"శాసన్ కా బరమ్ కదర్ కరత్ నాహీ ఆమ్‌చ్యా మెహనతీచీ (మా కష్టాన్ని ప్రభుత్వం ఎందుకు మెచ్చుకోవట్లేదు)?" అని ప్రశ్నిస్తున్నారు అంగణ్‌వాడీ కార్యకర్త మంగళ్ కర్పే.
"దేశాలా నిరోగీ, సుదృఢ్ ఠేవన్యాత్ ఆమ్‌చా మోఠా హాత్‌భార్ లాగ్తో (దేశాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి మేం చాలా కృషి చేస్తున్నాం)", బాలింతల, గర్భవతుల, వారి పసిబిడ్డల కోసం రూపొందించిన రాష్ట్ర పథకాలను అమలుచేస్తున్న తన వంటి అంగణ్‌వాడీ కార్యకర్తల గురించి ప్రస్తావిస్తూ అన్నారామె..
ముప్పై తొమ్మిదేళ్ళ మంగళ్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా, రాహతా తాలూకా డోర్‌హాళే అనే ఊరిలో అంగణ్‌వాడీ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఆమెలాగే రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది మహిళలు అంగణ్‌వాడీ కార్యకర్తలుగానూ సహాయకులుగానూ పని చేస్తున్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఏకీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసిడిఎస్) కింద మొత్తంగా ఆరోగ్య, పోషక, ప్రారంభ అభ్యాస సేవలను వీరు అమలుచేస్తున్నారు.
రాష్ట్రం వారి పట్ల చూపిస్తున్న ఉదాసీనతను నిరసిస్తూ, డిసెంబర్ ఐదవ తారీఖున ప్రారంభమైన మహారాష్ట్రవ్యాప్త నిరవధిక నిరసనలో వందల సంఖ్యలో అంగణ్‌వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నారు.
"ఇంతకుముందు కూడా మేం చాలాసార్లు నిరసనలు చేపట్టాం," అంటారు మంగళ్. "మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కావాలి. నెలకి 26000 [రూపాయలు] వేతనంగా ఇవ్వాలి. పదవీ విరమణ తరువాత మాకు పింఛన్లు, ప్రయాణ, ఇంధన ఖర్చులు ఇవ్వాలి," అంటున్నారావిడ, నిరసనకారుల ముఖ్యమైన డిమాండ్ల జాబితాను వివరిస్తూ.












