తన చనిపోయిన కొడుకు జ్ఞాపకాలుగా మిగిలిన ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను ఎలా పెంచాలో తెలియక ఆ పిల్లల నాన్నమ్మ ఆందోళన చెందుతున్నారు; పిల్లలందరిలోకి చిన్నది – ఆరేళ్ళ జానకి. “నేను వాళ్ళందర్నీ ఎలా పెంచబోతున్నానో నాకు తెలియదు,” ఒడిశా బాలాంగీర్ జిల్లాలోని హియాల్ గ్రామంలో నివసించే 70 ఏళ్ళ గోండు ఆదివాసి, బూటే మాఝీ అన్నారు.
రెండు సంవత్సరాల క్రితం, 50 ఏళ్ళ వయసున్న ఆమె కొడుకు నృపా మాఝీ మరణించారు. ఆయన మూత్రపిండాలు విఫలం కావడం వల్ల చనిపోయారని కుటుంబం భావిస్తోంది. వలస కార్మికుడైన నృపా మాఝీ, ఆయన భార్య 47 ఏళ్ళ నామనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో ఉన్న ఇటుక బట్టీలలో పనిచేయడానికి వెళ్ళేవారు.
“నవంబర్ 2019లో, చెన్నైలోని ఒక ఇటుక బట్టీలో పని చేయడానికి వెళ్ళాం,” నామని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబానికి చెందిన 10 మంది అక్కడికి వెళ్ళామని – తన భర్త నృపా(50), వారి పెద్ద కొడుకు జుదిష్ఠిర్ (24), అతని భార్య పర్మిల (21), 19 ఏళ్ళ పూర్ణమి, 16 ఏళ్ళ సజని, 15 ఏళ్ళ కుమారి, ఆమె భర్త దినేష్ (21) - ఆమె చెప్పారు. వారితో పాటు పదేళ్ళ సావిత్రి, ఆరేళ్ళ జానకి కూడా వెళ్ళారు. కానీ ఆ ఇద్దరికీ కూలి ఉండదు.
జూన్ 2020 నాటి కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో, వాళ్ళందరూ తమ గ్రామానికి తిరిగి వచ్చారు. అలా తిరిగి వచ్చిన వలసదారుల కోసం పాఠశాలల్లో, కమ్యూనిటీ సెంటర్లలో తాత్కాలిక వైద్య సంరక్షణ, క్వారంటైన్ కేంద్రాలను ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. “మా ఊరి బడిలో మేం 14 రోజులు ఉన్నాం. అక్కడ ఉన్నందుకుగాను నాకూ నా భర్తకూ చెరొక రూ. 2,000 (ఒడిశా ప్రభుత్వం) ఇచ్చారు,” అని నామని తెలిపారు.












