మా అమ్మ నాతో తరచూ అంటుండేది: “కుమార్, నేను ఆ చేపల కుండను పట్టుకోకుండా ఉంటే, మనం ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు.” నేను పుట్టిన ఏడాది తరువాత, అమ్మ చేపలు అమ్మడం ప్రారంభించింది. అప్పటి నుండి నా జీవితమంతా చేపలతోనే నిండిపోయింది.
మా ఇల్లంతా చేపల వాసనతో నిండిపోయి ఉంటుంది. ఒక మూల ఎప్పుడూ ఎండు చేపల మూట వేలాడదీసి ఉంటుంది మరి. తొలకరి జల్లులు పడగానే అమ్మ గండు (carp) చేపలను వండుతుంది. అదొక రుచికరమైన వంటకం; జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇక అమ్మ వాలుగ చేపలు (cat fish), మోసులు (spotted snakehead), లేదా సెలాప్పి (గుల్ల చేప) చేపలతో కూర చేస్తే, ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది.
నా చిన్నతనంలో, చేపలు పట్టడం కోసం నేను తరచుగా బడి ఎగ్గొట్టేవాడిని. మదురైలోని జవహర్‌లాల్‌పురం ప్రాంతంలో అన్ని ప్రదేశాలూ నీళ్ళతో కళకళలాడుతుండే రోజులవి; మా జిల్లా అంతటా బావులు, నదులు, సరస్సులు, చెరువులే ఉండేవి. నేనూ మా తాతయ్యతో కలిసి ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళేవాడిని. మేం ఒక ఊయల బుట్టను తీసుకెళ్ళేవాళ్ళం. దానిని నీటిలో ముంచి పైకెత్తి చేపలను పట్టుకునేవాళ్ళం. అలాగే, వాగులో నీటి ప్రవాహమున్న చోటికి వెళ్ళి, ఎరను ఉపయోగించి చేపలు పట్టేవాళ్ళం.
నీటి ప్రవాహం దగ్గరికి మేం వెళ్ళకుండా ఉండడానికి, అమ్మ మాకు దెయ్యాల కథలు చెప్పి భయపెట్టేది. కానీ చెరువుల గుండా నీళ్ళెప్పుడూ ప్రవహిస్తూనే ఉండేవి; మేమెప్పుడూ ఆ నీటి చుట్టూనే ఉండేవాళ్ళం. నేను మా ఊరిలో ఉండే ఇతర అబ్బాయిలతో కలిసి చేపలు పట్టేవాడిని. నేను పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది; చెరువుల నీటి మట్టాలు పడిపోయాయి; వ్యవసాయం కూడా దెబ్బతింది.
మా ఊరు జవహర్‌లాల్‌పురంలో మూడు చెరువులు ఉన్నాయి – ఒకటి పెద్దది, మరొకటి చిన్నది, ఇంకోటి మారుతంకుళం చెరువు. మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద, చిన్న చెరువులను వేలం వేసి, గ్రామంలోని వ్యక్తులకు గుత్తకు ఇచ్చారు. వాళ్ళు ఆ చెరువులలో చేపలను పెంచుతారు; అదే వారి జీవనాధారం. తయ్ (మధ్య-జనవరి నుండి మధ్య-ఫిబ్రవరి వరకు) నెలలో, ఆ రెండు చెరువులలో విరివిగా చేపలు పడతారు – ఈ కాలాన్ని చేపలవేట కాలంగా పరిగణిస్తారు.
చెరువుల నుండి చేపలు కొనడానికి మా నాన్న వెళ్తోంటే, నేను కూడా ఆయన వెంట వెళ్ళేవాడిని. సైకిల్ వెనుక చేపలను నిల్వచేసే ఒక పెట్టె కట్టివుండేది. మేం చేపలను కొనేందుకు చాలా గ్రామాలు తిరిగేవాళ్ళం; కొన్నిసార్లు 20-30 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించేవాళ్ళం.


































