మనోహర్ ఎలవర్తి ఏప్రిల్ 19, 2024న బెంగళూరులోని అతిపెద్ద మురికివాడ అయిన దేవర జీవనహళ్ళిలో క్వీర్ సముదాయపు హక్కులపై అవగాహన పెంచే కార్యక్రమానికి అన్నీ సిద్ధంచేసుకున్నారు. జెండర్, లైంగిక మైనారిటీల హక్కుల బృందమైన సంగమ వ్యవస్థాపకుల్లో ఎలవర్తి కూడా ఒకరు. అతను LGBTQIA+ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్‌సెక్స్, అసెక్సువల్, “+” అంటే సంక్షిప్త రూపంలో గుర్తించలేని అన్ని ఇతర ఐడెంటిటీలను సూచిస్తుంది) సమస్యలతో పాటు పెరుగుతున్న జీవన వ్యయాలు, నిరుద్యోగం, లౌకికవాదం వంటి సామాజిక సమస్యల గురించి కూడా అక్కడ నివాసముండేవారితో చర్చించాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ చర్చకు నాయకత్వం వహించడానికి అతను జెండర్ అండ్ సెక్సువల్ మైనారిటీస్ ఫర్ సెక్యులర్ అండ్ కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రసీ (GSM) సభ్యులతో జట్టుకట్టారు.
యాదృచ్ఛికంగా, భారతదేశం తన 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రారంభించిన మొదటి రోజు కూడా ఇదే. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఎన్నికలు జరగడానికి ఒక వారం ముందు.
ఎలవర్తి ప్రచారాన్ని ప్రారంభించగానే, కాషాయ కండువాలు, పార్టీ చిహ్నాలు ధరించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన 10 మంది వ్యక్తులు, డిజె హళ్ళిగా ప్రసిద్ధి చెందిన దేవర జీవన్‌హళ్ళిలోని ఇరుకైన సందులలో అతనిని, నన్ను (ఈ ప్రచారాన్ని కవర్ చేస్తోన్న విలేఖరి) చుట్టుముట్టారు. ఇక్కడ ఎక్కువమంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాలనుంచి వలసవచ్చినవారు, వారిలో చాలామంది ముస్లిమ్ సముదాయానికి చెందినవారు.
"నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌వి మాత్రమే!" ఒక బిజెపి సభ్యుడు అరిచాడు. జిఎస్ఎమ్ ప్రచార ప్రణాళికలను నిరసిస్తూ, చుట్టూ గుమిగూడిన వ్యక్తుల నుండి నిరసన హోరెత్తేలా అతని అరుపు ప్రేరేపించింది. జిఎస్ఎమ్ కరపత్రాలను ఝుళిపిస్తూ, “ఇవి చట్టవిరుద్ధం!" అంటూ బిజెపి వ్యక్తులు ప్రకటించారు.











