“ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద సఖుఆ గాచ్ (సాల వృక్షం) ఉండేది. హిజ్లా గ్రామం, ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు కూడా ఇక్కడ కలిసి బైసి (సమావేశం) నిర్వహించుకునేవారు. వాళ్ళు రోజూ ఇక్కడ సమావేశమవడాన్ని గమనించిన బ్రిటిష్‌వాళ్ళు ఆ చెట్టును కొట్టేయాలని నిర్ణయించుకున్నారు... దాని రక్తం బొట్లుగా కారింది. ఆ చెట్టు మోడు ఒక రాయిలా మారిపోయింది."
ఝార్ఖండ్‌లోని దమ్కా జిల్లాలో ఇంతకుముందు ఆ చెట్టు ఉన్న స్థానంలో కూర్చొని వున్న, రాజేంద్ర బాస్కీ వందల ఏళ్ళనాటి ఈ చెట్టు కథను చెప్తున్నారు. "ఆ చెట్టు కాండమే ఇప్పుడు మరాంగ్ బురు దేవతను పూజించే పవిత్ర స్థలంగా మారింది. బెంగాల్, బిహార్, ఝార్ఖండ్‌ల నుంచి సంతాల్ (సంథాల్ అని కూడా అంటారు) ఆదివాసులు పూజలు చేయడానికి ఇక్కడికి వస్తారు," చెప్పారు 30 ఏళ్ళ వయసున్న బాస్కీ. రైతు కూడా అయిన బాస్కీ ప్రస్తుతం మరాంగ్ బురుకు నాయకి (పూజారి)గా ఉన్నారు.
హిజ్లా గ్రామం దుమ్కా పట్టణానికి వెలుపల, సంతాల్ పరగణా డివిజన్‌లో ఉంది. 2011 జనగణన ప్రకారం ఈ గ్రామ జనాభా 640 మంది. సంతాల్ హూల్ - బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సంతాలులు చేసిన సుప్రసిద్ధ తిరుగుబాటు - హిజ్లా నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న భగ్నాదిహ్ (భోగ్నాదిహ్ అని కూడా పిలుస్తారు) గ్రామానికి చెందిన సీదో, కాను ముర్ముల నాయకత్వంలో జూన్ 30, 1855న ప్రారంభమైంది.
హిజ్లా గ్రామం, రాజమహల్ శ్రేణికి కొనసాగిపుగా ఉన్న హిజ్లా కొండ చుట్టూ ఉంది. కాబట్టి, మీరు గ్రామంలోని ఏదైనా చోటు నుండి నడవడం మొదలుపెడితే, ఒక వృత్తాన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు బయలుదేరిన చోటుకు తిరిగి వస్తారు.
"మా పూర్వీకులు ఏడాది పొడవునా అక్కడ [చెట్టు వద్ద] పాటించవలసిన నియమాలను, నిబంధనలను రూపొందించారు," అని 2008 నుండి గ్రామపెద్దగా ఉన్న 50 ఏళ్ళ సునిలాల్ హాఁస్‌దా చెప్పారు. చెట్టు మోడు ఉన్న ప్రదేశం ఇప్పటికీ సమావేశాలకు ఒక ప్రసిద్ధ ప్రదేశంగా కొనసాగుతోందని హాఁస్‌దా చెప్పారు.
హాఁస్‌దాకు హిజ్లాలో 12 బిఘాల భూమి ఉంది, ఆయన దాన్ని ఖరీఫ్ పంటకాలంలో సాగుచేస్తారు. మిగిలిన నెలలలో ఆయన దుమ్కా పట్టణంలోని నిర్మాణ ప్రదేశాలలో రోజు కూలీగా పనిచేస్తూ, పని దొరికిన రోజులలో రోజుకు రూ. 300 సంపాదిస్తారు. వాస్తవానికి, ప్రధానంగా సంతాలులు నివసించే హిల్జాలో కాపురముంటోన్న 132 కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వ్యవసాయం పైనా, రోజువారీ కూలిపనుల పైనా ఆధారపడతారు. గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోతోన్న వర్షాల అనిశ్చిత పరిస్థితి అంతకంతకూ జనం వలసలు పోయేలా చేస్తోంది.
హిజ్లాలో జరిగే ఒక ముఖ్యమైన ఉత్సవాన్ని కూడా మరాంగ్ బురుకు అంకితం చేశారు. ఫిబ్రవరిలో వచ్చే బసంత్ పంచమి సందర్భంగా జరిగే ఈ వార్షిక కార్యక్రమాన్ని మయూరాక్షి నది ఒడ్డున నిర్వహిస్తారు. ఈ జాతర 1890లో అప్పటి సంతాల్ పరగణా డిప్యూటీ కమీషనర్ ఆర్. కస్టయిర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైందని ఝార్ఖండ్ ప్రభుత్వం జారీచేసిన ఒక నోటీసు పేర్కొంది.
కోవిడ్-19 ముమ్మరంగా ఉన్న రెండేళ్ళు తప్ప హిల్జా జాతరను ప్రతి ఏడాదీ నిర్వహిస్తారని సీదో కాను ముర్ము విశ్వవిద్యాలయంలో సంతాలీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న డా. శర్మిలా శోరెన్ PARIతో చెప్పారు. భాలా (బల్లెం), తల్వార్ (కత్తి) మొదలుకొని ఢోల్ (డోలు), దౌరా (వెదురు బుట్ట) వరకూ రకరకాల వస్తువులు ఈ జాతరలో అమ్మకానికీ కొనటానికీ దొరుకుతాయి. స్త్రీ పురుషుల నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతాయి.
స్థానికులంతా వలసలు పోతుండటంతో, "ఈ జాతరపై ఇకముందు ఆదివాసీ సంస్కృతి ఆధిపత్యం కొనసాగదు," అంటారు మరాంగ్ బురు పూర్వ నాయకి (పూజారి) సీతారామ్ శోరెన్. "మా సంప్రదాయాలు తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయి, ఇప్పుడు ఇతర (పట్టణ) ప్రభావాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి