కొన్నిసార్లు దేవుళ్ళు తమ భక్తులతో పాటు ప్రయాణం చేస్తుంటారు. కనీసం మా అంగార్‌మొతి విషయంలో మాత్రం ఇది నిజం.
సుమారు 45 ఏళ్ళ క్రితం ఈ దేవత ధాయ్-చాఁవర్ గ్రామంలో నివసించేది. "మా అంగార్‌మొతి మహానది, సుఖా నది మధ్యన ఇక్కడ (ఈ ప్రదేశంలో) నివసించేది," 50 ఏళ్ళ వయసున్న గోండు ఆదివాసీ ఈశ్వర్ నెతామ్ అన్నారు. ఆయన ఈ ఆదివాసీ దేవతకు బైగా లేదా ప్రధాన పూజారి.
అక్కడినుంచి తరలిపోయినా, మా అంగార్‌మొతికి ప్రజాదరణ తగ్గిపోలేదు - ప్రతి రోజూ ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి 500 నుంచి 1000 మంది వరకూ భక్తులు ఆమె దేవాలయ ప్రాంతంలో గుమిగూడుతుంటారు. ఆమె తన స్నేహితులను కూడా పోగొట్టుకోలేదు. ప్రతి ఏడాది, దీపావళి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజున, మా అంగార్‌మొతి వార్షిక సంబరాల కోసం పొరుగు గ్రామాల నుంచి దేవతలను ఆహ్వానిస్తుంది. దేవత పేరుమీదే జరిగే ఈ ఉత్సవాన్ని ఆ గ్రామం పేరు మీద, అక్కడికి దగ్గరలో ఉన్న ఆనకట్ట పేరు మీద గంగ్రెల్ మడయ్ అని పిలుస్తారు.
"మా పూర్వీకుల కాలం నుండి దాదాపు ప్రతి ఆదివాసీ గ్రామంలో మేం ఈ మడయ్ [జాతర] జరుపుకుంటున్నాం," అని గోండు ఆదివాసీ నాయకుడు విష్ణు నెతామ్ చెప్పారు. ఈయన గంగ్రెల్ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదేసమయంలో ఈ జాతరను నిర్వహించే బృందంలో సభ్యుడు.
"మడయ్ మా సంప్రదాయ ఆదివాసీ సంస్కృతిలో భాగం," అని ఆయన చెప్పారు. స్థానిక వాసులు, ఆ గ్రామం వెలుపలి ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఈ జాతరకు వస్తారు. మంచి పంట పండినందుకు కృతజ్ఞతగానూ, రాబోయే సంవత్సరం కోసం ఆశీర్వాదాలు కోరుతూ దేవతలకు పువ్వులు సమర్పిస్తారు. జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహించే దాదాపు 50 జాతరలలో ఈ మడయ్ ఒకటి. మధ్య భారతదేశ రాష్ట్రంలోని ఈ జిల్లాలో జరిగే మడయ్‌ల శ్రేణిలో ఇదే మొదటిది.










