ఒక జీవశాస్త్రవేత్త, ఒక సైనికుడు, ఒక గృహిణి, ఒక భూగోళశాస్త్ర పట్టభద్రుడు.
రాంచీలో రద్దీగా ఉండే రహదారికి దూరంగా, ఈ ఒకరితో ఒకరికి పోలికలేని వ్యక్తుల సమూహం ఒక వెచ్చని వేసవి రోజున ఒకచోటకు కలిసివచ్చారు. వీరంతా ప్రత్యేకించి దుర్బలమైన ఆదివాసీ సమూహాల (PVTG) సభ్యులు. ఝార్ఖండ్ రాజధానీ నగరంలోని ఆదివాసీ పరిశోధనా సంస్థ (TRI)లో జరుగుతోన్న లేఖన కార్యశాలలో పాల్గొనేందుకు వచ్చారు.
"నా పిల్లలు తమ మాతృభాషలో చదవాలని నేను కోరుకుంటున్నాను," మాల్ పహారియా సముదాయానికి చెందిన మావ్‌ణో భాషను మాట్లాడే జగన్నాథ్ గిరహీ అన్నారు. 24 ఏళ్ళ వయసున్న జగన్నాథ్ తన అంతరించిపోతోన్న మాతృభాష మావ్‌ణోకు వ్యాకరణం రాయటానికి దుమ్‌కా లోని తమ గ్రామం నుంచి 200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి రాంచీలోని TRIకి వచ్చాడు.
అతనికి చాలా ప్రణాళికలున్నాయి: "మేం మావ్‌ణో భాషలో ఒక పుస్తకాన్ని ప్రచురించాలనుకుంటున్నాం," అని జగన్నాథ్ చెప్పాడు. స్వగ్రామం బలియాఖోడాలో జీవశాస్త్రంలో ఎమ్మెస్సీ డిగ్రీ సంపాదించిన మొదటి, ఏకైక వ్యక్తి జగన్నాథ్. ఈయన ఈ డిగ్రీని హిందీ మాధ్యమంలో చదివాడు. "విశ్వవిద్యాలయంలో ఎక్కువమంది ఉన్న సముదాయానికి చెందిన భాషలోనే బోధన జరుగుతుంది," అని అతను పేర్కొన్నాడు. "ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) సిలబస్ కూడా ఖొరఠా, సంథాలీ వంటి [ఆదివాసీ] భాషల్లో అందుబాటులో ఉంటుంది, కానీ మా భాషలో [మావ్‌ణో] మాత్రం లేదు."
"ఇదే [ప్రాముఖ్యాన్నివ్వకపోవటం] కొనసాగితే, నా భాష నెమ్మదిగా అదృశ్యమవుతుంది." మాల్‌పహారియా భాషను మాట్లాడేవారిలో దాదాపు 15 శాతం మంది ఝార్ఖండ్‌లో నివసిస్తున్నారు; మిగిలినవారు పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నారు
వారి భాష మావ్‌ణో ద్రావిడ ప్రభావాలు కలిగిన ఇండో-ఆర్యన్ భాష. 4000 కంటే తక్కువమంది మాట్లాడే అంతరించిపొతోన్న ఈ భాషకు అధికారిక భాష హోదా లేదు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (LSI), ఝార్ఖండ్ ప్రకారం, మావ్‌ణోని పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఉపయోగించలేదు, దానికి ప్రత్యేకమైన లిపి కూడా లేదు.









