం చూడండి.
తోల్‌పావకూత్తు ను బయటి ప్రపంచానికి తీసుకురావాలనే నిర్ణయాన్ని రామచంద్ర తండ్రిగారైన కృష్ణన్‌కుట్టి పులవర్ తీసుకున్నారు. ఈ ప్రదర్శనలు రామాయణం వంటి హిందూ ఇతిహాసాల పఠనానికి మించి విస్తృత శ్రేణిలో కథనాలను వర్ణించాయి. మహాత్మా గాంధీ కథను కేరళ సంప్రదాయ తోలుబొమ్మలాట శైలిలో మొదటిసారిగా అక్టోబర్ 2004లో ఎడప్పాల్‌లో ప్రదర్శించారు. అప్పటి నుండి ఇది 220 కంటే ఎక్కువసార్లు ప్రదర్శ నలు ఇచ్చింది.
ఈ ప్రదర్శనకు వచ్చిన అద్భుతమైన ఆదరణ కవళప్పార బృందానికి మరిన్ని కొత్త దారులను తెరిచింది. వారు చిత్రానుగుణమైన కథారచన (స్క్రీన్‌ప్లే)లను అభివృద్ధి చేయడం, తోలుబొమ్మలను తయారుచేయడానికి తోలుబొమ్మల నమూనాలను రూపొందించడం, కథలను మలచటంలో (మానిప్యులేషన్) సాంకేతికమైన నేర్పును సాధించటం, కథనాలను అందించడం, స్టూడియోలో పాటలకు బాణీలు కట్టి, రికార్డ్ చేయడం ప్రారంభించారు. ఈ బృందం క్రీస్తు జననం, మహాబలి, పంచతంత్రం మొదలైన విభిన్న కథలకు రాతప్రతులను (స్క్రిప్ట్‌లను) రూపొందించింది.
కవళప్పార తోలుబొమ్మలాట కళాకారులు బుద్ధుని ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రదర్శించే కుమారనాశాన్ పద్యమైన 'చండాలభిక్షుకి' వంటి కథల ద్వారా సామాజిక అవగాహనను తెచ్చారు. ఆ తర్వాత, 2000ల నుండి ఇది కీలకమైన సమస్యలపై అవగాహనను పెంపొందించడానికి ఒక వేదికగా ఉంది. ఎచ్ఐవి(HIV) గురించి అవగాహన పెంచడం, అటవీ నిర్మూలన సమస్య గురించి మాట్లాడటం, అదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల ప్రచారాలకు సహకరించడం చేసింది. తోలుబొమ్మలాట కళాకారులు విభిన్న కళారూపాలపై, విభిన్న కళాకారులతో కలిసి పనిచేశారు, ఫ్యూజన్ ప్రదర్శనలను రూపొందించారు
నేటి ప్రపంచంలో తోల్‌పావకూత్తు ఆవిష్కరణ, నిబద్ధత, శాశ్వత స్ఫూర్తి గురించిన కథనంపై ఒక డాక్యుమెంటరీ
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి