నా ఎస్ఎస్సి (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఫలితాలు రాబోయే రోజున నా పరిస్థితి అప్పుడే కొట్టిన క్రికెట్ బంతిలా ఉంది. ఆ బంతినే అందరూ ఎలా చూస్తుంటారో మీకు తెలుసా? అది నాలుగా (పరుగులు), ఆరా? అందరూ చూస్తుంటారు. నేను పరీక్ష తప్పిపోతే ఏమవుతుంది? మా నాన్న నాకు వెంటనే పెళ్ళి చేసేస్తాడు.
పరీక్షా ఫలితాలను ప్రకటించాక, నాకు 79.06 శాతం మార్కులు వచ్చినందుకు హాయిగా ఊపిరిపీల్చుకున్నాను. ఒక్క పాయింట్‌తో మా పాఠశాలలో అత్యధిక మార్కులు వచ్చినవారిలో మూడో స్థానాన్ని పోగొట్టుకున్నాను. నేను సాధించినదాన్ని చూసి నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను: మా నాథ్‌జోగీ సంచార సముదాయంలో, ఇంతవరకూ ఏ బాలికా 10వ తరగతిలో ఉత్తీర్ణురాలు కాలేదు.
నేను నావ్ ఖుర్ద్ (జళ్‌గావ్ జామోద్ తాలూకా, బుల్డాణా జిల్లా) అనే చిన్న గ్రామంలో నివాసముంటాను. మా గ్రామంలో కేవలం నా సముదాయానికి చెందినవారే ఉంటారు. ఇక్కడివాళ్ళలో ఎక్కువమంది బిచ్చం అడుక్కునేందుకు పుణే, ముంబై, నాగపూర్ వంటి పట్టణాలకు వెళ్తుంటారు. నా తల్లిదండ్రుల వంటి కొందరు మాత్రం మా చుట్టుపక్కల గ్రామాలలో రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారు.
నా తల్లిదండ్రులు - భావూలాల్ సాహెబ్రావ్ సోళంకే (45), ద్రౌపద సోళంకే (36) - గోధుమ, జొవర్ (జొన్న), మొక్కజొన్న, సోయా చిక్కుడు, ప్రత్తి పండించే ఇతరుల పొలాల్లో పనిచేస్తారు. రోజులో ఎనిమిది గంటలపాటు పనిచేస్తే వారికి ఒక్కొక్కరికి రూ. 200 వస్తాయి. పనికోసం వెతికేవాళ్ళు ఎక్కువమంది ఉండటం, వారికి తగినంత పని లేకపోవటం వల్ల నా తల్లిదండ్రులు చాల అరుదుగా మాత్రమే ఎక్కువ గంటలపాటు పనిచేస్తుంటారు, ఆ పని కూడా నెలలో 10-12 రోజులు మాత్రమే దొరుకుతుంది.
మా నాన్న 5వ తరగతి వరకూ చదివిన తర్వాత పనికి వెళ్ళటం కోసం బడి మానేశాడు. నా ఇద్దరు అక్కలలో రుక్మా (24) ఎన్నడూ బడికి వెళ్ళలేదు, నీనా (22) 5వ తరగతి వరకూ చదివింది. మా అక్కలిద్దరికీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళు బడి మానేసినప్పటి నుంచీ రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. మా అన్న దేవ్‌లాల్ (20) కూడా కూలిపనికే వెళ్తాడు. అతను 9వ తరగతిలో బడి మానేశాడు. నాకు పదేళ్ళు రాగానే మా నాన్న, "ఇక నువ్వు పనికి పోవచ్చు; ఇంకెంతమాత్రం చదవాల్సిన అవసరంలేదు," అని చెప్పాడు. అలా చెప్పింది ఆయనొక్కడే కాదు. నేను బడికి ప్రతిరోజూ ఒక ముసలావిడను దాటుకుంటూ వెళ్తుంటాను. ఆమె కూడా నన్ను తిడుతుంది: "మీ అక్కలు బడికి వెళ్ళలేదు, నీకా అవసరం ఏమిటి? చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుందనుకుంటున్నావా?"









