సెప్టెంబర్ 2023. మేం పూలు పూసే కాలం మధ్యలో ఉన్నాం. ఇది పశ్చిమ కనుమల్లోని 'పూల లోయ'. ప్రత్యేకమైన జీవవైవిధ్యానికి ఆటపట్టయిన ఈ లోయలో ప్రతి సంవత్సరం వందలకొద్దీ స్థానిక రకాలైన గులాబీ, ఊదా రంగుల పూలు వికసిస్తాయి.
కానీ ఈ సంవత్సరం, కేవలం వాడిపోయిన పూలే నేలపై పడివున్నాయి…
1,200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్ పీఠభూమిని 2012లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. అప్పటి నుండి, ఈ కాస్ పీఠభూమి మహారాష్ట్రలో ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది - ముఖ్యంగా పువ్వులు ఎక్కువగా పూసే ఆగస్ట్ నుండి అక్టోబర్ నెలల కాలంలో. అయితే ఇక్కడే అసలు సమస్యలు మొదలవుతాయి.
“(ఇంతకు ముందు) ఎవరూ ఇక్కడికి వచ్చేవారు కాదు. ఇది మాకు కేవలం ఒక కొండ మాత్రమే. ఇక్కడ మేం పశువులను, మేకలనూ మేపేవాళ్ళం,” అని సులాబాయి బదాపురి చెప్పారు. "ఇప్పుడు జనం పువ్వుల మీద నడుస్తారు, ఫొటోలు తీస్తారు, పువ్వులను సమూలంగా పెరుకుతారు!" జనం అలక్ష్యంతో విసిగిపోయిన 57 ఏళ్ళ సులాబాయి అన్నారు. "ఇది బాగ్ (తోట) కాదు; ఈ పూలు రాతిపై పూస్తాయి."
కాస్‌లోని ఈ పీఠభూమి సతారా జిల్లాలోని సతారా తాలూకా లో 1600 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఒక ఆధార శిల. దీనిని కాస్ పఠార్ అని కూడా అంటారు.
"ఈ గుంపులు గా వచ్చే జనం సంబాళించటానికి వీల్లేకుండా తయారయ్యారు," ఈ పీఠభూమిని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకూ కాపలా కాసే సులాబాయి చెప్పారు. కాస్ పీఠభూమి పరిరక్షణ కోసం ఏర్పాటుచేసిన కాస్ అటవీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గార్డులుగా, వ్యర్థాలను ఏరివేసేవారిగా, గేట్ కీపర్లుగా, గైడ్లుగా పనిచేస్తున్న 30 మంది వ్యక్తులలో ఈమె కూడా ఒకరు.
సతారాలోని సంయుక్త అటవీ నిర్వహణ కమిటీ చెప్పినదాని ప్రకారం, పూలు వికసించే కాలంలో సగటు పర్యాటకుల సంఖ్య రోజుకు 2000 మందిని దాటుతుంది. గుంపులుగా వచ్చే పర్యాటకులు కాసేపు ఆగినపుడు," అహో మేడమ్! దయచేసి పూల మీద అడుగులేయకండి. అవి చాలా సుకుమారమైనవి, అక్టోబర్‌కల్లా వాడిపోతాయి," అంటూ సులాబాయి వారిని అభ్యర్థిస్తారు. వాళ్ళు ఏదో మాటవరసకు క్షమాపణలు చెప్పి తిరిగి తమ ఫొటో సెషన్లలో మునిగిపోతారు.
పూలు వికసించే కాలంలో, ఈ పీఠభూమిలో 850 వృక్ష జాతులు కనిపిస్తాయి. వాటిలో 624 రెడ్ డేటా బుక్‌లో - అన్ని అంతరించిపోతున్న జాతులను నమోదు చేసే పత్రం - జాబితా చేసివున్నాయి. 39 జాతులు కాస్ పీఠభూమిలో మాత్రమే కనిపిస్తాయి. అలాగే ఇక్కడ 400లకు పైగా ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. ఈ ఔషధ మొక్కల గురించి, మోకాళ్ల నొప్పులకు, జలుబు, జ్వరాలకు ఏయే మొక్కలు పనిచేస్తాయో ఆ సమాచారమంతా తెలిసిన పెద్దలు కొందరున్నారు. వాటి గురించి అందరికీ తెలియదు,” అని సమీపంలోని వాంజోళ్‌వాడీలో వ్యవసాయం చేస్తోన్న 62 సంవత్సరాల లక్ష్మణ్ శిందే చెప్పారు.
కాస్ పీఠభూమి వృక్షజాలానికే కాకుండా, వివిధ రకాల కప్పలతో సహా దాదాపు 139 జాతుల ఉభయచరాలకు నిలయం అని ఈ నివేదిక చెబుతోంది. ఇక్కడ నివసించే క్షీరదాలు, సరీసృపాలు, కీటకాలు పర్యావరణ వ్యవస్థ పనిచెయ్యటంలో సహాయపడతాయి.
పుణేకు చెందిన స్వతంత్ర పరిశోధకురాలు ప్రేరణా అగర్వాల్ గత ఐదేళ్ళుగా కాస్ పర్యావరణ వ్యవస్థపై ప్రజా పర్యాటకం ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. “ఈ అంతరించిపోతున్న జాతులకు మనుషుల రద్దీ, కాళ్ళతో తొక్కడం వల్ల ముప్పు పొంచి ఉంది. ఊదారంగు బ్లాడర్‌వోర్ట్ [ Utricularia purpurascens ] వంటి పువ్వులు పాడైపోతాయి. మలబార్ హిల్ బొరేజ్ [ Adelocaryum malabaricum ] వంటి జాతులు కూడా పీఠభూమిలో కనుమరుగవుతున్నాయి" అని ఆమె చెప్పారు.
అయితే ఇందులో ఒక సమస్య కూడా ఉంది. ఈ పర్యాటకం ఆగస్టు, అక్టోబర్‌ల మధ్య చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. “నేను రోజుకు రూ.300 సంపాదిస్తున్నాను. (అవి) వ్యవసాయ కూలీగా చేస్తే వచ్చే దానికంటే చాలా ఎక్కువ,” కాసాని, ఎకివ్, అటాళీ గ్రామాలకు చెందిన పొలాల్లో రోజుకూలీగా తాను సంపాదించే రూ. 150తో పోల్చి చెప్పారు సులాబాయి.
ఏడాదిలో మిగిలిన సమయంలో తమ కుటుంబానికున్న ఎకరం వర్షాధార పొలంలో ఆమె వరి పండిస్తారు. "ఇక్కడ వ్యవసాయం తప్ప మరే పని లేదు. ఈ మూడు నెలలు కాస్త మంచి సంపాదనే ఉంటుంది,” అని కాస్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసాని గ్రామంలో నివసించే సులాబాయి చెప్పారు. ఆమె ఇంటి నుండి పీఠభూమికి కాలినడకన వస్తారు, నడిచేందుకు ఆమెకు “ఒక గంట పడుతుంది."
పీఠభూమిపై ఏటా 2,000 నుంచి 2,500 మి.మీ అత్యధిక వర్షపాతం కురుస్తుంది. వర్షాకాలంలో ఈ రాళ్ళపై ఉన్న కొద్దిపాటి నేలపై ఇక్కడ మాత్రమే కనిపించే ప్రత్యేకమైన వృక్షజాలం మొలకెత్తడం ప్రారంభిస్తుంది. "కాస్‌పై ఉన్న కంకర రాతినేల స్పంజ్ లాగా పనిచేస్తూ నీటిని తన సూక్ష్మ రంధ్రాలలో నిల్వ చేసుకొని, వాటిని నెమ్మదిగా సమీపంలోని ప్రవాహాలలోకి పంపిస్తుంది" అని పుణేకు చెందిన వృక్షశాస్త్రజ్ఞురాలు, సంరక్షకురాలు డాక్టర్ అపర్ణా వాట్వే వివరించారు. "ఈ పీఠభూములకు ఏదైనా నష్టం జరిగితే ఆ ప్రాంతంలోని నీటి మట్టాన్ని అది ప్రభావితం చేస్తుంది."
డా. వాట్వే మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల ఉత్తర భాగం, కొంకణ్‌లలోని 67 పీఠభూములపై క్షేత్రస్థాయి అధ్యయనం చేశారు. “ఇది [కాస్] సున్నితమైన ప్రదేశం. ఇక్కడ భారీగా మౌలిక సదుపాయాల నిర్మాణం చేయటం పర్యావరణ వ్యవస్థ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి,” అని ఆమె చెప్పారు. పెరుగుతున్న పర్యాటకం, అధికమవుతోన్న మనుషుల రద్దీతో పాటు పీఠభూమిలోని 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతోన్న హోటళ్ళ, రిసార్ట్‌ల నిర్మాణాన్ని గురించి ఆమె ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
మానవ జోక్యం వల్ల కీటకాలు, పువ్వులు కనుమరుగవుతున్నందున ఇక్కడ నివసించే అనేక క్షీరదాలు, సరీసృపాలు, కీటకాలు తమ ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. “ఈ జీవులు చాలా పరిమిత ప్రాంతంలో నివసించేవీ, మరెక్కడా జీవించలేనివీ కాబట్టి వీటి ప్రమాణపత్రరచన (డాక్యుమెంటేషన్) చాలా అవసరం. మనం అటువంటి ఆవాసాలను కలుషితం చేసినా లేదా పాడుచేసినా, వాటికి వలస వెళ్ళడానికి వేరే ప్రదేశం లేదు. అవి అంతరించిపోతాయి," అని శాస్త్రవేత్త సమీర్ పాధ్యే చెప్పారు. కీటకాలు, పువ్వులు మాయమైపోతే పూలు వికసించే నిర్మాణక్రమాలు పడిపోతాయి, ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగించవచ్చునని ఆయన అన్నారు. ఇంకా, ఈ విలక్షణ జాతులకు జరిగిన నష్టం పరాగసంపర్క ప్రక్రియను ప్రభావితంచేసి, పీఠభూమి అంచున ఉన్న గ్రామాల నీటి వనరులకు నష్టం కూడా కలుగచేస్తుందని పాధ్యే పేర్కొన్నారు.
లక్ష్మణ్ మాకు మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు మందుగా పనిచేసే జంగ్లీ హళద్ (అడవి పసుపు - Hitchenia caulina )ను చూపించారు. నాలుగు దశాబ్దాల క్రితం కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన, “ఆ రోజుల్లో (కాస్ మీద) పూలు చాలా ఒత్తుగా వికసించేవి,” అన్నారు. ఈయన పూలు వికసించే కాలంలో కాస్‌పై ఉన్న ప్లాస్టిక్, నాన్ డిస్పోజబుల్ వ్యర్థాలను ఏరివేసి, రోజుకు రూ.300 సంపాదిస్తున్నారు. సంవత్సరంలో మిగిలిన కాలంలో తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తుంటారు.
"మేమిక్కడే పుట్టాం. ఈ ప్రాంతంలో ప్రతి మూలా మాకు తెలుసు," అంటారు సులాబాయి. "అయినా మాకు చదువులేదు కాబట్టి మమ్మల్నెవరూ మతించరు. కానీ శిక్షిత్ (చదువుకున్న) జనం ప్రకృతికి చేస్తున్నదేమిటి?"
కాస్ ఇప్పుడు వేరేగా కనిపిస్తోంది. "అది బేకార్‌గా (పాడైపోయి) కనిపిస్తోంది. ఇది నా చిన్నప్పటి కాస్ కాదు," సులాబాయి విచారంగా చెప్పారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి