1951-52 మధ్య జరిగిన భారతదేశపు మొట్టమొదటి ఎన్నికల సమయంలో వోటు వేయడానికి వెళ్ళిన రోజు ఉదయం తాను ధరించిన బిరుసైన తెల్లని కుర్తా ఖ్వాజా మొయీనుద్దీన్‌కు ఇంకా గుర్తుంది. అప్పుడు 20 ఏళ్ళ వయసున్న ఆయన తన ఉత్సాహాన్ని అణచుకోలేకపోతున్నాడు. తన చిన్న పట్టణం నుంచి నూతన ప్రజాస్వామ్య ఉత్సవపు స్వేచ్ఛావాయువును పీల్చుకుంటూ, ఎగురుకుంటూ పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళాడు.
ఇప్పుడు, 72 ఏళ్ళ తర్వాత, మొయీన్ తన పదవ దశకంలో ఉన్నారు. మే 13, 2024న ఆయన మళ్ళీ బిరుసుగా ఉన్న తెల్లని కుర్తా ధరించి పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చారు. కానీ ఈ సారి ఆయన ఒక చేతి కర్ర సాయంతో పోలింగ్ స్టేషన్‌కు నడిచివెళ్ళారు. పోలింగ్ రోజున ఉండే ఉత్సవ వాతావరణం మాయమైపోయినట్టే, ఆయన అడుగులలోని తుళ్ళింత కూడా మాయమైపోయింది.
"తబ్ దేశ్ బనానే కే లియే వోట్ కియా థా, ఆజ్ దేశ్ బచానే కే లియే వోట్ కర్ రహే హై [అప్పుడు దేశ నిర్మాణం కోసం వోటు వేశాను, ఇప్పుడు దాన్ని రక్షించడానికి వోటు వేస్తున్నా]," మహారాష్ట్ర, బీడ్ నగరంలోని తన ఇంటిలో PARIతో మాట్లాడుతూ అన్నారాయన.
బీడ్ జిల్లా శిరూర్ కాసార్ తెహసీల్‌లో 1932లో పుట్టిన మొయీన్ తహసీల్ కార్యాలయంలో చౌకీదార్ (కాపలాదారు)గా పనిచేశారు. కానీ 1948లో అప్పటి రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసే సమయంలో జరిగిన హింసాకాండ నుండి తప్పించుకోవడానికి, ఆయన దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీడ్ నగరానికి పారిపోవలసి వచ్చింది.
1947లో రక్తపాతంతో కూడిన దేశవిభజన జరిగిన ఒక సంవత్సరం తర్వాత, మూడు రాచరిక రాష్ట్రాలు - హైదరాబాద్, కశ్మీర్, ట్రావెన్‌కోర్ - భారత యూనియన్‌లో చేరకుండా ప్రతిఘటించాయి. భారతదేశం లేదా పాకిస్తాన్‌లో భాగం కాని స్వతంత్ర రాజ్యాన్ని హైదరాబాద్ నిజామ్ కోరుకున్నాడు. బీడ్ కూడా భాగంగా ఉన్న మరాఠ్వాడాలోని వ్యవసాయ ప్రాంతం హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో కలిసి ఉండేది
సెప్టెంబరు 1948లో భారత సాయుధ దళాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించి, నాలుగు రోజులలోపే నిజామ్‌ను లొంగిపోయేలా చేశాయి. ఏది ఏమైనప్పటికీ, దశాబ్దాల తరువాత బయటపెట్టిన ఒక రహస్య ప్రభుత్వ నివేదిక - సుందర్‌లాల్ కమిటీ నివేదిక - ప్రకారం, కనీసం 27,000 నుండి 40,000 మంది ముస్లిములు ఈ దండయాత్ర సమయంలోనూ, ఆ తరువాత ప్రాణాలు కోల్పోయారు; మొయీన్ వంటి యుక్తవయస్కులు ప్రాణాల కోసం పరిగెత్తవలసి వచ్చింది.
"మా ఊరిలో ఉన్న బావి శవాలతో నిండిపోయింది. మేమంతా బీడ్ నగరానికి పారిపోయాం. అప్పటినించీ అదే నా ఇల్లయింది," ఆయన గుర్తుచేసుకున్నారు.









