అంతర్జాతీయ న్యాయనిపుణుల కమిషన్ ప్రచురించిన లివింగ్ విత్ డిగ్నిటీ 2019 నివేదిక ప్రకారం, నిర్బంధం, బలవంతపు పెళ్ళి, లైంగిక, శారీరక హింస, ‘దిద్దుబాటు’ (corrective) చికిత్సలు అనేవి ఎల్‌జిబిటిక్యుఐఎ+ (LGBTQIA+) కమ్యూనిటీ సభ్యులు తరచుగా ఎదుర్కొనే అనుభవాలు, బెదిరింపులు.
ముంబైలో కలిసి జీవించడానికి మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్ జిల్లాల్లోని తమ ఇళ్ళను విడిచిపెట్టాల్సి వచ్చిన విధి, ఆరుష్ (పేర్లు మార్చబడ్డాయి)ల విషయాన్నే తీసుకోండి. విధి, ఆరుష్ (ట్రాన్స్ మ్యాన్‌గా గుర్తించబడుతున్నారు)లు నగరంలోని ఒక అద్దె గదిలోకి మారారు. "మా ఇంటి యజమానికి మా సంబంధం గురించి తెలియదు. మాకు ఈ గదిని ఖాళీ చేయాలని లేదు. అందుకని మేం మా బంధాన్ని దాచిపెట్టాలి,” అని ఆరుష్ చెప్పారు.
ఎల్జిబిటిక్యుఐఎ+ వ్యక్తులకు తరచుగా ఆశ్రయం దొరకదు. కుటుంబాలు, అద్దె ఇంటి యజమానులు, ఇరుగుపొరుగు, పోలీసులు వారిని వేధిస్తారు, ఇళ్ళ నించి బలవంతంగా గెంటేస్తారు. అనేకమంది ఇల్లూవాకిలి లేనివారుగా మిగిలిపోతున్నారని లివింగ్ విత్ డిగ్నిటీ రిపోర్ట్ చెబుతోంది.
అపవాదులు, వేధింపులు చాలామంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో, వారి ఇళ్ళను విడిచిపెట్టి, సురక్షిత స్థలాలను వెదుక్కునేలా చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ 2021లో విడుదల చేసిన అధ్యయనం, "వారి లింగ వ్యక్తీకరణను దాచిపెట్టాలని కుటుంబం వారిని ఒత్తిడి చేస్తుంది," అని తెలిపింది. వారి కుటుంబం, స్నేహితుల, సమాజాల వివక్షాపూరిత ప్రవర్తన కారణంగా దాదాపు సగంమంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు.
"కేవలం మేం లింగమార్పిడి చేసుకున్నందుకే మాకు ఇజ్జత్ (గౌరవం) లేదని అనిపిస్తుందా?" అని అడుగుతారు, ట్రాన్స్ మహిళ శీతల్. పాఠశాలలో, పనిచేసే చోట, వీధుల్లో, దాదాపు ప్రతిచోటా ఎదుర్కొన్న ఎన్నో ఏళ్ళ చేదు అనుభవాల నుంచి ఆమె ఇలా అడుగుతున్నారు. "అందరూ మమ్మల్ని ఎందుకు తిరస్కారంతో చూస్తారు?" అంటూ ‘మేమేదో దుష్టశక్తులమైనట్టు జనం మమ్మల్ని మిటకరించి చూస్తుంటారు’ అనే తన కథలో అడుగుతారు శీతల్.






