నిశ విసురుకుంటూ నేల మీద కూర్చొని ఉన్నారు. వేడిగా ఉన్న ఆ జూన్ మాసపు అపరాహ్ణవేళ ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది; పొగాకు, ఎండుటాకుల వాసన గాలిని బరువుగా చేస్తోంది. "నేను ఈ వారం చాలా కొద్ది బీడీలు మాత్రమే చేయగలిగాను," 17 కట్టలుగా చుట్టివున్న సుమారు 700 బీడీలను చూపుతూ అన్నారామె. "వీటి విలువ బహుశా రూ. 100 కంటే తక్కువే ఉండవచ్చు,” అని 32 ఏళ్ళ ఈ బీడీ తయారీదారు తన వారం రోజుల పని గురించి చెప్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఈ దామోహ్ జిల్లాలో వెయ్యి బీడీలకు రూ. 150 లభిస్తుంది.
ప్రతి బుధ, శుక్రవారాలు బీడీ తయారీదార్లు తాము చేసిన బీడీలను తీసుకువస్తారు. అలాగే తర్వాతి చుట్టు బీడీలను చుట్టడానికి అవసరమైన ముడిపదార్థాలను తీసుకుంటారు. అనేక కర్మాగారాలు దామోహ్ నగర శివార్లలోనే ఉన్నాయి. వాళ్ళు ఠేకేదార్ (కాంట్రాక్టర్లు)లను నియమించుకుంటారు; ఆ కాంట్రాక్టర్లు ఈ పనికోసం శ్రామికులను, ప్రధానంగా మహిళలను, ఏర్పాటుచేసుకుంటారు.
ముడిసరుకును ఇళ్ళకు తీసుకువెళ్ళిన మహిళలు, తమ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, కత్తిరించిన పొగాకును తెందూ (తునికి) ఆకులతో చుట్టి, సన్నని దారాలతో చక్కగా బీడీలను కట్టలుగా కట్టే పనిని ఆ వారమంతా చేస్తారు. ఆ విధంగా వారు సుమారుగా రూ. 10,000-20,000 ఉండే తమ సగటు నెలవారీ గృహ ఆదాయానికి, తమ వంతు ఆదాయాన్ని చేరుస్తారు. ఇది 8-10 మంది సభ్యులున్న కుటుంబాలను పోషించాలి. వీరిలో చాలామంది మహిళలు వ్యవసాయ కూలీలు, లేదా చిన్న కమతాలను కలిగివున్నవారు.
"ఎండిన తెందూ ఆకులను వాటి ఈనెలు పైకి తేలేవరకూ నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక ఫర్మా (ఇనుప రేకు) ఉపయోగించి చిన్న దీర్ఘచతురస్రాకారపు ముక్కలుగా కత్తిరించాలి. ఆకు లోపల జర్దా (వాసన పొగాకు) పెట్టి ఆకును బీడీగా చుట్టాలి," వివరించారు నిశ. ప్రతి బీడీని అవి వేరు వేరు కంపెనీలకు చెందినవిగా గుర్తించేందుకు వీలుగా రంగు దారంతో కట్టాలి. ఇలా కట్టడం బ్రాండ్ సూచికగా కూడా పనిచేస్తుంది.
వీటిని బీడీ 'కర్మాగారాని'కి విక్రయించడానికి తీసుకువస్తారు. ఆ కర్మాగారం తప్పనిసరిగా బీడీ తయారీ బ్రాండ్‌కు చెందిన సరుకుతయారీ, ప్యాకేజింగ్ యూనిట్, గిడ్డంగి అయివుంటుంది. వారు తాము తెచ్చినవాటిని తమని కర్మాగారానికి తీసుకువెళ్ళే, లేదా నేరుగా చెల్లించే కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కర్మాగారంలో వాటిని క్రమబద్ధీకరించి, కాల్చి, కట్టలు కట్టి, నిల్వ చేస్తారు.









