"ఏదో ఒకరోజు నేను ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాన్ని సాధిస్తాను," తన స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళే తారు రోడ్డు మీద చాలా దూరం పరుగెత్తిన తర్వాత వస్తోన్న ఆయాసాన్ని అణచుకోవడానికి ఊపిరి తీసుకుంటూ చెప్పిందామె. నాలుగు గంటల కఠోర శిక్షణ తర్వాత అలసిన, గాయపడిన ఆమె దిసపాదాలు చివరకు ఆ క్రీడామైదానం పై విశ్రాంతి తీసుకుంటున్నాయి.
ఎక్కువ దూరాలు పరుగులు తీసే (లాంగ్ డిస్టెన్స్ రన్నెర్) ఈ పదమూడేళ్ళ క్రీడాకారిణికి దిస పాదాలతో పరుగులు పెట్టడమనేది ఈ ఆధునిక కాలపు వేలంవెర్రి వంటిదేమీ కాదు. "నేనెందుకలా పరుగెడతానంటే, అంత ఖరీదైన రన్నింగ్ షూ కొనగల స్తోమత నా తల్లిదండ్రులకు లేదు," అంటోందీమె.
కరవు పీడిత ప్రాంతమైన మరఠ్వాడాలోని అతి పేద జిల్లాలలో ఒకటైన పర్‌భణీకి చెందిన వ్యవసాయ కూలీలైన విష్ణు, దేవశాలల కుమార్తె, వర్షా కదమ్. ఆమె కుటుంబం మహారాష్ట్రలో షెడ్యూల్డ్ కులాల జాబితాకు చెందిన మాతంగ్ సముదాయానికి చెందినది.
"నాకు పరుగెత్తడమంటే చాలా ఇష్టం," మెరుస్తోన్న కళ్ళతో చెప్పింది వర్ష. "2021లో జరిగిన ఐదు కిలోమీటర్ల బుల్‌ఢాణా అర్బన్ ఫారెస్ట్ మారథాన్ నా మొదటి పరుగు. అందులో నేను రెండవస్థానంలో వచ్చినందుకు నాకా చాలా బాగా అనిపించింది. అదే నేను గెల్చుకున్న మొదటి పతకం కూడా. నేను మరిన్ని పోటీలలో గెలవాలనుకుంటున్నాను," నిశ్చయంగా చెప్పింది ఈ బాలిక.
ఆమెకు ఎనిమిదేళ్ళ వయసప్పుడే ఆమెలోని తీవ్ర ఉత్సాహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. "మా మామ (మేనమామ) పారాజీ గాయక్వాడ్ రాష్ట్ర స్థాయి క్రీడాకారుడు. ఆయనిప్పుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. ఆయన్ని చూశాకే నేను కూడా పరుగు తీయడాన్ని మొదలుపెట్టాను," అంటోంది వర్ష. 2019లో జరిగిన అంతరపాఠశాల రాష్ట్ర స్థాయి పోటీలలో నాలుగు కిలోమీటర్ల క్రాస్ కంట్రీ పరుగుపందెంలో ఆమె రెండవ స్థానాన్ని పొందింది. "ఇది పరుగును కొనసాగించడానికి నాకు మరింత విశ్వాసాన్ని ఇచ్చింది."
















