"మద్యం తాగితే ఆకలితో సహా ఎన్నో విషయాలను మరచిపోవటం చాలా సులభం," సింగ్‌ధుయి గ్రామానికి చెందిన రబీంద్ర భుయ్యాఁ అంటారు.
యాబై ఏళ్ళు దాటిన భుయ్యాఁ ఒక శబర్ (పశ్చిమ బెంగాల్‌లో శబర్‌గా జాబితా చేసివున్నారు) ఆదివాసి. ముండా ఆదివాసీ సముదాయానికి చెందిన శబరులు తూర్పు భారతదేశంలో నివసిస్తుంటారు. వీరిని శౌరా, శొర, శబర్, శూరీలు అని కూడా పిలుస్తారు. లోధా శబరులు (అవిభక్త) పశ్చిమ మేదినీపూర్లో ఎక్కువగా ఉంటారు; ఖాడియా శబరులు ఎక్కువగా పురూలియా, బాఁకురా, (అవిభక్త) పశ్చిమ మేదినీపూర్‌లలో నివాసముంటారు.
మహాశ్వేతా దేవి రాసిన The Book of the Hunter (మొదటగా 1994లో బ్యాధ్‌ఖండొ పేరుతో బంగ్లా భాషలో ప్రచురితమైంది) ఈ సముదాయపు అత్యంత పేదరికాన్ని గురించీ, వారి అట్టడుగు స్థితిని గురించీ వర్ణిస్తుంది. దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఆ పరిస్థితి పెద్దగా మారిందేమీ లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఆదివాసుల జీవన ప్రపంచం పేరుతో 2020లో వచ్చిన ఒక నివేదిక, "సర్వేచేసిన గ్రామాలలోని 67 శాతం గ్రామాలు ఆకలితో అలమటిస్తున్నట్టుగా తెలుస్తోంది," అని తెలిపింది.
ఈ సముదాయాన్ని 18వ శతాబ్దపు చివరి సగం వరకూ కూడా "నేరస్థ జాతి 'గా బ్రిటిష్ పాలన ముద్రవేసింది. 1952లో ఆ ముద్రను తొలగించారు. సంప్రదాయక వేటగాళ్ళైన వీరు పండ్లను, ఆకులను, దుంపలను సేకరించడంలోనూ, అడవిలోని జంతువులను వేటాడటంలోనూ నేర్పు కలిగినవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమందికి సాగుచేసుకోవడానికి భూమి ఇచ్చారు, కానీ ఆ భూమి రాళ్ళతో నిండిన బంజరు కావటంతో వారు చివరకు వలస కూలీలుగా మారిపోయారు. వారిపై నేరస్థ జాతిగా ముద్రను తొలగించినప్పటికీ, ఆ కళంకం అలాగే నిలిచిపోయింది. దాంతో తమ ప్రతి కదలికకు కళ్ళెం వేసే స్థానిక పోలీసుల, అటవీ అధికారుల దయాదాక్షిణ్యాలపై అధారపడి వారు జీవనం సాగిస్తున్నారు.
ఆదాయ అవకాశాలు చాలా కొద్దిగా ఉండటంతో, పశ్చిమ మేదినీపూర్, ఝాడ్‌గ్రామ్ జిల్లాలలో నివాసముండే శబర్ సముదాయాలను ఆకలి తాకింది. భుయ్యాఁ వంటి అనేకులు తమ ఆకలిని మద్యంతో అణచిపెడతారు. లేదా, "మేం మూడు పూటలా పంతా భాత్ (పులియబెట్టిన అన్నం) తింటాం. మేం బతికేది దానిమీదే," అంటారు బంకిమ్ మల్లిక్. తపోబన్ గ్రామ నివాసి అయిన 55 ఏళ్ళ మల్లిక్ ఇక్కడ, ఇంట్లోని ప్రతి కుటుంబ సభ్యునికి నెలకు ఐదు కిలోల చొప్పున ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా పంచిపెట్టే బియ్యం గురించి ప్రస్తావిస్తున్నారు. "నూనె, ఉప్పు విలాసం కింద లెక్క" అంటారాయన. ఆయన తన పాడుబడిపోయిన ఇంటిముందు కూర్చొని పంతా భాత్ తింటున్నారు.
ఏడాది పొడవునా శబరులు తమకు వచ్చే కొద్దిపాటి రేషన్‌కు తోడుగా అడవి అందించే ఫలసాయంపై ఆధారపడతారు. వేసవి నెలలైన బైశాఖ్, జైష్ట్య లలోనూ, వానాకాలపు నెల ఆషాఢం లోనూ వీరు అటవీ ఫలాలను, దుంపలను సేకరించుకుంటారు. ఇంకా పిట్ట పిల్లలను, పాములను, గొసాప్ (ఉడుము)లను, కప్పలను, నత్తలను వేటాడతారు. అలాగే పొలాల్లో దొరికే కప్పలను, పెద్ద నత్తలను, చిన్న చేపలను, ఎండ్రకాయలను కూడా.
ఆ తర్వాత వచ్చే శ్రావణం, భాద్ర, అశ్విని లలలో నదీగర్భంలోంచి చేపలను; ఆ వెంటనే వచ్చే కార్తీకం, అగ్రహయన్, పౌష్ లలో ముందుగా వరిపొలాలలోని ఎలుకలను పట్టి, ఆ పైన అవి బొరియలలో దాచుకొన్న ధాన్యాన్ని తోడితీస్తారు. శీతాకాలపు మాఘ మాసంలోనూ ఆ తర్వాత వచ్చే వసంతం - ఫల్గుణం, చైత్ర మాసాలలోనూ వారు చిన్న జంతువులతో పాటు అటవీ సీమలలో పండ్ల కోసం, చాక్ (తేనెపట్టు) కోసం వేటాడతారు.
అడవి జంతువులు ఆహారం కోసం దూకుడుగా ముందుకు వస్తాయని, అందుకే అవి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు ప్రమాదం కాబట్టి, ఇతర ఆదివాసీ వర్గాల మాదిరిగానే, వాళ్ళు కూడా అడవుల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు.
"ఎవరైనా జబ్బు పడినప్పుడు కూడా మేం చీకటిపడ్డాక మా ఊరిని విడిచి వెళ్ళం. కొన్ని ఏనుగుల గుంపులు కనీసం కదలను కూడా కదలకుండా ఉండిపోతాయి. అక్కడికి వాటికేదో ఆధార్ కార్డ్ (ఇంటిని చూపే) ఉన్నట్టు," కాస్త ఎకసక్కెంగా అన్నారు జోగా ముల్లిక్ (52)
అరవైల వయసులో ఉన్న శుక్ర నాయక్ తపోబన్ గ్రామానికి చెందిన శబర్ ఆదివాసి. ఏనుగులు ఉండటం,"ఇక్కడ చాలా భయాన్ని కలిగిస్తోంది. ఏనుగులు ప్రతిచోటా ఎక్కడబడితే అక్కడే ఉంటాయి. అవి చాలా జగడాలమారిగా కూడా ఉంటాయి. అవి జనంపై దాడికి దిగటమే కాకుండా వరి పొలాలను, అరటి చెట్లను, చివరకు మా ఇళ్ళను కూడా ధ్వంసం చేస్తాయి," అన్నారాయన.
ఆయన పొరుగువాడు, బినాశులి గ్రామవాసి అయిన జతిన్ భక్త, "మేం అడవికి వెళ్ళకపోతే ఏం తినాలి? కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే పంతా భాత్ తిని బతికిన రోజులున్నాయి," అని పేర్కొన్నారు.
సరైన ఆహారం లేకపోవడంతో శబరులు క్షయవ్యాధి వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. క్షయవ్యాధి పీడితురాలైన సరథి మల్లిక్ (30) వైద్య శిబిరాలకు వెళ్తుండేవారు, కాని ఇప్పుడామె అలాంటి శిబిరాలకు వెళ్ళాలనుకోవడంలేదు. బినాశులీలో నివాసముండే ఈమె, "నా కుటుంబంలో నేనొక్కదాన్నే మహిళను. నేను ఆసుపత్రిలో చేరాల్సివస్తే, మా ఇంటిపనంతా ఎవరు చేస్తారు? నా భర్తతో కలిసి ఆకులు ఏరడానికి అడవికి వెళ్ళేదెవరు?" అంటూ వివరిస్తారు. పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళడం కూడా ఖరీదైన విషయమే. "ప్రతిసారీ ఒకవైపు ప్రయాణానికే రూ 50-80 వరకూ అవుతున్నాయి. మేమంత భరించలేం."
సాల ( షోరియా రోబొస్టా ) వృక్షాల ఆకులను సేకరించి, వాటిని అమ్మడం శబరుల కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరు. ఇది చాలా కష్టమైన పని. గట్టి చెక్కను కలిగివుండే సాల వృక్షం భారతదేశంలో ఒక ముఖ్యమైన కలపకు వనరు. సాల పత్రాలను కొనేందుకు క్రమం తప్పకుండా మార్కెట్లను సందర్శించే ఒడిశాకు చెందిన దిలీప్ మొహంతీ, "ఆ ఏడాది ఆకుల సరఫరా చాలా దారుణంగా పడిపోయింది. ఏనుగుల భయంతో శబర్ ఆదివాసులు అడవిలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు," అన్నారు.
ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న పని అని జతిన్ పొరుగువారైన కొండా భక్త అన్నారు. "మేమంతా ఒక బృందంగా కలిసి వెళ్తాం. అడవిలో ఏనుగులూ పాములూ ఉండటం వలన అడవిలోకి వెళ్ళటం చాలా ప్రమాదకరమైన పని. మేం ఉదయం 6 గంటలకు వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగివస్తాం."
సేకరించిన ఆకులను ఎండబెట్టిన తర్వాత, "మేం వాటిని దగ్గరలోనే ప్రతి శనివారం జరిగే హాట్ (సంత)కు సైకిల్‌పై తీసుకుపోతాం. వీటిని కొనుగోలు చేయడానికి ఒడిశా నుండి వచ్చేవారు వెయ్యి ఆకుల కట్టకు రూ. 60 ధర చెల్లిస్తారు. నేను వారానికి 4 కట్టలు అమ్మగలిగితే, నాకు రూ. 240 వస్తాయి," అని జతిన్ భక్త చెప్పారు. "ఇక్కడ చాలా కుటుంబాలకు అది సగటు సంపాదన."
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పి ఎమ్ఎవై) క్రింద ఈ సముదాయానికి ఇళ్ళు కట్టించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించింది. కానీ "మేమక్కడ నివసించలేం," అంటున్నారు సాబిత్రి మల్లిక్(40). రేకుల కప్పుతో నిర్మించిన ఆ కాంక్రీట్ ఇళ్ళలో నివసించడం సాధారణ వేసవిలో 43 డిగ్రీలవరకూ ఉష్ణొగ్రత ఉండే ఆ ప్రదేశంలో చాలా కష్టం. "మార్చి నుండి జూన్ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ఈ ప్రదేశంలో ఎలా జీవించగలం?"
బినాశులి, తపోబన్ వంటి గ్రామాలలో ఈ సముదాయాల జీవన స్థాయిలను పెంచేందుకు పనిచేస్తోన్న కాజలా జనకల్యాణ్ సమితి (కెజెకెఎస్) అనే ఎన్‌జిఒ నడుపుతోన్న కొన్ని ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలున్నాయి. అక్షరాస్యతా శాతం 40గా ఉంది; ఇది రాష్ట్ర, దేశీయ సగటుల కంటే దిగువన ఉంది. ఈ ప్రాంతంలోని దాదాపు మూడు వంతుల ఆదివాసీ పిల్లలు పాఠశాలలలో (మాధ్యమిక, హయ్యర్ సెకండరీ) చేరటం లేదని 2020 నివేదిక చెప్తోంది. కుల ఆధారిత దాడులు, బడి దూరంగా ఉండటం, చదువుకు అయ్యే ఖర్చులను భరించే స్తోమత లేకపోవటం వంటి కారణాల వల్ల విద్యార్థులు బడి మానుకుంటున్నారని కూడా ఈ నివేదిక చెప్తోంది.
"ఈ సముదాయానికి సరైన సంపాదనలు లేకపోవడం వలన పిల్లలను బడికి పంపించటమనేది ఒక విలాసంగా మారింది," అని కెజెఎస్ అధినేత స్వపన్ జనా చెప్పారు.
ఆరోగ్య సంరక్షణను విషయానికి వస్తే, “సమీపంలో ఎలాంటి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ శిబిరాలు లేనందున వారికి ఎక్స్-రేలు తీయించుకోవడం కూడా కష్టమే. కాబట్టి, వారు ప్రాచీన (సంప్రదాయ) వైద్య విధానాల ద్వారా నయం చేసే వైద్యులపై ఆధారపడతారు,” అని పల్లవి సేన్‌గుప్తా చెప్పారు. ఈమె ఈ ప్రాంతంలోని ఆదివాసీలకు వైద్య సేవలను అందించే స్వచ్ఛంద సంస్థలో జర్మన్ వైద్యులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాము కాటు కూడా చాలా సాధారణం. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో సంప్రదాయ వైద్యులు ఇక్కడి పరిస్థితులను తమ ఆధీనంలో ఉంచుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో కేవలం 40,000 మంది శబరులు మాత్రమే ఉన్నప్పటికీ ( భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గణాంకాలు, 2013 ), శబరులు ఆకలి అంచున జీవిస్తున్నారు.
2004లో, ప్రస్తుత ఝాడ్‌గ్రామ్ జిల్లా, అప్పటి మేదినీపూర్ జిల్లాలోని శబర్ గ్రామంలో ఐదుగురు వ్యక్తులు అనేక నెలలు ఆకలితో అలమటించి మరణించారనే వార్త జాతీయ మీడియాలో తీవ్ర సంచలనానికి దారితీసింది. ఇరవై సంవత్సరాల తరువాత, పెద్దగా ఏమీ మారలేదు: ఆకలి ఆధిపత్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం అలాగే ఉన్నాయి. ఆదివాసీ పల్లెలు దట్టమైన అడవుల్లో ఉండడం వలన మానవ-జంతు సంఘర్షణలు తరచుగా జరుగుతుంటాయి.
వారి దారుణమైన పరిస్థితిని బట్టి, ఆహారానికి ప్రత్యామ్నాయం మద్యం అని గ్రామస్థులు చమత్కరించినప్పుడు, అదంత తేలికైన విషయమేమీ కాదు. రబీంద్ర భుయ్యాఁ ఈ విలేఖరిని ఇలా అడిగారు: “నా ఊపిరిలో మద్యం వాసన ఉంటే, మీరు నన్ను తిడతారా?"
అనువాదం: సుధామయి సత్తెనపల్లి