“మా అత్తమామలు తమకు తగిన వధువు కావాలని అతనికి డబ్బు చెల్లించారు. ఇది ఇక్కడ చాలా మామూలు పద్ధతి." అంటూ ఇరవై పైబడిన వయసులో ఉన్న రుమా ఖీచడ్, తన కథను నాతో పంచుకున్నారు. “దూరం నుండి వచ్చి ఇక్కడ [రాజస్థాన్] స్థిరపడడం అందరికీ సాధ్యం కాదు. నా జెఠాని [పెద్ద తోడికోడలు]...”

" పచాస్ హజార్ లగా కే ఉస్కో లాయే థే! ఫిర్ భీ, సాత్ సాల్ కి బచ్చీ హై, ఉస్కో భీ ఛోడ్ కే భాగ్ గయీ వో [మేం 50,000 రూపాయలు ఇచ్చి ఆమెను తెచ్చుకున్నాం. కానీ ఆమె ప్రస్తుతం ఏడేళ్ళ వయసున్న తన కూతురిని కూడా వదిలి పారిపోయింది]," కోడల్ని చెప్పనివ్వకుండా అడ్డుపడి తన కథనాన్ని నొక్కిచెప్పారు 67 ఏళ్ళ యశోద ఖీచడ్ (అసలు పేరు కాదు).

“ఆ మనిషి! ఆమె మూడు సంవత్సరాలు ఉంది." పంజాబ్‌కు చెందిన తన పెద్ద కోడలు పారిపోయిన సంగతి చెబుతోన్న యశోద ఇంకా ఆవేశంగానే ఉన్నారు. “ఆమెకెప్పుడూ భాష సమస్యగా ఉండేది. మా భాష నేర్చుకోలేదు. పెళ్ళయిన తర్వాత మొదటిసారి, ఒక రక్షా బంధన్ పండగ సమయంలో, వెళ్ళి తన సోదరుడిని, కుటుంబ సభ్యులను కలవాలనుకుంటున్నట్లు చెప్పింది. మేం ఆమెను వెళ్ళనిచ్చాం. ఆమె మరి తిరిగి రాలేదు. ఇప్పటికి ఆరు సంవత్సరాలయింది,” అన్నారామె.

యశోద రెండవ కోడలైన రుమా, వేరొక దళారి ద్వారా ఝుంఝునున్ (ఝుంఝును అని కూడా పిలుస్తారు)కి వచ్చింది.

ఆమెకు పెళ్ళి జరిగేటప్పటికి తన వయసెంతో తెలియదు. "నేనెప్పుడూ బడికి వెళ్ళలేదు కాబట్టి నేను ఏ సంవత్సరంలో పుట్టానో చెప్పలేను," బూడిద రంగులో ఉన్న అల్మారాలో తన ఆధార్ కార్డు కోసం వెతుకుతూ చెప్పిందామె.

ఐదేళ్ళ వయసున్న ఆమె కూతురు, ఆ గదిలో మంచం మీద ఆడుకోవడాన్ని నేను చూస్తున్నాను.

“బహుశా నా ఆధార్ నా భర్త వాలెట్‌లో ఉండివుంటుంది. నాకిప్పుడు 22 ఏళ్ళుండొచ్చని అనుకుంటున్నాను" చెప్పింది రుమా.

Left: Yashoda says that Ruma learnt to speak in Rajasthani within six months of her marriage, unlike her elder daughter-in-law.
PHOTO • Jigyasa Mishra
Right: Ruma is looking for her Aadhaar card copy to confirm her age
PHOTO • Jigyasa Mishra

ఎడమ: తన పెద్ద కోడలులా కాకుండా పెళ్ళయిన ఆరు నెలలకే రుమా రాజస్థానీలో మాట్లాడటం నేర్చుకుందని యశోద చెప్పారు. కుడి: తన వయస్సును నిర్ధారించేందుకు ఆధార్ కార్డ్ కోసం వెతుకుతోన్న రుమా

"నేను గోలాఘాట్‌లో [అస్సామ్] పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించిన తర్వాత," అంటూ ఆమె కొనసాగించింది. "నాకు కేవలం ఐదు సంవత్సరాలు. అప్పటి నుండి భయ్యా [అన్న], భాభీ [వదిన], నానా [తాత], నాని [అమ్మమ్మ]లే నా కుటుంబం,” చెప్పిందామె.

2016లో, ఓ ఆదివారం మధ్యాహ్నం, అస్సామ్‌లోని గోలాఘాట్ జిల్లాలో ఉన్న తాతయ్య ఇంటికి తన సోదరుడు వింత దుస్తులను ధరించిన ఇద్దరు రాజస్థానీ మగవాళ్ళను తీసుకురావటం రుమా చూసింది. వారిలో ఒకరు యువతులను వధువులుగా మార్చే దళారీ.

"ఇతర రాష్ట్రాల ప్రజలు నా స్వగ్రామానికి రావడం మామూలుగా జరిగే విషయం కాదు," అంది రుమా. ఆమెకు కట్నం లేకుండా మంచి భర్త వస్తాడని వారు కుటుంబానికి వాగ్దానం చేశారు. వారు డబ్బు ఇవ్వడమే కాక, డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి కూడా చేస్తామని మాట ఇచ్చారు.

చూడటానికి వచ్చిన మగవాళ్ళలో ఒకరితో 'తగిన అమ్మాయి' రుమాను పంపారు. ఒక వారంలోపలే ఇద్దరు వ్యక్తులు ఆమెను అస్సామ్‌లోని ఆమె ఇంటి నుండి 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝుంఝునున్ జిల్లాలోని కిషన్‌పురా గ్రామానికి తరలించారు.

ఆమె పెళ్ళికి అంగీకరించినందుకు బదులుగా ఇస్తామని వాగ్దానం చేసిన డబ్బు, రుమా కుటుంబానికి ఇప్పటికీ చేరలేదు. ఆమె అత్తమామలైన ఖీచడ్‌లు, వధువు కుటుంబానికి ఇవ్వాల్సిన వాటాతో సహా తాము దళారికి డబ్బు చెల్లించినట్లు పేర్కొన్నారు.

"చాలా ఇళ్ళల్లో మీకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కోడళ్ళు కనిపిస్తారు," అని రుమా చెప్పింది. మధ్యప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ల నుండి ఎక్కువగా యువతులను రాజస్థాన్‌కు తీసుకువస్తున్నారని స్థానికులు, ఆ ప్రాంతంలో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

Left: Ruma right outside her in-law's house.
PHOTO • Jigyasa Mishra
Right: Ruma with her husband Anil and her daughter
PHOTO • Jigyasa Mishra

ఎడమ: తన అత్తవారి ఇంటి బయట రుమా. కుడి: తన భర్త అనిల్, కుమార్తెలతో రుమా

రాజస్థాన్‌లో వధువు దొరకటం చాలా కష్టం. (0 నుండి 6 ఏళ్ళ వయసు) పిల్లల లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) పరంగా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉంది. 33 జిల్లాల్లో ఝుంఝునున్, సీకర్‌లు అత్యంత దారుణంగా ఉన్నాయి. గ్రామీణ ఝుంఝునున్‌లో సిఎస్ఆర్ 1,000 మంది అబ్బాయిలకు 832 మంది బాలికలుగా ఉంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం దేశీయంగా ఉన్న సంఖ్య - 1,000 మంది అబ్బాయిలకు 923 మంది బాలికలు - కంటే చాలా తక్కువ.

ఈ జిల్లాలో మగపిల్లలను ఎక్కువగా కోరుకోవటం వల్లనే బాలికల కొరత ఏర్పడిందని మానవ హక్కుల కార్యకర్త వికాస్ కుమార్ రాహర్ అన్నారు. “ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండటం వలన తమ కొడుకులకు వధువులు దొరకకపోవటం, తల్లిదండ్రులను సులువుగా దొరికే దళారులను సంప్రదించేలా చేస్తుంది. ఈ దళారులు ఇటువంటి కుటుంబాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా పేద నేపథ్యాల నుంచి వచ్చిన అమ్మాయిలను తీసుకువస్తారు,” అని ఆయన చెప్పారు.

2019-2020 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం, రాజస్థాన్‌లో గత ఐదేళ్ళలో పుట్టిన పిల్లల లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది బాలురకు 940 మంది బాలికలు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత పడిపోయి 1,000 మంది బాలురకు 879 మంది బాలికలు అయ్యింది. ఝుంఝునున్‌ జనాభాలో 70 శాతం కంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.

రాహర్ స్థానిక ప్రభుత్వేతర సంస్థ అయిన శిక్షిత్ రోజ్‌గార్ కేంద్ర ప్రబంధక్ సమితి (ఎస్ఆర్‌కెపిఎస్) సమన్వయకర్త. “ప్రజలు [వధువుల కోసం] దళారీకిచ్చే వాటాతో సహా రూ. 20 వేల నుంచి 2.5 లక్షల వరకూ డబ్బు ఇస్తారు," అన్నారాయన.

కానీ ఎందుకు?

“అంత సొమ్ము లేకుండా ఎవరైనా(వధువు) ఎలా దొరుకుతారు?” అని యశోద ప్రశ్నించారు. “మీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే తప్ప, ఇక్కడెవ్వరూ మీకు తమ కూతురిని ఇవ్వరు."

From left: Ruma’s father-in-law, Ruma near the wall, and her mother-in-law Yashoda with her grand-daughter on her lap. The family has adopted a dog who follows Yashoda's c ommands
PHOTO • Jigyasa Mishra

ఎడమ నుంచి: రుమా మామగారు, గోడ దగ్గర నిలుచున్న రుమా, తన మనవరాలిని ఒడిలో కూర్చోబెట్టుకున్న ఆమె అత్తగారు యశోద. యశోద ఆజ్ఞలను పాటించే ఆ కుక్కను ఈ కుటుంబం పెంచుకుంటోంది

యశోద ఇద్దరు కుమారులు తమ తండ్రికి పొలంలో వ్యవసాయం చేయడంలోనూ, వారి ఆరు పశువులను చూసుకోవడంలోనూ సహాయం చేస్తారు. వారి కుటుంబానికి 18 బిఘాల భూమి ఉంది. అందులో వారు చిరుధాన్యాలు, గోధుమలు, పత్తి, ఆవాలు పండిస్తారు. (రాజస్థాన్‌లోని ఈ భాగంలో ఒక బిఘా 0.625 ఎకరాలకు సమానం).

“నా కొడుకులకు ఇక్కడ భార్యలు దొరకలేదు, అందువల్ల బయటి నుంచి తెచ్చుకోవడమొక్కటే మాకున్న అవకాశం. ఎంతకాలమని మా కుమారులను ఒంటరిగా, పెళ్ళిచేయకుండా ఉంచగలం?" అని యశోద అడుగుతారు.

ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాల, నేరాల కార్యాలయం (UNODC), వ్యక్తి అక్రమ రవాణాను నిరోధించడానికి, అణచివేయడానికి, శిక్షించడానికి అనుసరించే ప్రోటోకాల్‌ (Protocol to Prevent, Suppress and Punish Trafficking in Person)లో వ్యక్తుల అక్రమ రవాణాను ఈ విధంగా నిర్వచించింది: “లాభపేక్షతో దోపిడీ చేసే లక్ష్యంతో వ్యక్తులను బలవంతంగా, మోసంచేసి లేదా మోసపూరితంగా నియమించటం, రవాణా, బదిలీ, ఆశ్రయమివ్వటం లేదా పుచ్చుకోవటం." భారతదేశంలో ఇది నేరం, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 370 ప్రకారం శిక్షార్హమైనది. దీనికి 7 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.

"రాజస్థాన్‌లోని ప్రతి జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఉంది," అని ఝుంఝునున్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మృదుల్ కఛావా చెప్పారు. ఈ అలవాటును మాన్పించడం కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను ఆయన PARI కి వివరించారు. “కొన్ని నెలల క్రితం అస్సామ్ పోలీసులు ఒక అమ్మాయి అక్రమ రవాణా గురించి మమ్మల్ని సంప్రదించారు. మేం దర్యాప్తు చేసి, ఆ బాలికను రక్షించి, ఆమెను వెనక్కి పంపించాం. అయితే కొన్ని సందర్భాల్లో అక్రమ రవాణాకు గురైన మహిళలు తిరిగి వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు. తమ ఇష్టానుసారం ఇక్కడకు వచ్చామని చెబుతున్నారు. అప్పుడు పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది.” అని ఆయన అన్నారు.

రుమా తన కుటుంబాన్ని తరచుగా కలవాలని ఖచ్చితంగా కోరుకుంటోంది, కానీ తన అత్తమామల ఇంట్లోనే ఉండాలనుకుంటోంది. "నేనిక్కడ ఒక మామూలు అమ్మాయిలా సంతోషంగా ఉన్నాను," అని ఆమె చెప్పింది. “ఎలాంటి సమస్యలు లేవు. నేను చాలా దూరంగా ఉండటం వల్ల సహజంగానే తరచుగా మా ఇంటికి వెళ్ళటం కుదరటంలేదు. అయితే, నేను నా అన్ననూ కుటుంబ సభ్యులనూ త్వరలో కలవాలనుకుంటున్నాను." రుమా ఇప్పటి వరకు తన అత్తమామల ఇంట్లో ఎలాంటి శారీరక లేదా మాటల వేధింపులను ఎదుర్కోలేదు.

Ruma visited her family in Assam twice since her marriage about seven years ago. She speaks to them occassionally over the phone
PHOTO • Jigyasa Mishra

ఏడేళ్ళ క్రితం వివాహమైనప్పటి నుంచి రుమా అస్సామ్‌లోని తన కుటుంబాన్ని రెండుసార్లు కలిసింది. ఆమె వారితో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటుంది

రుమాకు తానొక 'మామూలు అమ్మాయి'నని అనిపించవచ్చు, కాని 20 ఏళ్ళు పైబడిన సీతది (అసలు పేరు కాదు) భిన్నమైన కథనం. 2019లో పశ్చిమ బెంగాల్ నుండి సీతను అక్రమంగా రవాణా చేశారు. ఆమెది పంచుకోవడానికి భయపడే కథనం: “మీరు నా జిల్లా పేరును, లేదా నా కుటుంబంలోని ఎవరి పేరునైనా ఉపయోగించడం నాకు ఇష్టం లేదు."

“2019లో, ఝుంఝునున్ నుంచి ఒక రాజస్థానీ దళారీ పెళ్ళి ప్రతిపాదనతో నా కుటుంబాన్ని కలిశాడు. ఆ కుటుంబానికి చాలా డబ్బు ఉందని, నా కాబోయే భర్త ఉద్యోగం గురించి అబద్దం చెప్పాడు. అతను మా నాన్నకు 1.5 లక్షల రూపాయలు ఇచ్చి, నన్ను వెంటనే తీసుకెళతానని పట్టుబట్టాడు." పెళ్లి రాజస్థాన్‌లో జరుగుతుందని, ఫోటోలు పంపిస్తానని అతను చెప్పాడు.

అప్పులతో, నలుగురు చిన్న పిల్లలతో సతమతమవుతున్న తన తండ్రికి సాయపడుతున్నానని భావించిన సీత అదే రోజు ఆతనితో వెళ్లిపోయింది.

"రెండు రోజుల తర్వాత నన్ను ఒక గదిలో బంధించారు. ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను నా భర్త అని నేను అనుకున్నాను." ఆమె కొనసాగించింది. "అతను నా బట్టలు చింపడం మొదలుపెట్టాడు. నేను అతన్ని పెళ్ళి గురించి అడిగాను, అతను నన్ను కొట్టాడు. నాపై అత్యాచారం జరిగింది. ఆ తరువాత రెండు రోజులు నేను అతి తక్కువ ఆహారంతో అదే గదిలో గడిపాను, ఆపై నన్ను నా అత్తమామల ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడే నా భర్త వేరేవాడని, నాకంటే ఎనిమిదేళ్ళు పెద్దవాడని నాకు అర్థమైంది.”

"వయస్సు, ఆర్థిక పరిస్థితిని బట్టి వధువును తీసుకువచ్చే బ్రోకర్లు ఉన్నారు," అని ఝుంఝునున్‌లో ఎస్ఆర్‌కెపిఎస్ వ్యవస్థాపకుడు రాజన్ చౌధరి చెప్పారు. “నేనొకసారి ఒక దళారిని నాకోసం ఒక అమ్మాయిని తీసుకురాగలవా అని అడిగాను, నాకు 60 ఏళ్ళు పైబడ్డాయని గమనించండి. నన్ను ఆశ్చర్యపరుస్తూ అతను, ఎక్కువ ఖర్చవుతుంది, కానీ చాలా సులభంగా ఏర్పాటు చేయవచ్చని చెప్పాడు. అతను సూచించిన పథకం ఏమిటంటే, ఒక యువకుడిని తన వెంట తీసుకెళ్ళి కాబోయే వరుడిగా చూపిస్తాడు." కుటుంబసభ్యులు తమ కుమార్తెను అప్పగించిన తర్వాత ఆ దళారీ ఆమెను రాజస్థాన్‌కు తీసుకువచ్చి వివాహం జరిగేలా చూస్తాడు.

Varsha Dangi was trafficked from her village in Sagar district of Madhya Pradesh and brought to Jhunjhunun
PHOTO • Jigyasa Mishra

వర్ష డాంగీని మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని ఆమె గ్రామం నుండి అక్రమ రవాణా చేసి ఝుంఝునున్‌కు తీసుకువచ్చారు

వధువులను ఝుంఝునున్‌కు అక్రమ రవాణా చేయటం వెనుక అసలు సమస్య జిల్లాలోని లింగ నిష్పత్తి అని రాజన్ అంటారు. "ఆడపిల్లల పిండాలను లక్ష్యంగా చేసుకునే చట్టవిరుద్ధమైన లింగ నిర్ధారణ పరీక్షలు జిల్లా లోపలా బయటా చాలా సులువుగా, పెద్ద ఎత్తున జరుగుతాయి," అని ఆయన పేర్కొన్నారు.

వర్ష డాంగీ ఝుంఝునున్‌లో రుమా ఇంటికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్సిసర్ గ్రామంలో నివసిస్తున్నారు. ఆమెకు 2016లో తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన ఒక వ్యక్తితో వివాహమైంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఉన్న తన ఇంటి నుంచి ఆమెను ఈ గ్రామానికి తీసుకొచ్చారు.

"అతను వయసులో పెద్దవాడే కానీ నన్ను ప్రేమించాడు," అని వర్ష చెప్పారు. “నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా అత్తగారు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు నా భర్త చనిపోయాడు, పరిస్థితులు ఘోరంగా మారాయి,” అని 32 ఏళ్ళ వర్ష చెప్పారు.

యహాఁ కా ఏక్ బిచౌలియా థా జో ఎమ్‌పీ మే ఆతా థా. మేరే ఘర్ వాలోఁ కే పాస్ పైసే నహీ థే దహేజ్ దేనే కే లియే, తో ఉన్హోఁనే ముఝే భేజ్ దియా యహా పర్ బిచౌలియా కే సాథ్ (రాజస్థాన్‌కు చెందిన ఒక మధ్యవర్తి ఉండేవాడు, అతను క్రమం తప్పకుండా మధ్యప్రదేశ్‌కు రాకపోకలు సాగించేవాడు. నా కుటుంబం వద్ద నా పెళ్ళి కోసం కట్నం ఇవ్వడానికి డబ్బులు లేవు. అందుకే వాళ్ళు నన్ను అతనితో పాటు ఇక్కడికి పంపారు,)" అని ఆమె చెప్పారు.

ఆమె తన పొరుగువారింట్లో దాక్కుని మాతో మాట్లాడారు. “నా సాస్ (అత్తగారు) లేదా దేవ్‌రాణి [చిన్న తోడికోడలు] ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నాతో దీని గురించి మాట్లాడకండి. వారిలో ఎవరైనా మన మాటలు విన్నారంటే అది నాకు నరకమే,” అన్నారామె.

‘రాజస్థాన్‌కు చెందిన ఒక మధ్యవర్తి క్రమం తప్పకుండా మధ్యప్రదేశ్‌కు రాకపోకలు సాగించేవాడు. నా కుటుంబం వద్ద నా పెళ్ళి కోసం కట్నం ఇవ్వడానికి డబ్బులు లేవు. అందుకే వాళ్ళు నన్ను అతనితో పాటు ఇక్కడికి పంపారు’

వీడియో చూడండి: ఝుంఝనున్ కోసం 'తగిన అమ్మాయిల'ను కొనుగోలు చేయటం

ఆమె మాట్లాడుతున్నప్పుడు నాలుగేళ్ళ ఆమె కొడుకు బిస్కెట్ ఇమ్మని మారాం చేస్తున్నాడు. పొరుగింటివారే అతనికి కొన్ని బిస్కెట్లు ఇచ్చారు. "వీళ్ళే లేకుంటే," అని తన పొరుగింటివారిని చూపిస్తూ, "నా బిడ్డ, నేను ఆకలితో చనిపోయేవాళ్ళం. నా తోడికోడలికి, నాకు వేర్వేరు వంటగదులు ఉన్నాయి. నా భర్త చనిపోయినప్పటి నుండి ప్రతి పూటా భోజనం ఒక సవాలుగా మారింది." 2022లో తన భర్త మరణించినప్పటి నుండి జీవించేందుకు తాను ఆధారపడిన పరిమిత రేషన్ల గురించి మాట్లాడుతూ వర్ష కన్నీళ్లు పెట్టుకున్నారు.

“నన్ను ఇంటి నుండి వెళ్ళిపొమ్మని ప్రతిరోజూ అంటుంటారు. నేను బ్రతకాలంటే, నేను ఎవరో ఒకరి చూడా ను ధరించాలని మా అత్త అంటుంది,” ఒక వితంతువు, భర్త కుటుంబానికి చెందిన మరొక వ్యక్తిని అతని వయస్సుతో పట్టింపు లేకుండా ఇష్టంలేకపోయినా వివాహం చేసుకోవాలి, అనే ఒక రాజస్థానీ ఆచారాన్ని ప్రస్తావిస్తూ అన్నారు వర్ష. "నేను నా భర్త ఆస్తిలో వాటా అడుగుతానని ఆమె భయపడుతోంది," అని వర్ష దాని వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.

జిల్లాలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతం, జనాభాలో దాదాపు 66 శాతం మంది వ్యవసాయం చేస్తారు. ఆమె భర్త ఒక రైతు. ఆయన మరణించినప్పటి నుండి అతని భూమిని ఎవరూ సాగు చేయటంలేదు. ఆ కుటుంబానికి ఇద్దరు అన్నదమ్ములకు కలిపి 20 బిఘాల భూమి ఉంది.

“హమ్ తుమ్‌కో ఖరీద్‌కర్ లాయే హై ఢాయీ లాఖ్ మే. జో కామ్ బోలా జాయేగా వహ్ తో కర్నా హీ పడేగా [మేం 2.5 లక్షల డబ్బుపోసి కొనుక్కొని నిన్నిక్కడికి తీసుకువచ్చాం. మేం ఏం చెప్తే అది చేయటం మంచిది]," అంటూ తన అత్త తనను అప్పుడప్పుడూ ఎత్తిపొడుస్తూ ఉంటుందని వర్ష చెప్పారు.

“నేను ‘ ఖరీధీ హుయి ’ [అమ్ముడుపోయినది] అనే ట్యాగ్‌తో జీవిస్తున్నాను, దానితోనే మరణిస్తాను.”

Varsha says that after her husband's death her in-laws pressurise her to either live with her younger brother-in-law or leave
PHOTO • Jigyasa Mishra

తన భర్త చనిపోయిన తర్వాత తన మరిదితో కలిసి జీవించాలని, లేదంటే వెళ్ళిపోవాలని అత్తమామలు ఒత్తిడి చేశారని వర్ష చెప్పారు

*****

ఇదంతా డిసెంబర్ 2022లో జరిగింది. ఆరు నెలల తర్వాత, PARIతో ఫోన్లో మాట్లాడుతూన్నప్పుడు ఆమె గొంతు మారిపోయింది. " ఆజ్ సుబహ్ హమ్ అప్నే ఘర్ ఆ గయే హైఁ [ఈ ఉదయం మేం మా స్వంత కుటుంబం ఇంటికి తిరిగి వచ్చేశాం]," అని ఆమె చెప్పారు. తన జీవితాన్ని తన మరిదితో పంచుకోమని, లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపొమ్మని ఆమె అత్తింటివాళ్ళు ఆమెను బలవంతపెడుతూవచ్చారు. "వాళ్ళు నన్ను కొట్టారు కూడా. దాంతో నేను బయటకు వచ్చేయాల్సివచ్చింది," అని ఆమె అన్నారు.

ఇక భరించకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె మరిదికి ఇదివరకే వివాహమైంది, భార్యతో కలిసి జీవిస్తున్నాడు. “మా ఊరిలో వితంతువులు ఇంట్లోవారిని ఎవరినైనా పెళ్ళి చేసుకోవడం మామూలు విషయమే. వయసు, వైవాహిక స్థితి వంటి పట్టింపులేవీ ఉండవు," అని వర్ష చెప్పారు.

టీకా వేయించాలనే సాకుతో వర్ష తన కొడుకుతో కలిసి ఇల్లు వదిలి బయటపడ్డారు. బయటకు రాగానే ఆమె మధ్యప్రదేశ్‌కు వెళ్ళే రైలు ఎక్కేశారు. “మా పొరుగున ఉన్న మహిళలు మా టిక్కెట్ల కోసం కొంత సొమ్మును సేకరించారు. కానీ దారి ఖర్చులకు నా దగ్గర డబ్బు లేదు,” అని ఆమె చెప్పారు.

“నేనొకసారి 100 [పోలీస్]కు డయల్ చేసి పోలీసుల సాయం కోసం ప్రయత్నించాను, కానీ వారు పంచాయత్ నాకు సాయం చేస్తుందని చెప్పారు. నా కేసు పంచాయతీ కి వెళ్ళినప్పుడు, వాళ్ళు నాకు ఏ సాయమూ చేయలేదు.

ఆమె సరికొత్త విశ్వాసంతో, పరిస్థితుల పట్ల నియంత్రణా భావనతో మాట్లాడుతూ, "నాలాంటి స్త్రీల పట్ల ఎలా ప్రవర్తిస్తారో ప్రపంచం తెలుసుకోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను," అన్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jigyasa Mishra

ਜਗਿਆਸਾ ਮਿਸ਼ਰਾ ਉੱਤਰ ਪ੍ਰਦੇਸ਼ ਦੇ ਚਿਤਰਾਕੂਟ ਅਧਾਰਤ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ।

Other stories by Jigyasa Mishra
Editor : Pratishtha Pandya

ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਪਾਂਡਿਆ PARI ਵਿੱਚ ਇੱਕ ਸੀਨੀਅਰ ਸੰਪਾਦਕ ਹਨ ਜਿੱਥੇ ਉਹ PARI ਦੇ ਰਚਨਾਤਮਕ ਲੇਖਣ ਭਾਗ ਦੀ ਅਗਵਾਈ ਕਰਦੀ ਹਨ। ਉਹ ਪਾਰੀਭਾਸ਼ਾ ਟੀਮ ਦੀ ਮੈਂਬਰ ਵੀ ਹਨ ਅਤੇ ਗੁਜਰਾਤੀ ਵਿੱਚ ਕਹਾਣੀਆਂ ਦਾ ਅਨੁਵਾਦ ਅਤੇ ਸੰਪਾਦਨ ਵੀ ਕਰਦੀ ਹਨ। ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਦੀਆਂ ਕਵਿਤਾਵਾਂ ਗੁਜਰਾਤੀ ਅਤੇ ਅੰਗਰੇਜ਼ੀ ਵਿੱਚ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਹੋ ਚੁੱਕਿਆਂ ਹਨ।

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli