30 కిలోల గ్యాస్ సిలిండర్‌ను తన వీపుపై మోసుకుంటూ మాయా థామి మూడు కిలోమీటర్లు నడిచారు. ఆ బరువును మోస్తూ 200 మెట్లు ఎక్కి ఆమె ఆ సిలిండర్‌ని ఆ రోజుకు తన మొదటి ఖాతాదారుకు అందజేశారు.
32 ఏళ్ళ మాయా శ్వాస తీసుకుంటూ, "ఇప్పుడు నేను ఆ కొండ పైకి మరొక సిలిండర్‌ని అందించాలి," అని దూరంగా ఉన్న ఒక ప్రదేశాన్ని చూపిస్తూ చెప్పారు. తన శ్రమకు ప్రతిఫలంగా రూ. 80 అందుకున్న ఆమె తన తర్వాతి డెలివరీకి వెంటనే బయలుదేరారు. ఆ తర్వాత మరో ఆరు గంటల పాటు ఆమె ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్‌లను మోసుకెళ్ళే పనిలోనే ఉంటారు.
"ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు పురుషులకు ప్రాధాన్యం ఇస్తారు. మేం పురుషులం కాదు కాబట్టి జనం తరచుగా మాతో బేరాలాడుతారు," అని మాయ చెప్పారు. ఒక మహిళ ఒక ట్రిప్పుకు రూ. 80 సంపాదిస్తే, ఒక పురుషుడు అదే దూరానికి కొన్నిసార్లు రూ.100 సంపాదిస్తాడు.
పశ్చిమ బెంగాల్‌లో రద్దీగా వుండే పట్టణమైన డార్జిలింగ్ తూర్పు హిమాలయాలలో సముద్ర మట్టానికి 2,042 మీటర్ల ఎత్తున ఉంది. కొండలతో నిండివుండే ఈ ప్రాంతాలలో రోడ్డు రవాణా సమస్యాత్మకం కాబట్టి, అక్కడ నివసించేవారు తమ రోజువారీ అవసరాలైన కూరగాయలు, నీరు, సిలిండర్లు, ఇంకా ఎప్పుడో ఒకసారి ఇంటి కోసం తీసుకొచ్చే ఉపకరణాలను చేరవేయడానికి కూడా తప్పనిసరిగా మోతకూలీలపైనే ఆధారపడాలి. అక్కడికి చేరుకోవటానికి ఉన్న వంపుల మార్గాన్ని వాహనాలు అధిరోహించలేవు. అందుకే వస్తువులను స్వయంగా మోసుకువెళ్ళడం, లేదా గ్యాస్ ఏజెన్సీ లేదా దుకాణంవారు వాటిని తమ మోతకూలీల ద్వారా వారి ఇళ్ళకు పంపడం వారికున్న ఇతర మార్గాలు.
నేపాల్‌కు చెందిన మాయా థామి గత 12 ఏళ్ళుగా డార్జిలింగ్‌లో మోతకూలీగా పనిచేస్తున్నారు. ఆమెలాగే నగరంలోని ఇతర మోతకూలీలు కూడా ఎక్కువగా నేపాల్ నుండి వలస వచ్చిన మహిళలే. వీరంతా థామి సముదాయానికి (పశ్చిమ బెంగాల్‌లో ఇతర వెనుకబడిన తరగతి జాబితాలో చేర్చబడింది) చెందినవారే. వారు నామ్‌లో అనే పట్టీని ఉపయోగించి వీపుకు బిగించిన డోకో (వెదురు బుట్ట)లో కూరగాయలు, సిలిండర్లు, మంచినీటి క్యాన్లను పెట్టుకొని మోసుకెళ్తారు.
"పెళ్ళి తర్వాత మరిన్ని బాధ్యతలు పెరిగాయి, ఆ కారణంగా నేను మాగలాన్ [భారతదేశం]కు వచ్చాను," అని మాయ గుర్తుచేసుకున్నారు. నేపాల్‌లో ఆమె, ఆమె భర్త బావుధే 2 కాఠా ల (0.06 ఎకరాలు) భూమిలో వరి, చిరుధాన్యాలు, బంగాళాదుంపలను పండించేవారు; దీంతోపాటు చిన్న చిన్న దుకాణాలలో రోజువారీ కూలీలుగా కూడా పనిచేశారు. 2021 సంవత్సరంలో ఈ జంట నేపాల్ సరిహద్దు నుండి రోడ్డు మార్గంలో కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న డార్జిలింగ్‌కు తరలివచ్చారు.
మాయ గ్యాస్ ఏజెన్సీల నుండి వినియోగదారుల ఇళ్ళకు సిలిండర్లను చేరవేస్తుంటారు. "నేను సాధారణంగా ఉదయం 7 గంటలకు నా పనిప్రదేశానికి చేరుకుంటాను. సిలిండర్ డెలివరీలకు అందుబాటులో ఉన్నవారు వంతులవారీగా ఈ పని చేస్తారు," అని ఆమె చెప్పారు. సాధారణంగా ఒక రోజులో ఆమె రెండు సిలిండర్లను తన వీపుపై మోస్తూ నాలుగు లేదా ఐదు డెలివరీలను చేస్తారు. ఈ కష్టమైన పనికి ఆమె రోజుకు రూ. 500 సంపాదిస్తారు. " నామ్‌లో ఉపయోగించి తలపై సిలిండర్ల భారాన్ని నిరంతరం మోయడం వల్ల నా జుట్టు చాలా వరకు రాలిపోయింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి," అంటూ, తనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు కూడా ఉంటున్నాయని మాయ చెప్పారు.
మాయ సిలిండర్లను ఇళ్ళకు చేరవేస్తారు. ఆమె దినచర్య ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆమెకు సాధారణంగా ఒక రోజులో నాలుగు లేదా ఐదు డెలివరీలు ఉంటాయి. ఈ కష్టమైన పనికి ఆమె రోజుకు రూ. 500 వరకు సంపాదించగలరు
కూరగాయలు చేరవేసే మోతకూలీలు, సిలిండర్లు చేరవేసే మోతకూలీలు వేర్వేరు. వీరు మార్కెట్ మూసివేసే ఒక్క గురువారం రోజు మినహా ప్రతిరోజూ రాత్రి 8 గంటల వరకు చౌక్ బజార్ వద్ద వేచి ఉంటారు. "మేం మా వినియోగదారులకు కూరగాయలను అమ్మిన తర్వాత, సమీపంలో ఉన్న కూలీని పిలుస్తాం. మిగిలినది వారికి, కొనుగోలుదారులకు మధ్య కుదిరే ఒప్పందం," అని బిహార్‌కు చెందిన దుకాణదారుడు మనోజ్ గుప్తా చెప్పారు.
“ నాసాకెమ్ బొక్చూ భాండా భాండా 70 కేజీ కో భారి బోకనే బాని భాయీసాక్యో [నేను 70 కిలోల బరువును మోయటానికి అలవాటు పడ్డాను],” అని ఒక హోటల్‌కు 70 కిలోల కూరగాయలను ఇచ్చివచ్చేందుకు వెళుతోన్న 41 ఏళ్ళ మన్ కుమారి థామి అనే మోతకూలీ చెప్పారు. "నేను ఈ పని చేయలేనని చెబితే, వారు దాన్ని ఇంకొకరికి ఇస్తారు, నా సంపాదనలో 80 రూపాయలు తగ్గుతాయి," అన్నారామె.
“సాధారణంగా హోటళ్ళు చౌక్ బజార్‌కు పైగా ఉండటం మూలాన మేం 15 నుండి 20 నిమిషాల పాటు కొండపైకి ఎక్కుతాం. 10 నిమిషాల దూరంలో ఉన్న హోటళ్ళకు 60 నుండి 80 రూపాయలు ఇస్తారు, మరింత దూరంలో ఉన్న వాటికి 100 నుండి 150 రూపాయలు తీసుకుంటాం,” అని కూరగాయలు మోసే మరొక మోతకూలీ ధన్‌కుమారి థామి చెప్పారు.
మహిళలు వివక్షను ఎదుర్కొంటారని కూరగాయలు మోసే కూలీ ధన్‌కుమారి థామి ఒప్పుకుంటారు: “ కెటా లే మాతాయ్ సాక్చా ఎస్తో కామ్ టా హాయినా రాయిసావ్ బయిని. ఖాయి ఎటా టా బేసి లేడీస్ హారు నాయ్ చా భారి బోక్నే [ఏదో చూట్టానికి, ‘ఈ పని పురుషులు మాత్రమే చేయగలరు,’ అనిపిస్తుంది, కానీ ఆలా కానే కాదు సోదరీ. ఇక్కడి మోతకూలీలలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు].” 15 ఏళ్ళ క్రితం తాగుడుకు బానిసైన భర్త చనిపోవడంతో ఆమె ఈ పనిని చేపట్టారు.
నీటిని మోసుకెళ్ళటం అంటే ఎక్కువ పని వున్నట్లేనని నీటి క్యాన్లను ఇళ్లకు చేరవేసే పాన్‌డామ్ టీ తోటలకు చెందిన అస్తి థామి, జుంగే థామి దంపతులు అంటారు. డార్జిలింగ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉండే నీటి కొరత కారణంగా వారికి రోజూ పని లభిస్తుంది.
“రోజూ ఉదయం 6 గంటలకు నేనూ, నా భర్త పాన్‌డామ్ నుండి నీరు తీసుకువెళ్ళడానికి వస్తాం. జెర్రికాన్‌లలో నీటిని నింపి, నీరు తెమ్మని మమ్మల్ని కోరినవారి ఇళ్ళకు వాటిని చేరవేస్తాం,” అని అస్తి చెప్పారు. పాన్‌డామ్‌లోని వారి అద్దె గది వారు నీటిని సేకరించే ప్రదేశానికి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.
తాము ఒకప్పుడు మాంసం అమ్మే ప్రయత్నం చేశామని, అయితే కోవిడ్ కారణంగా ఆ వ్యాపారం నష్టదాయకంగా మారిందని జుంగే చెప్పారు. ఆ దంపతులు తిరిగి మోతకూలీ పనిలోకి వెళ్ళిపోయారు.
*****
మాయా థామి భర్త బావుధే థామి రెండవ తరం వలసదారు. అతని తల్లిదండ్రులు కూడా మోతకూలీలుగా పనిచేస్తూ డార్జిలింగ్‌లోని హోటళ్ళకు కూరగాయలను పంపిణీ చేసేవారు. మాయ, బావుధే తమ పనిప్రదేశమైన చౌక్ బజార్ నుండి 50 నిమిషాల దూరంలో ఉన్న గౌశాల సమీపంలో ఒక గదిని నెలకు రూ. 2,500 లకు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
ఈ ప్రాంతంలోని చాలామంది మోతకూలీలు వారి కుటుంబాలతో పాటు ఉండేందుకు ఒక ఒంటి గదిని అద్దెకు తీసుకుంటారు. వారి స్తోమతకు ఇంతకంటే మంచి ఎంపిక చేసుకునే అవకాశం లేదు.
మాయ, బావుధే దంపతుల పిల్లలు భావన, భావిన్‌లు ఇంకా పాఠశాల చదువులోనే ఉన్నారు; మాయకు వారి చదువే ప్రధానం: " భావన రా భావిన్ పరింజల్ మో మేరో నామ్‌లో లే సిలిండర్ బొక్చూ [భావన, భావిన్‌ల చదువులు పూర్తయ్యేవరకు నేను నా నామ్‌లో తో సిలిండర్‌లను మోస్తాను]."
అనువాదం: నీరజ పార్థసారథి