అనిల్ నార్కండే ప్రతిసారి మాదిరిగానే వివాహ వేదికను ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ కథ ఎలా మలుపు తిరగబోతుందో ఆయన ఊహించలేకపోయారు!
భండారాలోని అలేసూర్ గ్రామానికి చెందిన 36 ఏళ్ళ ఈ రైతు పెళ్ళిళ్ళలో వేదికలను అలంకరించటం, సంగీతాన్ని అందించడం వంటి పనులను కూడా చేస్తారు. ఇప్పుడాయన పొరుగునే ఉన్న గ్రామంలో జరిగే ఒక పెళ్ళి కోసం పెద్ద పసుపురంగు షామియానా వేసి పదుల సంఖ్యలో ప్లాస్టిక్ పూలతో ఆ ప్రదేశాన్ని అలంకరించారు. అతిథుల కోసం కుర్చీలను; వధూవరులు కూర్చోవడం కోసం ముదురు ఎరుపు రంగులో ఉన్న ప్రత్యేకమైన సోఫాను, సంగీతం కోసం డిజె సామగ్రిని, వెలుగులు చిమ్మేందుకు లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
మట్టీ ఇటుకలతో కట్టిన వరుని సాధారణమైన ఇల్లు ఈ పెళ్ళి కోసం చక్కగా ముస్తాబయింది. వధువు మధ్యప్రదేశ్‌లోని సివనీ గ్రామం నుంచి సాత్పురా కొండల మీదుగా ప్రయాణమై వస్తోంది.
పెళ్ళి ముందురోజున పరిస్థితులన్నీ తల్లకిందులైపోయాయని, వస్తోన్న వేసవికాలపు పెళ్ళిళ్ళ సీజన్‌లో తన వ్యాపారం బ్రహ్మాండంగా ప్రారంభం కావటం కోసం ఎదురుచూస్తోన్న అనిల్ చెప్పారు. పెళ్ళి జరగటానికి ఒక రోజు ముందు, పని కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుండే 27 ఏళ్ళ వరుడు, పారిపోయాడు.
"పెళ్ళి ఆపకపోతే తాను విషం తాగి చనిపోతానని వరుడు తన తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పాడు," అనిల్ గుర్తుచేసుకున్నారు. "అతనికి ఇంకెవరి మీదనో మనసు ఉంది."
పెళ్ళిని నిలిచిపివేసే సమయానికి వధువు, ఆమె తరఫువారంతా వచ్చేసివున్నారు. సంతోషంతో నిండిపోవాల్సిన ఆ సందర్భం అబ్బాయి తల్లిదండ్రులకూ, ఆ ఊరికీ కూడా చాలా అవమానకరమైనదిగా ముగిసింది.
ఖిన్నుడైవున్న వరుని తండ్రి అనిల్‌కు చెల్లించాల్సిన డబ్బును ఇవ్వలేనని చెప్పారు.








