మమతా పరేడ్
PARIలో మా సహోద్యోగి. అరుదైన ప్రతిభ, నిబద్ధత కలిగిన ఈ యువ జర్నలిస్ట్, డిసెంబర్
11, 2022న విషాదకరంగా తన జీవితాన్ని ముగించింది.
ఆమె మరణించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ ప్రత్యేక పాడ్‌కాస్ట్‌ని మేం మీకు అందిస్తున్నాం. ఇందులో మహారాష్ట్ర, పాలఘర్ జిల్లాలోని వాడా తాలూకాకు చెందిన తన ప్రజలైన వర్లీ ఆదివాసీ సముదాయపు కథను మమత వివరిస్తుంది. ఈ ఆడియోను ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందు రికార్డ్ చేసింది.
ప్రాథమిక సౌకర్యాలు, హక్కుల కోసం వారి పోరాటాల గురించి మమత రాసింది. ప్రపంచ పటంలో కనిపించని అనేక చిన్న కుగ్రామాల గురించి ఈ జర్నలిస్ట్ సాహసి నివేదించింది. ఆకలి, బాల కార్మికులు, వెట్టి కార్మికులు, పాఠశాల విద్య, భూమి హక్కులు, స్థానభ్రంశం, జీవనోపాధి, ఇంకా మరెన్నో వెషయాలపై మమత వార్తాసేకరణ చేసింది.
ఈ ఎపిసోడ్‌లో మమత
తన గ్రామమైన మహారాష్ట్రలోని నింబవలిలో జరిగిన అన్యాయాన్ని గురించిన
కథనాన్ని
వివరిస్తోంది. ముంబయి-వడోదర జాతీయ రహదారి కోసం ఒక నీటి ప్రాజెక్టును నిర్మిస్తామని
మభ్యపెట్టి తమ పూర్వీకుల నుంచి వస్తోన్న భూమిని ఇచ్చేలా గ్రామస్తులను ప్రభుత్వ అధికారులు
ఎలా మోసగించారో ఆమె వివరించింది. ఆ ప్రాజెక్ట్ వారి గ్రామాన్ని రెండుగా చీల్చుకుంటూ
వెళ్ళింది, అందుకు ప్రభుత్వం అందించిన పరిహారం కూడా చాలా తక్కువ.
PARIలో మమత గురించి తెలుసుకుని, ఆమెతో కలిసి పనిచేయడాన్ని మేం చాలా గొప్పగా భావిస్తున్నాం; PARIలో ఆమె అందించిన మొత్తం తొమ్మిది కథనాల జాబితా ఇక్కడ ఉంది.
మమత తన రచనల ద్వారా, సముదాయంతో కలిసి తాను చేసిన పని ద్వారా జీవించేవుంటుంది. ఆమెను కోల్పోవడం చాలా లోతైన విషాదం.
ఈ పాడ్‌కాస్ట్‌ను రూపొందించడంలో సహాయం చేసినందుకు హిమాంశు సైకియాకు మా ధన్యవాదాలు
కవర్ ఇమేజ్‌పై ఉన్న మమత ఫొటో ఆమె ఫెలోగా ఉన్న సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ వెబ్‌సైట్ నుండి తీసుకున్నది. ఆ ఫొటోను ఉపయోగించుకునేందుకు మమ్మల్ని అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి