ఆయన మృదువుగా వినిపించే మోసకారి మాను గుడ్లగూబ(ఉడ్ ఔల్) కూతను, నాలుగు రకాల జిట్ట(బాబ్లర్) పిట్టల అరుపులను గుర్తించగలరు. ఆయనకు వలసజాతి ఊలుమెడ కొంగలు ఏ రకమైన కొలనుల్లో గుడ్లుపెడతాయో కూడా తెలుసు.
బి. సిద్దన్ బడి చదువును మధ్యలోనే మానేశారు, కానీ తమిళనాడు రాష్ట్రం నీలగిరులలోని తన ఇంటి చుట్టుపక్కల ఉండే పక్షి జాతుల గురించి ఆయనకున్న జ్ఞానం ఏ పక్షి శాస్త్రవేత్తకూ తీసిపోదు.
"మా గ్రామంలో సిద్దన్ పేరుతో ముగ్గురు కుర్రాళ్ళు ఉండేవారు. ఎవరైనా సిద్దన్ కోసం అడిగితే, 'ఆ కురువి సిద్దన్ - ఎప్పుడూ పక్షుల వెంట పిచ్చిగా పరిగెడ్తాడు, ఆ కుర్రాడే', అని మా గ్రామస్థులు చెబుతారు," అంటూ సగర్వంగా నవ్వుతూ చెప్తారాయన.
అతని అసలు పేరు బి. సిద్దన్. కానీ ముదుమలై చుట్టుపక్కల అడవులూ గ్రామాల్లో అతన్ని కురువి సిద్దన్ అని పిలుస్తారు. తమిళంలో, ' కురువి ' అనేది పాస్సెరిఫార్మీస్ క్రమానికి (order) చెందిన పక్షులైన పాస్సురైన్లను సూచిస్తుంది. పక్షి జాతులలో సగానికి పైగా ఇదే క్రమానికి చెందుతాయి.
"పశ్చిమ కనుమలలో మీరెక్కడికి వెళ్ళినా, ఓ నాలుగైదు పక్షులు పాడటాన్ని మీరు వింటారు. మీరు చేయాల్సిందల్లా వినటం నేర్చుకోవటమే" అంటుంది, 28 ఏళ్ల విజయ సురేశ్. ఈమె నీలగిరి పర్వతపాదంలో ఉన్న ఆనకట్టి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని. తాను పక్షుల గురించిన విలువైన సమాచారాన్ని సిద్దన్ నుంచే నేర్చుకున్నానని ఆమె చెప్పారు. ముదుమలై టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల నివసించే చాలామంది కుర్రాళ్ళకు సిద్దన్ ఒక మార్గదర్శి. విజయ తన చుట్టుపక్కల ప్రాంతంలోని 150 వరకూ పక్షులను గుర్తించగలదు.
సిద్దన్ బొక్కపురం గ్రామస్థుడు. ఈ గ్రామం తమిళనాడు నీలగిరి జిల్లాలోని ముదుమలై టైగర్ రిజర్వ్ వద్దగల తటస్థప్రాంతం (బఫర్ జోన్) లో ఉంది. అతను గత రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఫారెస్ట్ గైడ్‌గాను, పక్షులను గమనించేవాడు (బర్డ్ వాచర్) గాను, రైతుగానూ పనిచేస్తున్నారు. ఈ 46 ఏళ్ళ పక్షిశాస్త్రవేత్త భారత దేశంలోని 800కు పైగా పక్షులను గుర్తుపట్టగలరు, వాటి గురించి సుదీర్ఘంగా మాట్లాడగలరు. తమిళనాడులోని షెడ్యూల్డ్ జాతుల కిందకు వచ్చే ఇరులర్ (ఇరులా అని కూడా పిలుస్తారు) సముదాయానికి చెందిన సిద్దన్ తన జ్ఞానాన్ని ముదుమలై పాఠశాలలలో ప్రెజెంటేషన్ల రూపంలో, కబుర్ల రూపంలో, ప్రకృతిలోకి నడక వంటివాటి ద్వారా చిన్నపిల్లలకు పంచుతున్నారు.
మొదట్లో పక్షుల పట్ల ఈయనకు గల ఆసక్తిని పిల్లలు తేలికగా చూసేవారు. "కానీ తరువాత్తరవాత వాళ్ళు ఒక పక్షిని చూసినప్పుడు, నా దగ్గరకు వచ్చి దాని రంగు, పరిమాణం, అది చేసే శబ్దాలను గురించి వివరించేవాళ్ళు," అని అతను గుర్తుచేసుకున్నారు.
"రాలిన వెదురు ఆకుల మీద నడవకూడదని ఆయన నాకు చెప్పేవాడు. ఎందుకంటే కొన్ని నైట్‌జార్ (గుండుములుపుగాడు) వంటి పక్షులు చెట్ల గూళ్ళలో కాకుండా అక్కడ గుడ్లు పెడతాయని. మొదట్లో, నాకు ఇలాంటి చిన్నవిషయాలపట్ల మాత్రమే ఆసక్తిగా ఉండేది. చివరికి అవే నన్ను పక్షల ప్రపంచంలోకి లాగాయి." అని మొయర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ళ రాజేశ్, ఈ పక్షిప్రేమికుడితో తనకు గల అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
నీలగిరులు తోడా, కోటా, ఇరులర్, కట్టునాయక, పనియా వంటి అనేక ఆదివాసీ సముదాయాలకు పుట్టినిల్లు. "నా ఇరుగుపొరుగు ప్రాంతాల ఆదివాసీ పిల్లలు ఆసక్తి చూపించినప్పుడు నేను వారికి ఒక పాత గూడును ఇవ్వటమో, లేదా పిల్లలున్న పక్షిని సంరక్షించే బాధ్యతను అప్పగించడమో చేస్తాను." అంటారు సిద్దన్.
పాఠశాలలతో ఈయన పని 2014లో మసినగుడి ఎకో నేచురలిస్టుల క్లబ్ (MENC), బొక్కపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పక్షుల గురించి మాట్లాడేందుకు ఆహ్వానించడంతో ప్రారంభమైంది."ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లోని అనేక పాఠశాలలు నన్ను ఆహ్వానించాయి," అని ఆయన చెప్పారు.
మా బొక్కపురం గ్రామంలో సిద్దన్ పేరుతో ముగ్గురు కుర్రాళ్ళు ఉండేవారు. ఎవరైనా సిద్దన్ కోసం అడిగితే, ‘ఆ కురువి సిద్దన్ - ఎప్పుడూ పక్షుల వెంట పిచ్చిగా పరిగెడుతుంటాడు', అని గ్రామస్థులు చెబుతారు
*****
సిద్దన్ ఎనిమిదో తరగతితో చదువు మానేసి, తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయం చేయాల్సి వచ్చింది. 21 ఏళ్ళ వయసులో, అతన్ని అటవీ శాఖ బంగ్లా వాచర్‌గా నియమించింది - గ్రామాల, వ్యవసాయ భూముల చుట్టుపక్కల పరిసరాలలో ఏనుగుల కదలికలను గురించి ప్రజలను అప్రమత్తం చేయటం అతని పని. వీటితో పాటు వంట పని, శిబిరాల నిర్మాణంలో కూడా సహాయం చేయాలి.
ఉద్యోగం మొదలైన రెండేళ్లలోపే మానేయవలసి వచ్చింది. “నా జీతం 600 రూపాయలు, అది కూడా వరుసగా ఐదు నెలల పాటు రాలేదు. దీంతో నేను ఉద్యోగం మానేయాల్సి వచ్చింది," అని సిద్దన్ చెప్పారు. “అంత వత్తిడిలో నేను లేకపోయి ఉంటే డిపార్ట్‌మెంట్‌లోనే ఉండిపోయేవాడిని. నా పనిని నేను చాలా ఇష్టపడ్డాను. అడవిని విడిచి వెళ్లలేను, అందుకే ఫారెస్ట్ గైడ్ అయ్యాను."
90 దశకం చివరలో, అతను 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఈ ప్రాంతంలో పక్షుల గణనను నిర్వహించే ప్రకృతి శాస్త్రవేత్తలతో కలిసి వెళ్ళే అవకాశం వచ్చింది. ఏనుగుల గుంపుల కదలికల గురించి వారిని హెచ్చరించడం అతని పని. ఎందుకంటే, "పక్షిశాస్త్రవేత్తలు పక్షులపై దృష్టి పెట్టినప్పుడు, వారు తమ చుట్టూ ఉన్న ప్రమాదాలను గురించి పట్టించుకోరు." అని సిద్దన్ చెప్పారు.
ఆ పర్యటనలో ఆయన ఊహించని సంఘటన జరిగింది. "పెద్ద మనుషులు ఈ చిన్నపిట్టను చూడటానికి మట్టిలో పొర్లటం చూశాను. నా దృష్టి వాళ్ళు చూస్తోన్న పక్షి మీద పడింది - అది ఒక చిన్న తెల్లటి పొట్టవున్న మినివెట్ (నామాలపిట్ట)". అంతే ఇక వెనుతిరిగి చూడకుండా సిద్దన్ ఆ పక్షుల పేర్లన్నీ తమిళంలోనూ, కన్నడలోనూ నేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత, సీనియర్ బర్డ్ వాచర్లు, స్థానికంగా నివాసముండే కుట్టప్పన్ సుదేశన్, డేనియల్‌లు సిద్దన్‌ని తమ సంరక్షణలోకి తీసుకుని శిక్షణ ఇచ్చారు.
ఉత్తర ముంబై నుంచి మొదలై కిందన ఉన్న కన్యాకుమారి వరకూ విస్తరించిన పశ్చిమ కనుమలు 508 పక్షిజాతులకు నివాసం అని ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 2017లో ఫారెస్ట్ గార్డియన్స్ ఇన్ ది వెస్ట్రన్ ఘాట్స్ అనే పేరుతో ప్రచురించిన పత్రంలో పేర్కొంది. వీటిలో అంతరించిపోతున్న జాతికి చెందిన తుప్పు రంగు పొట్ట ఉండే లాఫింగ్ థ్రష్ (Laughing thrush), నీలగిరి మానుగువ్వ (Wood-pigeon), తెల్లని పొట్టవుండే షార్ట్‌వింగ్ (Shortwing), వెడల్పాటి తోక ఉండే గ్రాస్‌బర్డ్ (Grassbird), బూడిదరంగు తల ఉన్న పికిలి పిట్ట (బుల్‌బుల్) వంటి 16 స్థానిక పక్షిజాతులు ఉన్నాయి.
సాధారణంగా కనిపిస్తూవుండే చాలా పక్షిజాతులు అరుదుగా మారిపోతున్నాయని గంటలతరబడి అడవిలో గడిపే సిద్దన్ చెప్పారు. "ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క బూడిదరంగు తల ఉండే బుల్‌బుల్‌ను చూడలేదు. అవి చాలా మామూలుగా కనిపిస్తూ ఉండేవి, ఇప్పుడు అరుదుగా మారిపోయాయి." అన్నారు సిద్దన్.
*****
ఎరుపువాటిల్ ఉల్లంకిపిట్ట అరుపు హెచ్చరికగా అడవంతా ప్రతిధ్వనించింది
"దీనివల్లే వీరప్పన్ అరెస్టుకాకుండా చాలా కాలం తప్పించుకున్నాడు,” ఎన్. శివన్ గుసగుసగా చెప్పారు. అతను సిద్దన్ స్నేహితుడు, ఆయన సాటి పక్షి నిపుణుడు కూడా. వీరప్పన్ అడవిజంతువులను వేటాడటం, గంధపుచెక్కల స్మగ్లింగ్‌తో పాటు మరెన్నో కేసుల్లో నిందితుడు. అతను ఈ ఆల్‌కాట్టి పరవై (ప్రజలను హెచ్చరించే పక్షి) వల్లే దశాబ్దాలుగా సత్యమంగళం అడవుల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడని స్థానికులు చెబుతారు.
వేటాడే జంతువులనుగానీ, చొరబాటుదారులను గానీ చూస్తే ఉల్లంకిపిట్ట కూతపెడుతుంది. అడవి జిట్టపిట్టలు పొదలపై కూర్చుని వేటకు వచ్చిన జంతువును అనుసరిస్తూ, అది కదిలినప్పుడల్లా అవి కిచకిచలాడుతూంటాయి," అని తనకు ఏ పక్షి కనిపించినా దాన్ని గురించి పుస్తకంలో నోట్ చేసుకునే ఎన్. శివన్ చెప్పారు. "మేమిలా ఒక ఏడాదిపాటు శిక్షణ పొందాం," అని 50 ఏళ్ళ వయసున్న శివన్, పక్షి జాతి పేరును గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ చెప్పారు. గుర్తురాకపోయినా పట్టువిడవకుండా, "మాకు పక్షులు చాలా ముఖ్యం. నేనింకా నేర్చుకోగలనని నాకు తెలుసు." అన్నారు.
90వ దశకం మధ్యనాటికి సిద్దన్, శివన్‌లు బొక్కపురం సమీపంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ట్రెక్కింగ్ గైడ్లుగా నమోదుచేసుకున్నారు. అక్కడే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షుల వీరాభిమానులను కలుసుకుని, వారితో కలిసిపోయారు.
*****
మసినగుడి మార్కెట్‌లో సిద్దన్ నడుస్తూ వెళుతున్నపుడు "హలో మాస్టర్" అంటూ ఆయన శిష్యులు పలకరిస్తారు. ఆయన శిష్యుల్లో ఎక్కువ మంది ముదుమలై చుట్టుపక్కల నివసించే ఆదివాసీ, దళిత నేపథ్యం ఉన్నవారే.
"నలుగురు సభ్యులున్న మా కుటుంబంలో మా అమ్మ ఒక్కతే పనిచేసేది. ఆమెకు నన్ను కోటగిరిలో ఉన్న బడికి పంపే స్తోమత లేదు," అని పూర్వ విధ్యార్థి 33 ఏళ్ళ ఆర్. రాజ్‌కుమార్ చెప్పారు. ఇతను కూడా ఇరుల సముదాయానికే చెందినవారు. బడి మానేసిన తర్వాత తటస్థ ప్రాంతం (బఫర్ జోన్)లో తిరుగుతున్న అతనిని ఒక సఫారీలో చేరమని సిద్దన్ అడిగారు. "పనిచేస్తున్నప్పుడు ఆయన్ని చూడగానే నేను ఆ రంగానికి ఆకర్షితుడనయ్యాను. తర్వాత నేను ట్రెక్కింగ్ మొదలుపెట్టి, సఫారీలలో డ్రైవర్లను గైడ్ చేయడం మొదలుపెట్టాను." అని రాజ్‌కుమార్ చెప్పారు.
*****
ఈ ప్రాంతంలో మద్యపానం తీవ్ర సమస్యగా మారింది. (చదవండి: నీలగిరులలో వారసత్వంగా కొనసాగుతోన్న పోషకాహారలోపం ) అటవీ ఆధారిత పనులు తనను చేసినట్లే యువ అదివాసులను సీసా(మద్యం) నుంచి దూరం చేస్తాయని సిద్దన్ ఆశిస్తున్నారు. "స్కూలు మానేసిన కుర్రాళ్ళకు చేయడానికి ఏపనీ ఉండదు. ఇది మద్యపానం వ్యసనంగా మారటానికి (ఒక) కారణం. వాళ్ళకు మంచి ఉపాధి అవకాశాలు లేవు, అందుకే తాగుతారు." అంటారు సిద్దన్..
స్థానిక కుర్రాళ్ళకు అడవి పట్ల ఆసక్తి కలిగించడం, వ్యసనాలకు దూరంగా ఉంచడం అనేది తన కర్తవ్యంగా సిద్దన్ చూస్తారు. "నేను ఒక డ్రాంగోలాంటివాడిని. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ వేట పక్షులతో పోరాడటానికి డ్రాంగోలు మాత్రమే ధైర్యం చేస్తాయి." అని దూరంగా పాయలుగా చీలిన తోక ఉన్న నల్లటి చిన్నపక్షిని చూపిస్తూ చెప్పారు సిద్దన్.
అనువాదం: పి. పావని