ఈ కథనాన్ని ప్రకృతి శాస్త్రవేత్త, ఫోటోగ్రాఫర్ అయిన రాధేశ్యామ్ బిష్ణోయ్‌కు అంకితం చేస్తున్నాం.
మే 23, 2025న జైసల్మేర్ జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో రాధేశ్యామ్ మరణించారు. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌లో ఉన్న చింకారా (గజెల్లా బెన్నెట్టి) నివాసమైన భాదరియా మాతా ఓరణ్ (పవిత్ర ఉపవనం)లో వేటగాళ్ళ సంచారం గురించి అర్ధరాత్రివేళ వచ్చిన హెచ్చరికకు స్పందనగా ఆయన ప్రయాణమయ్యారు. వాహనం బోల్తాపడిన ఈ ప్రమాదంలో రాధేశ్యామ్‌తో పాటు వాహనంలో ఉన్న అటవీ అధికారులు కూడా మరణించారు.
రాజస్థాన్‌లోని పోఖ్రణ్ తహసీల్‌లో నివసించే వన్యప్రాణి ఫోటోగ్రాఫర్, ప్రకృతి శాస్త్రవేత్త అయిన రాధేశ్యామ్ తన పనికి ప్రాణంపెట్టే ప్రకృతి శాస్త్రవేత్త. ఆయన బట్టమేక పక్షితో సహా ఇతర పక్షులను, చింకారాతో పాటు ఈ ప్రాంతంలో సంచరించే ఇతర జంతువులను ట్రాక్ చేయడం, వాటిని వేటాడటాన్ని నిరోధించడం వంటి పరిరక్షణ ప్రయత్నాలలో గాఢమైన అంకితభావంతో పాల్గొనేవారు. తన జ్ఞానాన్ని, ఛాయాచిత్రాలను తనను సంప్రదించిన ఎవరితోనైనా ఉదారంగా పంచుకునే ఆయన మరణం ఒక శూన్యాన్ని మిగిల్చింది. 30 సంవత్సరాల వయసున్న రాధేశ్యామ్ తన భార్య, ఇద్దరు పసివయసు పిల్లలు, తల్లితో కలిసి ఢోలియా గ్రామంలో నివసించారు. ఆయనను తెలిసినవారందరికీ ఆయన మరణం తీరని లోటు.

















