రూపేశ్ మొహార్కర్ ఇరవయ్యో పడిలో ఉన్న ఆ యువతీయువకుల బృందాన్ని ఒకచోటికి చేర్చి వాళ్ళకు ఉత్సాహాన్ని రేకెత్తించేలా మాట్లాడుతున్నారు.
“ఏకాగ్రతతో ఉండండి,” అని ఆ 31 ఏళ్ళ యువకుడు అరిచారు. అక్కడున్న యువతీయువకులు అతని క్లుప్త ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. "సోమరిగా ఉండడానికి వీల్లేదు!" అంటూ, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదని అతను వాళ్ళకు గుర్తు చేశారు.
వాళ్ళు అతనితో ఏకీభవిస్తున్నట్లు తల వూపుతూ, గంభీరమైన ముఖాలతో, విజయోత్సాహంతో గట్టిగా కేక పెట్టారు. ఆ తర్వాత వాళ్ళంతా ఉత్సాహంగా తమ తమ స్ప్రింటింగ్ (కొద్ది దూరాల పరుగు), రన్నింగ్ (పరుగు), స్ట్రెచింగ్‌లకు తిరిగి వెళ్ళారు. అది వాళ్ళు నెల నుంచి చేస్తున్న శారీరక శిక్షణలో భాగం.
అది ఏప్రిల్ నెల ప్రారంభ దినాలలోని ఒక ఉదయం 6 గంటల సమయం. భండారాలోని శివాజీ స్టేడియం నగరంలోని ఏకైక ప్రజా మైదానం. ఆ మైదానం మొత్తం 100 మీటర్లు పరుగు; 1,600 మీటర్ల పరుగు; శక్తిని పెంచుకోవడానికి చేసే షాట్‌పుట్, ఇతర కసరత్తులు చేస్తూ, చెమటోడుస్తున్న యువతతో నిండిపోయివుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి మళ్ళీ గెలవాలనుకుంటున్న సార్వత్రిక ఎన్నికల గురించి వాళ్ళకసలు పట్టింపే లేదు. భండారా-గోందియా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏప్రిల్ 19, 2024న ప్రారంభమయ్యే మొదటి దశలో ఓటింగ్ జరుగుతుంది. ఇది సుదీర్ఘమైన, కష్టతరమైన, చెమటలు పట్టించే ఎన్నికల ప్రక్రియ.
ఎన్నికల పోటీలకు దూరంగా, ఈ యువతీ యువకులు రాబోయే రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సిద్ధపడుతున్నారు. వీటికోసం దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 15 ఆఖరి రోజు. దీనికి శారీరక, రాత పరీక్షలు రెండూ ఉంటాయి. పోలీస్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుల్ డ్రైవర్లు, స్టేట్ రిజర్వ్ పోలీస్ బలగాలు, పోలీసు బ్యాండ్‌మెన్, జైలు కానిస్టేబుళ్ళ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు నిర్వహిస్తారు.













