ఖుమా థియెక్‌కి మణిపుర్‌లోని చురాచాంద్‌పుర్ జిల్లాలోని లాంగ్జా అనే తన గ్రామానికి తిరిగి వెళ్లాలనే ఆలోచనే ప్రస్తుతం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 64 ఏళ్ళ ఈ రైతు గత 30 ఏళ్ళుగా లాంగ్జాలోనే నివాసం ఉంటున్నారు. ఈ గ్రామం ఆయనకు ఎంతో ఆత్మీయమైనదీ, మాలిమి అయినదీ కూడా. అతను తన కుమారుడైన డేవిడ్‌ను పెంచిందీ, మధ్యాహ్న భోజనం డబ్బా కట్టి అతన్ని బడికి పంపిందీ, వరిపొలాల్లో అతనితో కలిసి పనిచేసిందీ ఇక్కడే. అతను మొదటిసారి తాత అయ్యింది కూడా ఇక్కడే. ఖుమాకు లాంగ్జాయే ప్రపంచం; ఆయన చాలా సంతుష్టితో ఉండే ప్రపంచం.
ఇందంతా జులై 2, 2023 వరకే…
ఆ రోజు ఆయన జీవితకాల జ్ఞాపకాలను హింసాత్మకంగా తుడిచిపెట్టింది, ఖుమా తన మనసు నుండి తీసేయలేని గాయాలను మిగిల్చింది. అతనికి నిద్రలోనూ మెలకువలోనూ కుదురుగా ఉండనివ్వని దృశ్యమది. ఆది లాంగ్జా ప్రవేశ ద్వారం వద్ద వెదురు కంచెపై ఉంచిన అతని కొడుకు మొండెం నుంచి వేరుచేసిన తల దృశ్యం.
ఖుమా సొంత రాష్ట్రం, భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని మణిపుర్, మే 3, 2023 నుండి జాతి ఘర్షణల్లో చిక్కుకుంది. ఈ ఏడాది మార్చి చివరలో, మణిపుర్‌లోని హైకోర్టు ఆధిపత్య మైతేయీ సముదాయానికి "ఆదివాసీ హోదా"ని ఇచ్చింది. ఈ హోదా వారికి ఆర్థిక ప్రయోజనాలను, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పిస్తుంది. కుకీ తెగలు ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాలలో భూమిని కొనుగోలు చేసేందుకు కూడా వీలు కల్పిస్తుంది. అయితే ఆ తర్వాత ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఈ నిర్ణయం ఇప్పటికే జనాభాలో 53 శాతంగా ఉన్న మైతేయీలకు రాష్ట్రంపై మరింత ఆధిపత్యాన్ని ఇస్తుందని రాష్ట్ర జనాభాలో 28 శాతంగా ఉన్న కుకీ సముదాయం నమ్ముతోంది.











