"నీటిమట్టం పెరిగినపుడు మా ప్రాణాలు వణికిపోతాయి," అంటారు అస్సామ్‌లోని బగొరీబారీలో నివాసముండే హరేశ్వర్ దాస్. ప్రతి ఏటా వర్షాకాలంలో సమీపంలో ఉండే పుఠిమారీ నదిలో నీటి మట్టాలు పెరగటంవలన వచ్చే వరదలలో వారి ఇళ్ళు, పంటలు ధ్వంసమయ్యే అవకాశం ఉన్నందున, ఆ కాలంలో గ్రామం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు.
"వర్షం పడినప్పుడల్లా మేం మా బట్టలు సర్దుకొని సిద్ధంగా ఉండాలి. పోయిన ఏడాది వచ్చిన వరదలు రెండు కచ్చా ఇళ్ళను ధ్వంసం చేశాయి. వెదురు బొంగులు, మట్టితో కొత్తగా మళ్ళీ గోడలు లేచాయి," అంటూ మాటలు జోడించారు ఆయన భార్య సావిత్రీ దాస్.
"నేను (ఇప్పుడు పాడైపోయిన) టివిని ఒక గోతాంలో మూటకట్టి అటకమీద పెట్టేశాను," అన్నారు నీరదా దాస్. దీనికి ముందరి టెలివిజన్ కూడా పోయినసారి వచ్చిన వరదలలో పాడైపోయింది.
అది జూన్ 16, 2023 రాత్రి, వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. అక్కడ నివాసముండేవారు, పోయిన ఏడాది కూలిపోయిన ఒక కరకట్టను మరమ్మత్తు చేయటం కోసం ఇసుక బస్తాలను ఉపయోగించారు. రెండు రోజులు గడచినా వర్షం ఆగే సూచనలు కనిపించడంలేదు. బగొరీబారీతో పాటు ధేపర్‌గావ్ఁ, మాదోయికటా, నీజ్ కౌర్‌బాహా, ఖండికర్, బిహాపరా, లాహాపరా వంటి ఇరుగుపొరుగు గ్రామాలు కూడా కరకట్టకు సంబంధించిన బలహీనమైన భాగంలో మళ్ళీ గండి పడుతుందేమోనని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
అదృష్టవశాత్తూ నాలుగు రోజుల తర్వాత వర్షం నెమ్మదించడంతో, నీటి మట్టం కూడా తగ్గిపోయింది.
"కరకట్టకు గండిపడినప్పుడు అది ఒక నీటి బాంబులా కనిపిస్తుంది. అది తన దారిలోకి వచ్చిన ప్రతిదాన్నీ తుడిచిపెట్టుకుంటూ పోతుంది," స్థానిక ఉపాధ్యాయులైన హరేశ్వర్ దాస్ వివరించారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన 85 ఏళ్ళ హరేశ్వర్, కె.బి. దేవుల్‌కుచి హయ్యర్ సెకండరీ పాఠశాలలో అస్సామీ భాషను బోధించేవారు.
1965లో నిర్మించిన కరకట్ట వలన మంచి కంటే ఎక్కువగా చెడే జరిగిందని ఆయన దృఢవిశ్వాసం, "పంటభూములను మరింత సారవంతం చేయడానికి బదులుగా అది వాటిని ముంచేసింది."
బగొరీబారీ గ్రామం పుఠిమారీ నది ఒడ్డున ఉంది. ఈ నది ఏటేటా వరదలు వచ్చే బ్రహ్మపుత్రా నదికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఋతుపవనాల మాసాల్లో నీటిమట్టాలు పెరుగుతాయేమో అనే భయంతో గ్రామస్థులు నిద్రలేని రాత్రులు గడుపుతారు. బక్సా జిల్లా కు చెందిన గ్రామంలోని యువజనం జూన్, జులై, ఆగస్ట్ నెలలలో కరకట్టల వద్ద నీటి స్థాయిని పర్యవేక్షిస్తూ మొత్తం రాత్రుళ్ళంతా మేలుకునే ఉంటారు. "మేం ఏడాదిలో ఐదు నెలల పాటు వరదలతో యుద్ధం చేయటంతోనో, వరదలొస్తాయనే భయంతోనో జీవిస్తుంటాం," అంటారు హరేశ్వర్.
"గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు ప్రతి వర్షాకాలంలోనూ ఈ కరకట్ట ఒకే చోట కూలిపోతోంది," అన్నారు ఇదే గ్రామానికి చెందిన జొగమాయా దాస్.
అందువల్లనే కావచ్చు, అతుల్ దాస్ కుమారుడైన హిరక్‌జ్యోతి ఇటీవలనే అస్సాం పోలీస్‌లోని నిరాయుధ విభాగంలో పోలీస్ కాన్‌స్టేబుల్‌గా చేరాడు. ఈ కరకట్ట నిర్మాణంలోనూ, దానికి మరమ్మత్తు చేయడంలోనూ అతను విశ్వాసాన్ని కోల్పోయాడు.
"ఈ కరకట్ట సొణార్ కొనీ పొరా హాఁహ్ (బంగారు గుడ్లను పెట్టే బాతు) వంటిది," అంటారతను. అది కూలిపోయినప్పుడల్లా పార్టీలూ సంస్థలూ వచ్చేస్తాయి. కాంట్రాక్టర్ కరకట్టను కడతాడు. కానీ అది మళ్ళీ వరదలకు కూలిపోతుంది." ఆ ప్రాంతంలోని యువకులు మరింత మెరుగైన మరమ్మత్తుల కోసం అడిగినప్పుడు, "పోలీసులు వారిని బెదిరించి వాళ్ళ నోళ్ళు మూయిస్తారు," అన్నారు 53 ఏళ్ళ అతుల్ దాస్.
బగొరీబారీలోని పొలాలు, రోడ్లు, ఇళ్ళు ప్రజలు పడుతోన్న బాధల గురించి చెప్తాయి. ఈ కష్టాలేవీ అంత తొందరగా తీరిపోయేవిగా కూడా కనిపించడంలేదు. ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పుఠిమారీ నది భూజలాధ్యయన(హైడ్రోగ్రాఫిక్) సర్వే అందించిన 2015 నివేదిక "కరకట్ట నిర్మాణం, మరమ్మత్తుల పనులు శాశ్వత వ్యవహారంలా కనిపిస్తోంది," అని ముక్తాయించింది.
*****
జొగమాయా దాస్, ఆమె భర్త శంభురామ్ 2022లో తమ ఇంటిలోకి వరద వచ్చినపుడు ఎనిమిది గంటలకు పైగా కిటికీలకు అంటిపెట్టుకొని ఉండవలసివచ్చింది. ఆ రాత్రి వరద నీరు వారి గొంతులవరకూ రావటంతో, వారిద్దరూ తమ కచ్చా ఇంటిని వదలి పక్కనే, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎమ్ఎవై) కింద తాము కట్టుకుంటోన్న కొత్త ఇంటిలోకి వెళ్ళిపోయారు. ఈ పక్కా ఇంటిలోకి కూడా నీళ్ళు ప్రవేశించడంతో, ప్రాణాలతో ఉండేందుకు కిటికీలే వారి చివరి ఆశగా మిగిలాయి.
"అది ఒక పీడకల," ఆ చీకటి రాత్రి నీడలు ఇంకా తన ముఖంపై కనిపిస్తుండగా అన్నారు జొగమాయ.
వరదలో ధ్వంసమైన తన ఇంటి తలుపు వద్ద నిల్చొని వున్న దాదాపు 40 ఏళ్ళ వయసున్న జొగమాయ 2022, జూన్ 16 రాత్రి నాటి తన అనుభవాలను తలచుకున్నారు. "నీరు తగ్గిపోతుందనీ, కరకట్ట కూలిపోదనీ మా ఆయన పదే పదే నాకు హామీ ఇచ్చాడు. నేను చాలా బెదిరిపోయాను, కానీ నిద్రపోయాను. హఠాత్తుగా ఏదో పురుగు కుట్టటంతో అదిరిపడి లేచాను. నా పడక దాదాపుగా నీటిలో తేలియాడుతుండటాన్ని చూశాను," అన్నారామె.
గ్రామంలో నివసించే అనేకమందికిలాగే కోస్-రాజ్‌బంశీ సముదాయానికి చెందిన ఈ జంట, బ్రహ్మపుత్రానదికి ఉపనది అయిన పుఠిమారీ నది ప్రధాన ఉత్తరపు ఒడ్డుకు 200 మీటర్ల సమీపంలో నివసిస్తున్నారు.
"ఆ చీకట్లో నేనేమీ చూడలేకపోయాను," తామున్న దారుణమైన పరిస్థితుల గురించి వర్ణిస్తూ అన్నారు జొగమాయ. "ఎలాగో కిటికీ దగ్గరకు చేరుకోగలిగాం. ఇంతకుముందు కూడా వరదలొచ్చాయి కానీ, నా జీవితంలో నేనెప్పుడూ ఇన్ని నీళ్ళను చూడలేదు. నా దగ్గర దగ్గరలోనే పురుగులూ పాములూ పొంచివుండటం నాకు అర్థమవుతూనే ఉంది. నేను మా ఆయన వేపు చూస్తూ, కిటికీ అంచులను ఎంత గట్టిగా పట్టుకోగలనో అంత గట్టిగానూ పట్టుకున్నాను," చెప్పారామె. రక్షక బృందాల రాకతో, ఉదయం 2.45 గంటలకు మొదలైన కష్టం నుంచి చివరకు వారు ఉదయం 11.00 గంటలకు బయటపడగలిగారు.
‘(పుఠిమారీ నది మీది) కరకట్ట గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు ప్రతి వర్షాకాలంలోనూ ఒకే చోటువద్ద కూలిపోతోంది’
మళ్ళీ మళ్ళీ ఇళ్ళు కట్టుకోవడానికి ఏటా అయ్యే ఖర్చులతో అలసిపోయిన గ్రామస్థులు వరదల తర్వాత, ఈ ఏడాది ఎడతెగకుండా కురిసిన వర్షాలవల్ల ధ్వంసమైన తమ ఇళ్ళను మరమ్మత్తులు చేసుకోవడానికి సుముఖంగా లేరు. వరదలకు ఇళ్ళు నాశనమైపోయిన అనేక కుటుంబాలవారు, తిరిగి వెనక్కు వెళ్ళేందుకు భయపడినవారు ప్రస్తుతం కరకట్ట మీదనే తాత్కాలికంగా గుడారాలు వేసుకొని నివాసముంటున్నారు.
మాధవి దాస్ (42), దండేశ్వర్ దాస్(53)లు పోయినసారి వచ్చిన వరదలలో నాశనమైన తమ ఇంటిని ఎలాగో మరమ్మత్తు చేసుకోగలిగారు. కానీ ఆ ఇంటిలో వారు మనశ్శాంతిగా జీవించలేకపోతున్నారు. "నీటిమట్టం పెరుగినప్పుడు మేం కరకట్ట మీదకు వచ్చేస్తున్నాం. ఈసారి మేం ఎలాంటి కష్టంలోనూ పడదలచుకోలేదు," అంటారు మాధవి.
కరకట్ట మీద నివసించేవారికి తాగు నీరు దొరకటం అనేది పెద్ద సమస్యగా ఉంది. వరదలు వచ్చిన తర్వాత, చాలా గొట్టపు బావులు ఇసుక కింద పూడుకుపోయాయని మాధబి చెప్పారు. ఒక బక్కెట్ నిండా ఉన్న ఖాళీ ప్లాస్టిక్ నీళ్ళ సీసాలను మాకు చూపిస్తూ, "ఈ నీళ్ళల్లో ఎక్కువ మొత్తంలో ఇనుము ఉంది. గొట్టపు బావుల దగ్గర నీటిని వడపోసుకొని, బక్కెట్లలోనూ సీసాలలోనూ ఆ నీటిని నింపుకొని కరకట్టకు మోసుకొచ్చుకుంటాం," అని మాధబి చెప్పారు.
"ఇక్కడ వ్యవసాయం చేయటం గురించీ, ఇళ్ళు కట్టుకోవడం గురించీ ఆలోచించడంలో ఉపయోగం లేదు. వరదలు మళ్ళీ మళ్ళీ మొత్తాన్నీ తీసుకెళ్ళిపోతాయి," అన్నారు అతుల్ భార్య నీరద దాస్. "మేం రెండుసార్లు టివి కొన్నాం. ఆ రెండూ వరదల్లో పాడైపోయాయి," తమ బరండా (వరండా)లో ఉన్న ఒక వెదురు స్తంభానికి ఆనుకుంటూ చెప్పారు నీరద.
739 మంది జనాభా (2011 జనగణన) ఉన్న బగొరీబారీ గ్రామస్థుల ప్రధాన వృత్తి వ్యవసాయం. కానీ వరదల వలన పొలాల్లో ఇసుక మేటలు వేసి ఆ భూములను వ్యవసాయానికి పనికిరాకుండా చేసేయడంతో, ఇప్పుడా వృత్తి మారిపోయింది.
*****
"ఎక్కువ సాగుభూమి దొరుకుతుందనే ఆశతో మా తండ్రుల కాలంలో ఇక్కడకు వచ్చారు," కామరూప్ జిల్లాలోని గుయ్‌యా గ్రామం నుంచి చిన్నపిల్లాడిగా ఉండగా తన తల్లిదండ్రులతో కలిసి ఇక్కడకు వలస వచ్చిన హరేశ్వర్ చెప్పారు. ఆ కుటుంబం బగొరీబారీలో నదికి ఎగువ భాగాన స్థిరపడింది. "ఇంత పచ్చని ప్రదేశంలో అప్పుడు చాలా తక్కువ జనాభా ఉండేది. వాళ్ళు (పెద్దలు) ఇక్కడ ఉన్న పొదలను నరికేసి, తమకు సాగుకు సరిపోయినంత భూమిని తయారుచేసుకున్నారు. కానీ ఇప్పుడు మాకు భూమి ఉన్నప్పటికి కూడా మేం దాన్ని సాగుచేయలేం," అని ఆయన పేర్కొన్నారు.
పోయిన ఏడాది (2022) హరేశ్వర్ వడ్లు నారు పోసి, సరిగ్గా పొలంలో నాట్లు వేసే సమయానికి వరద వచ్చింది. ఎనిమిది బీఘాల (సుమారు 2.6 ఎకరాలు) అతని పొలం మొత్తం నీటిలో మునిగిపోవడంతో నాట్లు వేయడానికి ముందే నారు మొత్తం కుళ్ళిపోయింది.
"ఈ సారి కూడా నేను కొన్ని విత్తనాలను నారుపోశాను, కానీ నీరు మొత్తాన్నీ నాశనం చేసేసింది. నేనింకెప్పుడూ సాగుచేయను," నిట్టూరుస్తూ చెప్పారు హరేశ్వర్. ఈ ఏడాది జూన్ నెలలో ఎడతెగకుండా కురిసిన వర్షాలు వారి పెరటి తోటలోని మిరప, తీగజాతి కూరపాదులనూ, ఇతర మొక్కలనూ నాశనం చేశాయి.
వ్యవసాయాన్ని వదిలివేయాల్సివచ్చిన కుటుంబాలలో సమింద్ర దాస్ కుటుంబం కూడా ఒకటి. "మాకు 10 బిఘాల (3.3 ఎకరాలు) సాగుభూమి ఉండేది. ఇప్పుడు ఆ పొలం ఆనవాలే లేదు, అది మందమైన ఇసుక పొరల కింద కప్పబడిపోయింది," అన్నారు సమింద్ర (53). "ఈ సారి అధిక వర్షపాతం వలన, సరిగ్గా మా ఇంటి వెనుకనే ఉన్న కరకట్ట నుంచి నీరు కారుతోంది," అన్నారాయన. "నదిలో నీరు పెరిగిపోవడం మొదలవ్వగానే, మేం గుడారాల్లోకి (వెదురు బొంగులు, టార్పాలిన్ పట్టాలతో కట్టిన తాత్కాలిక ఆశ్రయం) వెళ్ళిపోతాం."
జొగమాయ, శంభురామ్‌ల కుటుంబానికి మూడు బిఘాల (సుమారు ఎకరం) సొంత సాగుభూమి ఉంది. వారు దానిలో ప్రధానంగా వరినీ, అప్పుడప్పుడూ ఆవాలనూ పండిస్తారు. 22 ఏళ్ళ క్రితం తనకు పెళ్ళి అయిన సమయంలో గువాహాటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరిలో భూములన్నీ పచ్చని పంటపొలాలుగా ఉండేవని జొగమాయ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడంతా ఇసుక గుట్టలే మిగిలాయి.
భూమి ఎడారిగా మారిపోవటంతో, శంభురామ్ వ్యవసాయాన్ని మానేసి వేరే పనిని వెతుక్కోవాల్సివచ్చింది. బగొరీబారీలోని అనేకమంది లాగానే ఆయన కూడా రోజు కూలీగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన పొరుగు గ్రామాల్లో ఆ పనీ ఈ పనీ చేసి రోజుకు రూ. 350 సంపాదిస్తారు. "అతనికి వ్యవసాయం చేయటమంటే చాలా ఇష్టం," అన్నారు జొగమాయ.
ఆ పని కూడా ఎప్పుడూ దొరకదు. ఇళ్ళల్లో పనులు చేసే జొగమాయ రోజుకు సుమారు రూ. 100-150 వరకూ సంపాదిస్తారు. ఒకానొకప్పుడు ఆమె వరిపొలాల్లో నాట్లు వేసిన వ్యక్తి. కొన్నిసార్లు కొంత అదనపు డబ్బు తీసుకొని ఆమె ఇతరుల పొలాల్లో కూడా పనిచేశారు. వ్యవసాయంలోనే కాక, జొగమాయ నేతపనిలో కూడా సమర్థురాలు. ఆమెకు తన సొంత మగ్గం ఉంది. దానిపై గముసా (చేనేత తువ్వాలు), సాదర్ (అస్సామ్ మహిళలు చుట్టుకునే వస్త్రం) వంటివి నేయడం కూడా ఒక అదనపు ఆదాయ వనరు.
వ్యవసాయం ఇక ఆచరణసాధ్యం కానిపని కావడంతో, ఆమె తన మగ్గం పైననే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ నది ఆ పనిని కూడా చెడగొట్టేసింది. "నేను పోయిన సంవత్సరం వరకూ అధియా (సొంతదారుకు మొత్తం ఉత్పత్తిలో సగం ఇచ్చేలా చేసుకునే ఒప్పందం) పై నేస్తూ ఉండేదాన్ని," అన్నారు జొగమాయ. "కానీ ఆ చేనేత చట్రం మాత్రమే మిగిలింది. దారపు కండెలను, బాబిన్లనూ, మొత్తాన్నీ వరద ఎత్తుకుపోయింది."
పని దొరకకపోవటం, అనిశ్చిత అదాయం వలన తమ కొడుకు చదువుకు దన్నుగా నిలవటం కష్టంగా ఉందని జొగమాయ చెప్పారు. వారి కొడుకు రాజీవ్(15) కౌర్ బాహా నవమిలన్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పోయిన ఏడాది, ఈ సంఘటన జరగడానికి సరిగ్గా ముందు, అతని తల్లిదండ్రులు అతన్ని కరకట్టకు దగ్గరగా ఉన్న బంధువుల ఇంటికి పంపారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్ళు - ధృతిమణి, నితుమణి - కూడా ఉన్నారు. వీరిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఒకరు కటానిపారాలోనూ మరొకరు కెందుకోనలోనూ ఉంటున్నారు.
*****
పుఠిమారీ నదివలన తరచుగా వచ్చే వరదలు, జలప్రళయం అతుల్ దాస్ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది. "నేను 3.5 బిఘాల (1.1 ఎకరం) భూమిలో అరటి మొక్కలను, ఒక బిఘా (0.33 ఎకరం) భూమిలో నిమ్మ మొక్కలనూ నాటాను. మరొక బిఘా లో గుమ్మడి, సొర పాదులను పెట్టాను. ఈసారి నది నీరు పొంగి, మొత్తం పంటలన్నీ నాశనమయ్యాయి. కొన్ని వారాల తర్వాత పంటలో మూడింట రెండు వంతులు కోలుకున్నాయి.
రహదారులు సరిగ్గా లేకపోవటం వలన అనేకమంది గ్రామీణులు వ్యవసాయాన్ని వదిలేశారని అతుల్ అభిప్రాయపడ్డారు. తాము పండించిన ఉత్పత్తులను అమ్ముకోవాలంటే, మార్కెట్లకు చేరుకునే ప్రయాణం దాదాపు అసాధ్యమైపోయింది. కరకట్ట కూలిపోవడం వలన రహదారులు దెబ్బతిన్నాయి.
"నేను నా ఉత్పత్తులను రంగియాకూ, గువాహటీకీ తీసుకువెళ్ళేవాడిని. ఒకప్పుడు నా పొలంలో పండించిన అరటి, నిమ్మకాయలను రాత్రివేళల్లో ఒక వ్యాన్‌లో వేసుకొని తీసుకెళ్ళిన రోజులున్నాయి. పొద్దున్నే 5 గంటలకల్లా గువాహటీలోని ఫ్యాన్సీ బజార్ చేరుకొని, నా పంటను అమ్ముకొని అదేరోజు ఉదయం 8 గంటలకంతా ఇంటికి చేరేవాడిని," అన్నారు అతుల్. పోయినసారి వచ్చిన వరద వలన ఇప్పుడలా చేయటం అసాధ్యమైపోయింది.
"నేను నా ఉత్పత్తులను పడవ ద్వారా ధులాబారీకి తరలించేవాడిని. కానీ ఏం చెప్పను! కరకట్ట 2001 నుండి ఇప్పటివరకూ అనేకసార్లు కూలిపోయింది. 2022లో వచ్చిన వరదల తర్వాత దాన్ని మరమ్మత్తు చేయడానికి ఐదు నెలలు పట్టింది." అన్నారు అతుల్.
"ఈ వరదలు మమ్మల్నందరినీ నాశనం చేసేశాయి," కరకట్ట కూలిపోవటంతో ఏర్పడిన గందరగోళం గురించి అతుల్ తల్లిగారైన ప్రభాబాల దాస్ అన్నారు.
మేం సెలవు తీసుకోవడానికి కరకట్ట మీదకు ఎక్కుతుంటే, ఆమె కొడుకు నవ్వుతూ మావైపు చూశారు. "పోయినసారి కూడా మీరు వరద ఉన్నప్పుడే వచ్చారు. ఈసారి ఒక మంచిరోజున రండి," అన్నారాయన. "మా పొలంలో పండిన కూరగాయలను మీకు పంపిస్తాను."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి