కోమల్ ఒక రైలు ఎక్కాలి. ఆమె అసోమ్‌లోని రాంగియా జంక్షన్‌లో ఉన్న తన ఇంటికి వెళ్తోంది.
అది, తాను ఎన్నడూ తిరిగి వెళ్ళకూడదని, చివరకు మానసిక వైకల్యం ఉన్న తన తల్లిని చూసేందుకు కూడా, ఒట్టు పెట్టుకున్న ప్రదేశం.
తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్న ఆ ఇంటికి తిరిగి వెళ్ళటం కంటే, దిల్లీలోని జిబి రోడ్‌లో ఉండే వేశ్యా గృహాలలో ఉంటూ, అక్కడ పనిచేయటానికే ఆమె ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పుడు తనను తిరిగి పంపుతున్న ఆ కుటుంబంలో తాను పదేళ్ళ బాలికగా ఉండగా తనపై అనేకసార్లు అత్యాచారం చేసిన 17 ఏళ్ళ అన్న వరసయ్యే అతను (కజిన్) కూడా నివసిస్తున్నాడు. "నాకు అతని (కజిన్) మొహం చూడాలని లేదు. నాకు అతనంటే రోత," అంటుంది కోమల్. అతను ఆమెను తరచూ కొట్టేవాడు, తనను ఆపే ప్రయత్నం చేస్తే ఆమె తల్లిని చంపేస్తానని బెదిరించేవాడు. ఒకసారి అతను ఆమెను ఒక పదునైన వస్తువుతో కొట్టడం వలన ఏర్పడిన గాయపు మచ్చ ఆమె నుదిటిపై అలాగే ఉంది.
"హే కారొణే ముర్ ఘర్ జాబో మొన్ నై. మొయ్ కిమన్ బార్ కొయిసు హీ హోతొక్ [నాకు ఇంటికి వెళ్ళాలని అనిపించకపోవటానికి కారణం ఇదే. నేను వాళ్ళకు చాలాసార్లు చెప్పాను కూడా]," పోలీసులతో వ్యవహరించేటపుడు తాను వారితో ఇలా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నది కోమల్. అయినప్పటికీ, పోలీసులు ఎలాంటి ఏర్పాట్లూ చేయకుండా ఆమెను రైలులో 35 గంటల అసోమ్ ప్రయాణానికి పంపేస్తున్నారు. ఆమె సురక్షితంగా ఇంటికి చేరిందో లేదో నిర్ధారించడానికి కానీ, ఇంట్లో ఉన్నప్పుడు ఆమె మరింత హింసను ఎదుర్కోకుండా రక్షించబడటానికి కానీ వీలు లేకుండా, కనీసం ఒక సిమ్ కార్డు కూడా ఇవ్వకుండా ఆమెను పంపించేస్తున్నారు.
కోమల్‌కు నిజంగా కావలసింది అక్రమ రవాణాకు గురైన మైనర్లకు, చిన్నవయసు యువతులకు అవసరమైన ప్రత్యేక సహాయక సేవలు.





