జస్‌దీప్ కౌర్ బాగా చదువుకోవడానికి స్మార్ట్‌ఫోన్ కొనవలసి వచ్చినప్పుడు, ఆమె తల్లిదండ్రులు ఆమెకు రూ. 10,000 అప్పుగా సర్దారు. ఆ అప్పు చెల్లించడానికి, 18 ఏళ్ళ జస్‌దీప్ కౌర్, తన 2023 వేసవి సెలవులను వరి నాట్లు వేస్తూ గడిపింది.
పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాలో, తమ కుటుంబాలకు సహాయంగా ఉండడానికి పొలం పనులు చేసే దళిత యువతుల్లో ఆమె కూడా ఒకరు.
“మేం ఈ పొలం పనిని మా ఆనందం కోసం చేయడంలేదు, మా కుటుంబాల నిస్సహాయత వల్ల చేస్తున్నాం,” అని జస్‌దీప్ తెలిపింది. ఆమెది పంజాబ్‌లో షెడ్యూల్డ్ కులానికి చెందిన మౙహబీ సిక్కు కుటుంబం. ఆమె సముదాయంలో చాలామందికి సొంత భూమి లేకపోవడంతో, అగ్రవర్ణాలకు చెందిన రైతుల పొలాల్లో పని చేస్తుంటారు.
ఒక ఆవును కొనుగోలు చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఒక మైక్రోఫైనాన్స్ కంపెనీ నుండి రూ.38,000 అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బు నుంచే వారు ఆమెకు అప్పు ఇచ్చారు. ఒక లీటరు ఆవు పాలను రూ.40కి అమ్మితే వచ్చే ఆదాయంతో తమ ఇంటి ఖర్చులను వెళ్ళదీసుకోవచ్చని వాళ్ళ ఆలోచన. శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాలోని ఖుండే హలాల్ గ్రామంలో సంపాదన అవకాశాలు చాలా పరిమితం - ఇక్కడి జనాభాలో 33 శాతం మంది వ్యవసాయ కూలీలే.
జూన్ నెలలో కళాశాల పరీక్షకు హాజరుకావలసి వచ్చినప్పుడు, జస్‌దీప్‌కు ఆ స్మార్ట్‌ఫోన్ అమూల్యమైన సహాయం చేసింది - వరి పొలాల్లో పనిచేస్తూ, మధ్యలో దొరికిన రెండు గంటల విరామంలో ఆమె ఆన్‌లైన్‌లో ఆ పరీక్ష రాసింది. “పని వదిలేసే పరిస్థితి కాదు నాది. పనికి బదులు కాలేజీకి వెళ్తే, ఆ రోజు నా కూలీ పోతుంది,” అని ఆమె పేర్కొంది.



















