మహువా (మధూక లాంగిఫోలియా - విప్ప/ఇప్ప పువ్వు) పూల కాలం చాలా చిన్నది, రెండు నుంచి మూడు నెలల వరకూ ఉంటుంది. మధ్య భారతదేశంలో పెరిగే ఈ పొడవాటి చెట్లు వేసవికాలం ప్రారంభంలో తమ విలువైన పూలను రాలుస్తాయి.
లేత పసుపువన్నెలో ఉండే ఈ పూలను సేకరించడం ఒక వేడుక సందర్భం. ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌లో చిన్న పిల్లలతో సహా కుటుంబాలకు కుటుంబాలు అడవి నేలపై రాలిన ఈ పూలను ఏరుతుండటాన్ని మనం చూస్తాం. "ఇది చాలా కష్టమైన పని," అంటారు భూపిందర్. "పొద్దుపొద్దున్నే ఒకసారి, మళ్ళీ సాయంత్రం మరోసారి మేం మహువాను సేకరిస్తాం." ధమతరీ జిల్లాలోని చనాగాఁవ్‌కు చెందిన ఈయన తన తల్లిదండ్రులతో పాటు సహాయం చేయటానికి ఇక్కడకు వచ్చారు. అనేకమంది జనం ఉండటంతో అక్కడంతా పండుగ కోలాహలం నెలకొంది.
ఈ పూలకాలంలో, మహువా పరిమళం ఆ ప్రాంతాన్నంతా సుగంధ భరితం చేస్తుంది. రాయ్‌గఢ్ జిల్లాలోని ధరమ్‌జయ్‌గఢ్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ వరకూ, వందలాది మహువా చెట్ల కింద రాలిన పూలను ఏరుతూ గ్రామస్థులు తీరికలేకుండా ఉన్నారు. ఎండబెట్టి నిలువచేసిన ఆ పూలతో పిండి, మద్యం వంటివాటిని తయారుచేస్తారు.
"మేం అడవి నుంచి సేకరించే వస్తువులలో మహువా అన్నిటికంటే ముఖ్యమైనది. కరవుకాలంలో అది ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు కొంత మహువాను అమ్ముకోవచ్చు," అంబికాపుర్‌కు చెందిన సామాజిక కార్యకర్త, ఆదివాసీ నాయకుడైన గంగారామ్ పైంకరా అన్నారు. కూలిపనులు ఏమీ దొరకని కరవు కాలంలో ప్రజలు ఈ పూలపైన ఎలా ఆధారపడతారో ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.













