మధ్య భారతదేశంలోని ఖర్‌గౌన్ పట్టణంలో అది ఏప్రిల్ నెలలోని ఒక వెచ్చని రోజు. మధ్యప్రదేశ్‌లోని ఈ పట్టణంలో రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలోకి దూసుకువస్తోన్న బుల్‌డోజర్‌ల ఝుమ్మనే శబ్దం, అక్కడి నివాసితుల ఉదయపు సందడికి అకస్మాత్తుగా అంతరాయం కలిగించింది. అక్కడ నివాసముండేవారంతా తమ చిన్న చిన్న ఇళ్ళనుండీ దుకాణాల నుండీ భయం భయంగా బయటకు వచ్చారు.
వసీమ్ అహ్మద్ (35) భయంతో నివ్వెరపోయి చూస్తుండగానే, బుల్‌డోజర్‌కున్న భారీ స్టీలు బ్లేడ్లు అతని దుకాణాన్ని అందులో ఉన్న విలువైన వస్తువులతో సహా నిమిషాలలో నలగగొట్టి నాశనం చేసేశాయి. "నా దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్నీ ఈ దుకాణం మీదే ఖర్చుపెట్టేశాను," అన్నారతను.
రాష్ట్ర ప్రభుత్వం 2022, ఏప్రిల్ 11న పంపించిన బుల్‌డోజర్లు కేవలం అతని చిన్న దుకాణాన్నే కాక, ఖర్‌గౌన్‌లోని ముస్లిమ్ జనాభా ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో సుమారు 50 వరకూ ఇళ్ళనూ దుకాణాలనూ నేలమట్టం చేశాయి. ఈ విధంగా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయటం ద్వారా రామ నవమి పండుగ సందర్భంగా రాళ్ళు రువ్విన ‘విధ్వంసకారుల’పై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార న్యాయం తీర్చుకుంది.
కానీ వసీమ్ వంటివారు రాళ్ళు విసిరారని నిరూపించడం కష్టం. ఎందుకంటే రెండు చేతులను కోల్పోయిన ఆయన రాళ్ళను తీసుకొని రువ్వటం అటుంచి, ఎవరిదైనా సహాయం లేకుండా టీ కూడా తాగలేరు.
"ఆ రోజు జరిగిన సంఘటనతో నాకేమాత్రం సంబంధం లేదు," అంటారు వసీమ్.
ఒక ప్రమాదంలో రెండు చేతులనూ పోగొట్టుకోవడానికి ముందు ఆయన రంగులు వేసే పని చేసేవారు. "ఒక రోజు నేను పని చేస్తుండగా విద్యుదాఘాతం తగిలింది. వైద్యులకు నా రెండు చేతులనూ తీసివేయక తప్పలేదు. ఇది చాలా విపత్తే అయినప్పటికీ, ఇందులోంచి బయటపడే దారి దొరికింది (దుకాణం పెట్టడంతో)," తన దుస్థితికి వ్యర్థంగా చింతిస్తూ కూర్చోవడం కంటే ఈ పని చేసినందుకు గర్వపడుతూ చెప్పారతను.








