అశోక్ జాటవ్ అటువంటి ఒక నడుస్తున్న మృతుడు.
ఈ 45 ఏళ్ళ వ్యక్తి అందరిలాగే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్ర లేస్తారు. మిగతా కూలీల్లాగే పనికి వెళ్ళి ఇతరుల పొలాల్లో కూలీ పని చేస్తారు. మిగతా పనివాళ్ళందరి మాదిరిగానే రోజుంతా పని చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారు. అతనికి, మిగిలిన వాళ్ళకు మధ్య ఒకే ఒక తేడా ఉంది: అధికారికంగా, అశోక్ మరణించారు.
జూలై 2023లో, ఖోర్‌గర్ నివాసి అశోక్ తనకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వస్తున్న రూ. 6,000 గత రెండేళ్ళకు పైగా రావడంలేదని గుర్తించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం, రైతులు ఈ పథకం కింద కనీస ఆదాయ మద్దతుగా సంవత్సరానికి రూ. 6,000 పొందడానికి అర్హులు.
మొదటి రెండు సంవత్సరాలు క్రమం తప్పకుండా డబ్బు జమ అయింది. తర్వాత అకస్మాత్తుగా అది ఆగిపోయింది. అది కేవలం వ్యవస్థలో వచ్చిన అవాంతరమై ఉంటుందని, మళ్ళీ పరిస్థితి చక్కబడుతుందని అతను భావించారు. అశోక్ అనుకున్నది నిజమే. అదొక చిన్న అవాంతరమే. కానీ అతను ఊహించినది మాత్రం కాదు.
చెల్లింపు ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడానికి అతను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు, కంప్యూటర్ ముందున్న వ్యక్తి డేటాను చూసి, అశోక్ 2021లో కోవిడ్-19 సమయంలో మరణించాడని ప్రశాంతంగా తెలియజేశాడు. నవ్వాలో ఏడవాలో తెలియని అశోక్ ఇలా అన్నారు, “ముఝే సమజ్ నహీ ఆయా ఇస్‌పే క్యా బోలూఁ (ఏం చెప్పాలో నాకు తెలీలేదు).”







