పంజాబ్‌లోని తన పిండ్ (గ్రామం)కు చెందిన ట్రావెల్ ఏజెంటును గురించి సింగ్‌కు ఇప్పటికీ పీడకలలు వస్తుంటాయి.
ఏజెంటుకు చెల్లించేందుకు సింగ్ (అసలు పేరు కాదు) తన కుటుంబానికి చెందిన ఒక ఎకరం పంటభూమిని అమ్మేశారు. బదులుగా అతను సెర్బియా మీదుగా పోర్చుగల్‌కు సురక్షిత మార్గంలో వెళ్ళేందుకు అవసరమైన ‘ఏక్ నంబర్ [చట్టబద్ధమైన పత్రాలు]’ సమకూరుస్తానని ఆ ఏజెంట్ జతీందర్ వాగ్దానం చేశాడు.
తాను జతీందర్ చేతిలో మోసపోయి, అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా మానవ అక్రమ రవాణా బారిన పడినట్టుగా చాలా త్వరలోనే సింగ్‌కు అర్థమయింది. దిగ్భ్రాంతికీ విస్మయానికీ లోనైన అతను తన దుస్థితి గురించి గ్రామంలో ఉన్న తన కుటుంబానికి తెలియచేయలేకపోయారు.
దట్టమైన అడవులను దాటుకుంటూ, మురుగు కాలవలలో ఈడ్చుకుంటూ నడుస్తూ, యూరప్‌లోని పర్వతాలను ఎక్కుతూ ఆయన, ఆయన తోటి వలసజీవులు తమ ప్రయాణమంతా కేవలం బ్రెడ్ మాత్రమే తిని, నీటి గుంటలలో నిలిచివున్న వాన నీటిని తాగుతూ సాగించారు. ఇప్పుడతనికి బ్రెడ్ చాలా అసహ్యించుకునే ఆహారంగా మారిపోయింది.
"మేరే ఫాదర్ సాబ్ హార్ట్ పేషంట్ ఆ. ఇన్నా టెన్షన్ ఓ లే నై సక్తే. నాలే, ఘర్ మేఁ జా నహీ సక్తా క్యూఁ కే మైఁ సారా కుచ్ దావ్ తే లాకే ఆయా హీ [మా నాన్నగారు హృద్రోగి; ఆయన ఎక్కువ ఒత్తిడిని భరించలేరు. నేను ఇంటికి కూడా వెళ్ళలేను, ఎందుకంటే నేను సర్వస్వాన్నీ పణంగా పెట్టి ఇక్కడకు వచ్చాను]," పోర్చుగల్‌లో ఒక రెండు గదుల అద్దె ఇంటిలో మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఉంటోన్న 25 ఏళ్ళ సింగ్ చెప్పారు.
కొన్నేళ్ళుగా దక్షిణాసియా దేశాలైన భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలకు చెందిన శ్రామికులకు పోర్చుగల్ అభిమాన గమ్యస్థానంగా కనబడుతోంది.








