ఒక సాధారణ కొలత కలిగిన పష్మీనా శాలువా తయారీకి అవసరమైన దారాన్ని వడకడానికి ఫహ్‌మీదా బానోకి నెల రోజుల సమయం పడుతుంది. ఛాంగ్‌తాంగ్ మేకల నుండి వచ్చే నాణ్యమైన, గాలిలో తేలిపోయేంత తేలికగా ఉండే ఉన్నిని వేరుచేసి, వడకటం అంటే అమిత కష్టమైన, అతి సున్నితమైన పని. నెలరోజుల పాటు చేసిన ఈ పనికి సుమారు వెయ్యి రూపాయలు వస్తాయని ఆశించొచ్చని ఈ 50 ఏళ్ళ నిపుణురాలైన కార్మికురాలు చెప్పారు. "నేను విరామం లేకుండా పనిచేసినట్లయితే, రోజుకు 60 రూపాయలు సంపాదించగలను," వివరించారామె.
వాటిపై సూదితో చేసే కుట్టుపని, సృష్టించే సూక్ష్మమైన ఆకృతుల అల్లికలను బట్టి 8 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకూ అమ్ముడుపోయే అతి ఖరీదైన ఈ శాలువాల ధరలతో పోలిస్తే, వీరికిచ్చే ఈ కూలీ అసలు లెక్కలోకి రాదు.
మహిళలు ఒకవైపు తమ ఇంటి పనులను చేసుకుంటూనే పష్మీనా దారాలను చేతితో వడికే పనిని సంప్రదాయంగా చేస్తుంటారు. ఈ దారాలను వడికే పనిచేసే ఫహ్‌మీదా వంటివారికి లభించే అతి తక్కువ కూలీ వలన ఈ పని చేయడానికి సిద్ధపడేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది.
పెళ్ళయి తన కుటుంబాన్నీ ఇంటినీ చూసుకోవడం మొదలెట్టకముందు శ్రీనగర్‌లో నివాసముండే ఫిర్‌దౌసా కూడా ఊలును వడికేవారు. "కుటుంబంలోని పెద్దవారు మమ్మల్ని ఈ వడికే పని చేయమని చెప్తుండేవారు. ఉత్తినే ఉబుసుపోని కబుర్లు చెప్పుకోవడం కంటే, ఈ పని చేస్తే మా మెదడుకు పని కల్పించినట్టవుతుందని అనేవారు," తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ చెప్పారామె. కౌమారపు వయసులో ఉన్న ఆమె కూతుళ్ళిద్దరూ ఈ పని చేయరు; తమ చదువూ ఇంటిపనుల మధ్య వారికి అందుకు సమయం దొరకదు.
వడకటం కశ్మీరీ సంస్కృతిలో ఒక భాగమని ఫిరదౌసా అంటారు. "ఇంతకుముందు మహిళలు తామర తూడులోంచి వచ్చే పీచు వంటి సన్నని దారం తీసేందుకు వడకటంలో ఒకరితో ఒకరు పోటీ పడేవారు," స్థానిక రుచియైన నదుర్ (తామర తూడు)ను వడకటంతో పోలుస్తూ చెప్పారామె.










