కలిసి ఉన్న రెండు చిగురుటాకులు, ఒక మొగ్గ కోసం రాజిందర్ తీవ్రంగా వెతుకుతున్నారు. వాలుగా ఉన్న కొండపై, ఒకే విధంగా వరుసలుగా నాటిన తేయాకు పొదలను అతని వేళ్ళు సుతారంగా తాకుతున్నాయి. దగ్గరలో అతని భార్య సుమనా దేవి బుట్ట పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉన్నారు. హిమాలయాలలోని ధౌలాధార్ శ్రేణిలో ఉన్న ఈ కొండపై దట్టమైన తేయాకు పొదల మీదుగా పెరిగిన ఎత్తైన ఓహీ చెట్ల ముందు మనుషులు మరుగుజ్జులుగా కనిపిస్తారు.
ఇది కోతల సమయం, కానీ ఆకుల కోసం రాజిందర్ సింగ్ ఎంత ఆతురతతో వెతికినా ఫలితం కనపడలేదు. కాంగ్రా జిల్లాలోని టాండా గ్రామంలోని వారి పొలానికి అతను ప్రతిరోజూ వస్తుంటారు. ఆయనతో పాటు భార్య సుమన, లేదా వారి 20 ఏళ్ళ కుమారుడు ఆర్యన్ ఉంటారు. ఏప్రిల్, మే నెలలు తేయాకులు కోసే సమయం, దీనిని మొదటి ' ఫ్లష్' (తాజా పంట) అంటారు. కానీ ఇప్పుడు కోద్దామంటే ఆయనకేమీ దొరకలేదు.
"వాతావరణం వేడిగా అనిపిస్తోంది, వర్షం జాడ తెలియడంలేదు!" హిమాచల్ ప్రదేశ్‌లోని పాలమ్‌పుర్ తహసీల్‌లో ఉన్న తన తేయాకు పొదలు ఎండిపోతుండటం చూసి ఆయన ఆందోళనగా అన్నారు.
గత రెండేళ్ళుగా కురిసిన వర్షపాతాన్ని గమనిస్తే రాజిందర్ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. 2016 ఎఫ్ఎఒ అంతర-ప్రభుత్వాల ఒక నివేదిక, "టీ తోటల నష్టానికి అస్థిర వర్షపాత మే కారణం" అని పేర్కొంది. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెలల మధ్య ప్రత్యేకించి వర్షం కురవాల్సిన అవసరం ఉన్న తేయాకుపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గురించి ఈ నివేదిక అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఏప్రిల్‌లో మొదటగా కోసే పంటకు అత్యధిక ధర కిలో రూ. 800 వరకూ పలుకుతుంది, అప్పుడప్పుడు రూ.1,200 వరకూ కూడా.
మరో రెండు హెక్టార్ల తోటను గుత్తకు తీసుకున్న రాజిందర్‌కు 2022 సంవత్సరం ప్రత్యేకమైనదిగా ఉండాల్సింది. "నా ఆదాయం పెరుగుతుందని అనుకున్నాను," అని ఆయన చెప్పారు. మొత్తం తోట విస్తీర్ణం ఇప్పుడు మూడు హెక్టార్లు ఉండటంతో, సీజన్ ముగిసే సమయానికి 4,000 కిలోల వరకు తేయాకును పండించగలనని ఆయన ఎదురుచూశారు. గుత్త కింద ఆయన రూ. 20,000 ఖర్చుచేశారు. కాగా, తేయాకు ఉత్పత్తి ఖర్చులలో 70 శాతం వరకు కూలి ఖర్చులు, వేతనాలు ఉంటాయని ఆయన అన్నారు. "తోటను నిర్వహించాలంటే చాలా శ్రమతో పాటు అధిక ఖర్చులు (పెట్టుబడి) ఉంటాయి," అని ఆయన పేర్కొన్నారు. ఆపై తేయాకులను పొడిగా తయారుచేయడానికి అయ్యే అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.


















