"ఒక్క చేప కూడా లేకుండా నేను ఇంటికి పోవటం ఇది ఆరవ రోజు," వులర్ సరస్సు ఒడ్డున నిల్చొని ఉన్న అబ్దుల్ రహీమ్ కావా అన్నారు. 65 ఏళ్ళ ఆ మత్స్యకారుడు ఇక్కడ తన భార్య, కుమారుడితో కలిసి తమ ఒంటి అంతస్తు ఇంటిలో నివాసముంటున్నారు.
బాండిపోర్ జిల్లా, కని బఠీ ప్రాంతంలో ఉండే ఈ సరస్సుకు ఝేలం నది, మధుమతి సెలయేరుల ద్వారా నీరు చేరుతుంది. చుట్టూ నివాసముండే ప్రజలకు ఈ వులర్ సరస్సే ఏకైక జీవన వనరు. ఒక్కో గ్రామంలో కనీసంగా 100 కుటుంబాలు ఉండే సుమారు 18 గ్రామాలు ఈ సరస్సు ఒడ్డున నివసిస్తున్నాయి.
"చేపలు పట్టుకోవటమొక్కటే ఇక్కడి జీవన వనరు," అన్నారు అబ్దుల్. కానీ "సరస్సులో నీరు లేదు. ఇప్పుడు మేం నీటిగుండా నడచిపోగలం, ఎందుకంటే సరస్సు మూలల్లో నీరు నాలుగు లేదా ఐదు అడుగులకు దిగిపోయింది," సరస్సు అంచులను చూపిస్తూ అన్నారు అబ్దుల్.
ఆయనకు తెలుసు - మూడవ తరం మత్స్యకారుడైన అబ్దుల్, ఉత్తర కశ్మీర్‌లోని ఈ సరస్సులో 40 సంవత్సరాలుగా చేపలు పడుతున్నారు. “నా చిన్నప్పుడు మా నాన్న నన్ను తన వెంట తీసుకెళ్ళేవారు. ఆయన్ని చూస్తూ చూస్తూ, నేను చేపలు పట్టడం నేర్చుకున్నాను,” అని అతను చెప్పారు. అబ్దుల్ కుమారుడు కూడా ఈ కుటుంబ వృత్తిని అనుసరించారు.
ప్రతి ఉదయం అబ్దుల్, ఆయన తోటి మత్స్యకారులు తాము నైలాన్ దారాలతో అల్లిన జాల్ (వల)లను పట్టుకొని వులర్ సరస్సులోకి పడవలు నడుపుకుంటూ వెళ్తారు. నీటిలోకి వల విసురుతూ వారు, చేపలను ఆకర్షించేందుకు కొన్నిసార్లు చేతితో తయారుచేసిన డ్రమ్మును వాయిస్తారు.
వులర్ భారతదేశంలోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సు. కానీ గత నాలుగేళ్ళుగా వులర్ సరస్సు నీటిలో పెరిగిపోయిన కాలుష్యం, ఏడాది మొత్తం సాగే చేపల వేటను దాదాపు అసాధ్యంగా మార్చేసింది. "ఇంతకుముందు మేం ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు చేపలు పట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు కేవలం మార్చి, ఏప్రిల్ నెలలలో మాత్రమే పడుతున్నాం," అన్నారు అబ్దుల్.


