హిమాచల్ ప్రదేశ్ మంచు కప్పిన పర్వతాలకు ప్రసిద్ధి. కానీ కాంగ్రా జిల్లాలోని పాలమ్‌పుర్ పట్టణంలో మరో రకమైన పర్వతం పెరిగిపోతోంది - అదే వ్యర్థాల పర్వతం.
ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా రాష్ట్రం 2011లో వచ్చిన 149 లక్షల మంది పర్యాటకుల కంటే ఎక్కువగా 2019లో 172 లక్షల మంది పర్యాటకులను చూసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక తెలిపింది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కేవలం కాంగ్రా జిల్లాలోనే దాదాపు 1,000 హోటళ్ళు, హోమ్‌స్టేలు ఉన్నాయి. ఈ సహజ పర్యాటక స్థలమైన భూభాగంలోకీ, నదీతీరాల వెంటా కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోన్న వ్యర్థాలకు నానాటికీ పెరిగిపోతోన్న పర్యాటకుల సమ్మర్దమే ఒక ప్రధాన కారణం. ఇది ఈ కొండ పట్టణపు సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది.
"ఇదొక మైదాన ప్రాంతం, ఇందులో పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు," ఆ చెత్తపేరుకుపోయిన పల్లపు ప్రదేశానికి కొద్ది నిముషాల దూరంలో నివసించే 72 ఏళ్ళ గలోరా రామ్ గుర్తుచేసుకున్నారు.
"ఈ ప్రాంతమంతా పచ్చగా, చెట్లతో నిండిపోయి ఉండేది," తన టీ దుకాణానికి ఎదురుగా కనిపిస్తోన్న చెత్తతో నిండివున్న విశాలమైన ప్రదేశాన్ని చూపిస్తూ అన్నారు శిశు భరద్వాజ్ (అసలు పేరు కాదు). "వాళ్ళు (మునిసిపాలిటీ వాళ్ళు) కుప్ప తెప్పలుగా వస్తోన్న వ్యర్థాలకు స్థలం సరిపోవడంలేదని చెట్లన్నిటినీ కొట్టేశారు. ఇప్పుడిక్కడ కంపు కొడుతుంటుంది, ఈగలు విపరీతంగా ఉన్నాయి," అన్నారు 32 ఏళ్ళ శిశు.
ఆయన దుకాణం దాదాపు ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించివున్న పాలమ్‌పుర్ చెత్తకుప్పల డంపుకు పక్కనే ఉన్న స్థలంలో ఉంది. వస్త్రాల వ్యర్థాలు, ప్లాస్టిక్ సంచులు, విరిగిన బొమ్మలు, పారేసిన బట్టలు, ఇంటి సామాన్లు, వంటింటి వ్యర్థాలు, పరిశ్రమల వ్యర్థాలు, ప్రమాదకరమైన వైద్య సంబంధ వ్యర్థాలు, ఇంకా ఎన్నో వ్యర్థాలు అక్కడ కుప్పలు పోసి ఉన్నాయి; వర్షం వస్తున్నా కూడా ఈగలు నిర్విరామంగా ముసురుతూనే ఉంటాయి.
2019లో శిశు తన దుకాణాన్ని అక్కడ మొదటిసారిగా తెరచినపుడు, మూడు పంచాయతీలకు చెందిన వ్యర్థాలను క్రమబద్ధీకరించి, వాటిని రీసైకిలింగ్ చేసే ఒక రీసైకిలింగ్ ప్లాంట్ అక్కడ ఉండేది. కరోనా విజృంభించిన సమయంలో, ఆ తర్వాత కూడా అన్ని వార్డులలోని వ్యర్థాలన్నీ ఈ ప్రాంతానికే వచ్చిచేరటం, దీనిని క్రమబద్ధీకరించేందుకు కేవలం మానవశ్రమనే ఉపయోగించటం మొదలైంది.
ఇటీవల, వ్యర్థాలను వేరుచేసే కొత్త యంత్రాలను అమర్చిన మున్సిపల్ కమిషనర్, రీసైక్లింగ్ మళ్ళీ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు.
ఈ ప్రాంతంలో వ్యర్థాల కుప్పలు పేరుకుపోవడాన్ని స్థానిక ప్రభుత్వం పరిష్కరించలేదని, అభివృద్ధికి అనుగుణంగా పల్లపు భూభాగాన్ని నింపేందుకు శాస్త్రీయమైన ప్రణాళిక వేయలేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతమున్న వ్యర్థాలను డంప్ చేస్తోన్న ప్రదేశం, బియాస్ నదిలో కలిసే న్యూగల్ నదికి హాని కలిగించేంత సమీపంలో ఉంది. బియాస్ నది ఈ ప్రాంతంలోనూ, మరింత దిగువన కూడా త్రాగునీటికి ముఖ్యమైన వనరు.
సగటు సముద్ర మట్టం (ఎమ్ఎస్ఎల్) నుండి 1,000 నుండి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న చిన్న కొండ పట్టణం అయినప్పటికీ, ఇటీవల 2023 ఆగస్టు నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో 720 మిల్లీమీటర్ల కుండపోత వర్షం పడినప్పటికీ, పాలమ్‌పుర్‌లో పెద్దగా వర్షాలు పడలేదు. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందేమోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు
"ఇటువంటి తీవ్రమైన వర్షాల వలన వ్యర్థాల నుండి వచ్చే కాలుష్యం నదిలోకీ, మట్టిలోకీ ఇంకి వాటిని మరింత కలుషితం చేస్తాయి," అని ఫాతెమా చెప్పల్‌వాలా అభిప్రాయపడ్డారు. కాంగ్రా సిటిజన్స్ రైట్స్ ఫోరమ్ సభ్యురాలైన ఆమె, ముంబై నుండి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామమైన కంద్‌బారి గ్రామంలో నివసిస్తున్నారు. ఫాతెమా, ఆమె భర్త మొహమ్మద్ చాలా సంవత్సరాలుగా ఈ వ్యర్థాల కుప్పల ప్రదేశం సమస్యపై స్థానిక పౌరులతో కలిసి పనిచేస్తున్నారు
"మొత్తం మురికినీ, చెత్తనంతటినీ ఇక్కడే పడేస్తారు. ఒక రెండు మూడేళ్ళ నుంచి మరింత ఎక్కువ వ్యర్థాలను ఇక్కడ జమచేస్తున్నారు," ఈ డంప్ ప్రదేశానికి సుమారు 350 మీటర్ల దూరంలో ఉన్న ఔర్ణాలో నివాసముండే గలోరా రామ్ అన్నారు. "మేం జబ్బుపడుతున్నాం. ఆ కంపుకి పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు," అన్నారతను. ఈ డంప్ ప్రదేశాన్ని విస్తరించినప్పటి నుంచి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని ఈ 72 ఏళ్ళ వృద్ధుడు చెప్పారు. "బడికి వెళ్ళాలంటే ఇదొక్కటే దారి కాబట్టి, ఈ దారిగుండా వెళ్ళకుండా ఉండేందుకు పిల్లలు తాము చదువుతున్న బడుల నుంచి వేరే బడులకు మారిపోయారు."
*****
పెద్ద విపత్తులు దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి, కానీ మనం రోజువారీ విపత్తులను - నది ఒడ్డున పడి ఉన్న వ్యర్థాలు - సాధారణం చేసేశామంటూ మానసి అషర్ ఎత్తి చూపారు. స్థానిక పర్యావరణ సంస్థ హిమధారకు చెందిన ఈ పరిశోధకురాలు ఇలా అంటారు, “నదులకు దగ్గరగా వ్యర్థ పదార్థాల నిర్వహణా సౌకర్యాలుంటే, అవి నదిలోని కల్మషానికి మరింత చెత్తను కలిపి నది ఆరోగ్యాన్ని కలుషితం చేస్తుంది."
"పట్టణప్రాంతానికి చెందిన వ్యర్థాలన్నీ ప్రధానంగా గ్రామీణ పర్వత ప్రాంతంలోని నదీగర్భాలను, అడవులను, మేత భూములను ఆక్రమించేస్తాయి," అని ఆమె అన్నారు. కలుషితమైన, మిశ్రమ వ్యర్థాలు మట్టిలోకి ఇంకిపోయి నీటి సరఫరాలోకి కలుస్తాయి, చాలామంది ప్రజలు ఈ భూగర్భ జలాల నుండి వచ్చే నీటినే తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. ఇదే నీటిని దిగువ ప్రాంతాన ఉన్న పంటలకు, పంజాబ్ వరకు కూడా ఉపయోగిస్తారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2021 నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో 57 డంపింగ్ ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఒక్క శానిటరీ ల్యాండ్‌ఫిల్ (పెద్దమొత్తంలో వ్యర్థాలను పూడ్చిపెట్టే భూమి) కూడా లేదు. ఇతర రక్షణ చర్యలలో భాగంగా డంప్ ప్రదేశానికి బదులుగా పైన కప్పి వుండేలా, భూగర్భజలాలు కలుషితం కాకుండా నిరోధించడానికి లోపలి గోడలలో లైనర్లు, వడపోత సేకరణ వ్యవస్థను కలిగివుండేలా ఒక శానిటరీ ల్యాండ్‌ఫిల్‌ను రూపొందించారు. ఇది నిర్ణీత వ్యవధి తర్వాత మూసివేసేలా, మూసివేసిన తర్వాతి కాలానికి కూడా తగిన ప్రణాళికతో రావాలి. ఇదే నివేదిక ప్రకారం వ్యర్థ పదార్థాల నిర్వహణలో హిమాచల్ ప్రదేశ్ 35 రాష్ట్రాలలో 18వ స్థానంలో నిలిచింది.
అక్టోబర్ 2020లో, 15 వార్డులతో కూడిన కొత్త పాలమ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్‌సి) కింద 14 పంచాయతీలు ఒక్కచోటికి వచ్చాయి. కాంగ్రా సిటిజన్స్ రైట్స్ ఫోరమ్ సభ్యుడైన మొహమ్మద్ చప్పల్‌వాలా మాట్లాడుతూ, "పాలమ్‌పుర్ ఎంసిగా మారకముందు చాలా పంచాయతీలు తమ వ్యర్థాల నిర్వహణను తామే చూసుకునేవి. కానీ ఎంసిగా మారినప్పటి నుంచి చివరకు ఆస్పత్రి వ్యర్థాలతో సహా చెత్త భారీగా పెరిగిపోయి ఒకే చోటకు చేరుతున్నాయి." అన్నారు.
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వివరణపత్రం (హ్యాండ్‌బుక్) ప్రకారం, ల్యాండ్‌ఫిల్ ప్రదేశాన్ని కలిగి ఉండాలంటే, పట్టణ స్థానిక సంస్థ లేదా ULB ఈ క్రింది మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి: “భారత ప్రభుత్వం, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్‌ఫిల్ ప్రదేశాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ పల్లపు ప్రదేశం నదికి 100 మీటర్ల దూరంలో, చెరువు నుండి 200 మీటర్లు, హైవేలు, నివాసాలు, పబ్లిక్ పార్కులు, నీటి సరఫరా చేసే బావుల నుండి 200 మీటర్ల దూరంలో ఉండాలి..."
గత సంవత్సరం, స్థానిక ప్రజలు చర్యల కోసం పిలుపునిస్తూ, అందులో మమ్మల్ని చేరేలా ప్రేరేపించారు, మా సహాయం కోసం అడిగారు. ఆ మేరకు మేం కూడా ఆర్‌టిఐ (సమాచార హక్కు) కింద అడగాలని నిర్ణయించుకున్నాం. మొహమ్మద్ చెప్పినదాని ప్రకారం, ఆర్‌టిఐ దరఖాస్తు మార్చి 14, 2023న కమీషన్ కార్యాలయానికి అందింది; ఏప్రిల్ 19న ప్రత్యుత్తరం వచ్చింది. కానీ ఆ జవాబుల లేఖలో నిజమైన సమాధానాలు లేవు. "మేమడిగిన అనేక ప్రశ్నలకు జవాబుల స్థానంలో ఖాళీలు ఉన్నాయి," అని అతను చెప్పారు.
ఎంతెంత వ్యర్థాలు వెలువడుతున్నాయో ఎవరికీ తెలియదు. "నేను తనిఖీ చేయడానికి వచ్చిన ప్రతిసారీ, డంప్ ప్రదేశం పెద్దదవుతూ కనిపిస్తోంది. ఇప్పుడది న్యూగల్ నదికి ఎదురుగా ఉంది, వ్యర్థాలన్నీ నది లోపలికి వెళుతున్నాయి," అని మొహమ్మద్ చెప్పారు.
ఇటీవల ఆ డంప్ ప్రదేశంలో ఏడు వ్యర్థాలను వేరుచేసే యంత్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక జర్నలిస్ట్ రవీందర్ సూద్ చెప్పినదాని ప్రకారం, పొడి వ్యర్థాలను తగ్గించడానికి వాటిని ముక్కలు చేసే యంత్రంతో సహా వాటిలో ఐదు పనిచేస్తున్నాయి.
అయితే, తన టీ దుకాణం నుండి ఈ వచ్చిన మార్పులను గమనిస్తోన్న భరద్వాజ్, “యంత్రాలు వచ్చాయి, కానీ వర్షాల కారణంగా వాటిలో ఏవీ పనిచేయడం లేదు, అక్కడున్నదంతా అలాగే ఉంది. దుర్వాసన, ఇతర ప్రభావాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి," అన్నారు. అతని పొరుగువాడైన రామ్ ఇలా అంటారు, "మా జీవితాలకు, మా పిల్లల జీవితాలకు సహాయం చేయడానికి డంప్ ప్రదేశాన్ని వేరే చోట ఎక్కడైనా ఉంచాలని మేం కోరుకుంటున్నాం."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి