సూర్యాస్తమయ ప్రారంభంతోనే నవల్‌గవ్హాణ్ గ్రామంలోని చిన్నా పెద్దా అందరూ పాఠశాల క్రీడా మైదానం వైపుకు సాగిపోతారు. వాళ్ళంతా ఆ క్రీడా మైదానాన్ని శుభ్రం చేయడం, రాళ్ళనూ చెత్తనూ తొలగించడం, సున్నపు పొడితో సరిహద్దు గీతలను గీయడం, ఫ్లడ్‌లైట్‌లను తనిఖీ చేయడం వంటి పనుల్లో మునిగిపోతారు.
8 నుంచి 16 ఏళ్ళ వయసున్న పిల్లలు తమ నీలి రంగు జెర్సీలను ధరించి తయారైపోతారు. వారు ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్ళు ఉండేట్టుగా జట్లుగా విడిపోతారు.
కబడ్డీ కబడ్డీ కబడ్డీ!
ఆట మొదలవుతుంది, మిగిలిన సాయంత్ర సమయంతో పాటు, కొంత రాత్రి సమయం కూడా ఆటగాళ్ళ ఉత్సాహంతో కూడిన కేకలు గాలిని నింపేస్తాయి. ఈ చురుకైన దేశీయ క్రీడను మరాఠ్వాడాలోని హింగోలి జిల్లాలోని ఈ గ్రామంలో ఆటగాళ్ళకు చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు వీక్షిస్తారు.
ఒక ఆటగాడు ఊపిరి బిగపట్టి, కబడ్డీ కబడ్డీ అంటూ కోర్టులోని ప్రత్యర్థి జట్టు వైపుకు వెళ్తాడు. తన సొంత జట్టు దగ్గరకు తిరిగి రావడానికి ముందు వీలైనంత ఎక్కువమంది ఆటగాళ్ళను తాకి, ఔట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను తిరిగి తన జట్టు వైపుకు వచ్చేవరకు 'కబడ్డీ' అనటాన్ని ఆపకూడదు. ప్రత్యర్థి జట్టు చేతిలో చిక్కుకుంటే, అతను ఆట నుండి బయటకు వెళ్ళిపోతాడు.












