గడ్డమీది రాజేశ్వరి 2018లో భూ యజమాని అయ్యారు. "నేనెంతో ఉద్వేగానికి గురయ్యాను. నేనొక సొంత భూమి ఉన్న మహిళనవుతున్నాను."
కనీసం ఆమె అలా అలోచించారు, తన చేతిలో ఉన్న అధికారిక హక్కు పత్రాలను సగర్వంగా చూసుకుంటూ.
ఐదేళ్ళ తర్వాత స్వగ్రామమైన యెన్కెపల్లెకు 30 కిలోమీటర్ల దూరంలోని బార్వాద్‌లో ఉన్న 1.28 ఎకరాల భూమికి తానే స్వంతదారు అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుకోసం ఆమె ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ భూమి కోసం ఆమె రూ. 30,000 చెల్లించారు.
ఈ భూమిని కొన్న కొన్ని నెలల్లోనే, రాజేశ్వరికి ఆ భూమి హక్కు పత్రం, ఎన్‌కంబరెన్స్ (ఒక భూమికి సంబంధించి జరిగిన ప్రతి లావాదేవీని తెలియజేసే ఒక ముఖ్యమైన ఆస్తి పత్రం) నివేదిక, ఇంకా ఆమె పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకునేందుకు అవసరమైన పత్రాలన్నీ వచ్చేశాయి. కానీ అదంతా వంచనగా తేలింది. "ఇప్పటికి ఐదేళ్ళవుతోంది, కానీ ఇంతవరకూ నాకు పట్టాదార్ (భూ యజమాని) పాస్‌బుక్ రాలేదు. పట్టాదార్ పాస్‌బుక్ లేకపోతే, అది (భూమి) నిజంగా నాదవుతుందా?"
భూ యాజమాన్యం బదలాయింపు ఎలా జరిగిందో హక్కు పత్రం చూపిస్తుండగా, పట్టాదార్ పాస్ పుస్తకం భూ యాజమాన్యం గురించిన మరిన్ని వివరాలనిస్తుంది. ఈ పాస్ పుస్తకంలో పట్టాదారుల పేరు, సర్వే నంబరు, ఆ భూమి ఏ రకానికి చెందినది వంటి మరిన్ని వివరాలుంటాయి. ఇందులో ఆ భూమి స్వంతదారు పాస్‌పోర్ట్ ఫొటో, తహసీల్‌దారు సంతకం కూడా ఉంటాయి.
అక్టోబర్ 2020లో తెలంగాణ భూమి మరియు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం, 2020 కింద ధరణి పోర్టల్ - ఆన్‌లైన్‌లో భూమికి సంబంధించిన అధికారిక పత్రాలను నిర్వహించే వ్యవస్థ - ప్రారంభమైనపుడు రాజేశ్వరిలో ఆశలు చిగురించాయి.
దీనిని ప్రారంభించినపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఇది రైతులకు అనుకూలమైన ప్రారంభంగా పేర్కొంటూ, "ఈ వేదిక భూమి రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుంది, వేగవంతం చేస్తుంది. ప్రజలు అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు" అన్నారు.
"ధరణి (పోర్టల్) మా సమస్యను తీరుస్తుందనీ, ఇక మాకు పాస్ పుస్తకం వచ్చేస్తుందనీ ఆశించాం," రాజేశ్వరి భర్త రాములు అన్నారు. "2019 వరకూ మేం నెలలో కనీసం రెండుసార్లు తహశీల్‌దారు కార్యాలయానికి వెళ్ళొచ్చేవాళ్ళం."
భూమి వివరాల కోసం 2020లో ఈ దంపతులు ధరణి పోర్టల్‌లో చూసినపుడు పోర్టల్‌లో తమ భూమి సర్వే నంబర్ మొత్తానికే లేకపోవడాన్ని గమనించారు. ఆ వివరాన్ని చేత్తో (manual) సరిచేయడానికి వీలు కాదు.
"ధరణి పోర్టల్‌తో ఉన్న సమస్యలలో ప్రధానమైనది - ఏమైనా తప్పులుంటే (పేరు, ఎకరాలు, సర్వే నంబర్ లేకపోవటం వంటివి) వాటిని సవరించి ప్రకటించేందుకు ఇప్పుడున్న అవకాశాలు చాలా పరిమితం," ఒప్పుకున్నారు భార్గవి ఉప్పల. ఈమె వికారాబాద్‌లో కిసాన్ మిత్ర కు జిల్లా సమన్వయ కర్తగానూ, కౌన్సెలర్‌గానూ పనిచేస్తున్నారు.
భూమి యజమాని పేరు పొరపాటుగా పడటం వలన ముడావత్ బద్యాకు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న వికారాబాద్ జిల్లా గిర్కెట్‌పల్లె గ్రామంలోని తన భూమిని చట్టబద్ధంగా సొంతం చేసుకునేందుకు వీలవడంలేదు. పోర్టల్‌లో అతని పేరు ‘బద్యా లంబాడా ’గా నమోదైవుంది. లంబాడా అనేదీ అతని సముదాయం పేరు, తెలంగాణాలో అది షెడ్యూల్డ్ తెగల కింద జాబితా చేసివుంది. అతని పేరు 'ముడావత్ బద్యా' అని ఉండాలి.
బద్యాకు 40 ఏళ్ళ కిందట కొనుక్కున్న రెండు ఎకరాల సొంత భూమి ఉంది. "ఈ భూమిని సొంతంగా కొనుక్కోవడానికి ముందు నేను ఎన్నో ఏళ్ళపాటు ఇతరుల పొలాల్లో వ్యవసాయం చేశాను; నిర్మాణ ప్రదేశాల్లో, ఇటుక బట్టీలలో పనిచేశాను," అన్నారు 80 ఏళ్ళ వయసున్న బద్యా. తన పొలంలో ఆయన మొక్కజొన్న, జొవర్ (జొన్న) సాగుచేసేవారు. "వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బు ఎప్పుడూ చాలేది కాదు. భారీగా వానలు కురవడం వల్ల పంటలు ఎక్కువగా నాశనమయ్యేవి."
తన పేరు తప్పుగా నమోదు కావటంతో ఆయన రైతు బంధు పథకాన్ని పొందలేకపోయారు. తెలంగాణలో కనీసం ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు ప్రతి ఎకరానికి రూ.5,000 చొప్పున సంవత్సరానికి రెండుసార్లు - రబీ, ఖరీఫ్ పంటకాలాలకుగాను - ప్రభుత్వం ఈ సంక్షేమ పథకం కింద ఇస్తుంది.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, తాను చెప్పినట్టుగా ప్రకటించడానికి ఇష్టపడని ఒక అధికారి, ధరణి సమస్యలను తాము సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అవి రాజకీయ సాధనంగా మారాయని చెప్పారు. ప్రస్తుతం ‘ నిర్దిష్ట భూసంబంధిత విషయాల ’ కేటగిరీ కింద పేరు, ఆధార్, ఫోటో, జెండర్ లేదా కులం వంటి 10 వివరాలు మాత్రమే సవరించటానికి వీలుగా ఉన్నాయి.
సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోపనవరం గ్రామానికి చెందిన రంగయ్యకు ధరణి పోర్టల్‌లో పేరు సరిగ్గానే నమోదయినప్పటికీ రైతు బంధు పథకం ద్వారా డబ్బు అందటంలేదు. రంగయ్యకు బోపనవరం గ్రామంలో ఐదు ఎకరాల పొలం ఉంది. ఆ భూమిని 1989లో అతనికి కేటాయించారు. రంగయ్య తెలంగాణలో షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించిన బేడ జంగం సముదాయానికి చెందినవారు.
"నేను 2019-2020 మధ్య మూడు విడతలుగా డబ్బు అనుకున్నాను. ధరణి పోర్టల్‌లో నా భూమి వివరాలు నమోదయ్యాక, నాకు డబ్బులు రావటం ఆగిపోయింది," 67 ఏళ్ళ వయసున్న రంగయ్య వివరించారు. ఆయన ప్రతి విడతకు రూ. 25,000 (ఒక ఎకరానికి ఐదు వేల చొప్పున) అందుకునేవారు.
"ఏ అధికారీ నాకు స్పష్టమైన జవాబు ఇవ్వడంలేదు. బహుశా వాళ్ళక్కూడా ఏం చెప్పాలో, అసలేం జరుగుతుందో తెలియటంలేదనుకుంటా," అన్నారాయన.
పోర్టల్‌లో లోపాలను మాన్యువల్‌గా సరిదిద్దడానికి చాలా తక్కువ, లేదా అసలు వీలు లేదని భార్గవి చెప్పారు. కలెక్టర్ కార్యాలంలో ఒక కౌన్సెలర్‌గా పనిచేస్తోన్న ఆమె, “అసైన్డ్ భూమి విషయంలో, వారసుల పేరును సవరించడానికి మాత్రమే పోర్టల్‌లో వీలుంది,” అన్నారు. అసైన్డ్ భూమిని అమ్మడానికి లేదు, అది వారసత్వంగా మాత్రమే వస్తుంది.
బద్యా తన చిన్నకొడుకు గోవర్ధన్‌తో కలిసి గిర్గెట్‌పల్లెలో ఉన్న ఒక ఒంటిగది కచ్చా ఇంటిలో నివసిస్తుంటారు. ఆయన భార్య ఆరేళ్ళ క్రితమే మరణించారు.
ఆయనకు రైతు బంధు డబ్బు రాకపోవడమే కాదు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎమ్ఎన్ఆర్ఇజిఎ) కింద సంపాదించే రోజుకు రూ. 260ల ఆదాయం కూడా వికారాబాద్ మ్యునిసిపాలిటీలో గిర్గెట్‌పల్లి కలిసిపోవటంతో ఆగిపోయింది.
తన పేరును సవరించాల్సిందిగా వికారాబాద్ రెవెన్యూ శాఖలో ఆయన 2021లో అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ ఏమీ జరగలేదు.
"నా (చిన్న) కొడుకు ఈ భూమిని అమ్మమని ఒకటే అడుగుతున్నాడు. పొలం అమ్మిన డబ్బుతో తానొక కారు కొని ట్యాక్సీ డ్రైవర్‌ను అవుతానని అతనంటాడు. కానీ నేనాపని ఎన్నడూ చెయలేదు. అదే చేసుండాల్సిందేమో," అంటారు బద్యా.
*****
చివరకు 2022 నవంబర్‌లో రాజేశ్వరి, రాములు తమ భూమి సర్వే నంబర్లు నమోదు కాకపోవడం గురించి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఒక అర్జీ దాఖలు చేశారు.
అప్పట్నించీ వారు వారానికి ఒకసారి కోటెపల్లి తహశీల్‌దారు కార్యాలయానికీ, వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికీ వెళ్ళివస్తూనే ఉన్నారు. వారి ఇంటి నుంచి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళు బస్సులో వెళ్తారు. వెళ్ళిరావడానికి ఒక్కొక్కరికీ రూ. 45 బస్సు ఛార్జీలవుతాయి. పొద్దున్నే బయలుదేరి వెళ్తే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. "నా ఇద్దరు పిల్లలు బడికి వెళ్తారు, మేమిద్దరం పాస్ పుస్తకం వస్తుందనే ఆశతో ఇల్లు విడచి పోతుంటాం," అంటారు రాజేశ్వరి.
వారు 2018 చివరి నుండి బార్వాద్‌లోని తమ 1.28 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. “మేం జూన్ నెలలో (పత్తి) నాటాం, జనవరి నెల మధ్యకల్లా పువ్వులు వస్తాయి. డబ్బు లేకపోవడం, ఈ ప్రాంతంలో నీటికి కరువుండటం వలన మేం వేయగలిగిన పంట ఇదొక్కటే," అని రాములు చెప్పారు. ఏటా క్వింటాలు పత్తిని పండించి, దానిని రూ. 7,750 కి అమ్ముతారు.
పాస్ పుస్తకం లేకపోవటం వలన వారు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. తాము ఇప్పటివరకూ, ఎనిమిది విడతలుగా రావలసిన డబ్బు రూ. 40,000 నష్టపోయినట్టుగా ఆ దంపతులు చెప్పారు.
వారికిక ఆ బకాయి రాకపోవచ్చునని భార్గవి చెప్పారు.
బోపనవరం గ్రామానికి చెందిన రంగయ్య రైతు బంధు పథకం ద్వారా వచ్చే లబ్ధిని కోల్పోయారు. డబ్బు లేకపోవటం వలన తాను జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ జొవర్ (జొన్న), పసుపు పంటలను మాత్రమే వేయగలుగుతున్నానని ఆయన చెప్పారు.
గుడ్డిలో మెల్లలా రంగయ్య విషయంలో ఒక మేలు జరిగింది. అదేమిటంటే, కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఆయన్ని గుర్తించింది - ఆయన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( PM-KISAN ) నుండి చెల్లింపులు అందుకుంటున్నారు. దీని కింద చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి రూ. 6,000, వారి ఆధార్ జతచేసివున్న బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు
"నన్ను లబ్ధిదారుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినపుడు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నన్ను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది?" రంగయ్య పశ్నిస్తున్నారు. "ఇదంతా ధరణిని ప్రారంభించిన తర్వాత మాత్రమే జరిగింది."
*****
భూయజమానులుగా చట్టబద్ధంగా గుర్తింపు పొందడం కోసం ఎదురుచూసీ చూసీ విసిగిపోయిన రాజేశ్వరి, రాములు జనవరి 2023లో పశుపోషణను చేపట్టారు. వారు సంప్రదాయ పశుల కాపరులైన గొల్ల సముదాయానికి చెందినవారు. 12 మేకలను కొనుగోలు చేయడానికి నెలకు 3 శాతం వడ్డీ రేటుతో ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి వద్ద రాములు రూ. లక్ష అప్పు తీసుకున్నారు. అతను ఒక సంవత్సరం పాటు నెలకు రూ. 3,000 చొప్పున అప్పు కట్టాలి, అయితే ఇది వడ్డీ మాత్రమే.
"కొన్ని నెలల తర్వాత మేం మేకలను అమ్మడం మొదలుపెడతాం. వాటి ఆరోగ్యంపై ఆధారపడి మేకపిల్ల ఒక్కటి రూ. 2000-3000 రూపాయలకు, పెద్ద మేక ఒక్కోటీ రూ. 5000 - 6000 వరకూ అమ్ముడుపోతాయి," రాములు వివరించారు.
ఇంకో ఏడాది పాటు పాస్ పుస్తకం కోసం ప్రయత్నించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే విసుగెత్తివున్న రాజేశ్వరి ఇలా అన్నారు, "బహుశా నేను భూమి సొంతదారును కావాలని లేదేమో..."
ఈ కథనానికి
రంగ్ దే
నుంచి గ్రాంట్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి