పాకిస్తాన్ సరిహద్దు నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో, షంషేర్ సింగ్ తన సోదరుడి గ్యారేజీలో తన పనిముట్లను వెతుకుతూ పనిలో ఉన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఆయన ఇక్కడ మెకానిక్‌గా పనిచేస్తున్నారు, కానీ ఆ పని ఆయన ఎంచుకున్నదైతే కాదు.
మూడవ తరం బరువులు మోసే కూలీ (పోర్టర్) అయిన 35 ఏళ్ళ షంషేర్, భారత పాకిస్తాన్‌ల మధ్య ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద కొంతకాలం క్రితం బరువులు మోసే కూలీగా పనిచేశారు. ఆయన కుటుంబం రాష్ట్రంలో ఇతర వెనుకబడిన కులాల (ఒబిసి) కింద జాబితా చేసివున్న ప్రజాపతి సముదాయానికి చెందినది.
పంజాబ్ వైపు నుంచి పాకిస్తాన్‌తో ఉన్న ఈ సరిహద్దు వద్ద సిమెంట్, జిప్సమ్, ఎండు ఫలాలతో నిండివున్న వందలాది ట్రక్కులు ప్రతిరోజూ భారతదేశంలోకి వచ్చేవి. అదే విధంగా టొమాటోలు, అల్లం, వెల్లుల్లి, సోయాచిక్కుళ్ళ ద్రావకం, నూలుతో పాటు ఇతర వస్తువులతో కూడిన ట్రక్కులు కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్‌లోకి చేరుకునేవి.
అక్కడ పనిచేసే దాదాపు 1,500 మంది పోర్టర్‌లలో షంషేర్ కూడా ఒకరు. అతని పని "సరిహద్దు దాటుతున్న వారి తర్వాతి ప్రయాణం కోసం రెండు వేపుల నుంచి వచ్చే ఈ వస్తువులను ట్రక్కుల్లోంచి దింపడం, మళ్ళీ ఎక్కించడం." ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు గానీ, పరిశ్రమలు గానీ లేవు; అట్టారీ-వాఘా సరిహద్దుకు 20 కి.మీ పరిధిలో ఉన్న ఈ గ్రామాలకు చెందిన భూమిలేని జనం తమ జీవనోపాధి కోసం సరిహద్దుల మధ్య జరిగే వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది భారత భద్రతా సిబ్బంది మరణించడంతో ఈ పరిస్థితులలో చాలా మార్పు వచ్చింది. ఈ దాడికి ఇస్లామాబాద్ కారణమని న్యూఢిల్లీ ఆరోపించింది. దీని తరువాత, భారతదేశం పాకిస్తాన్‌కు మంజూరు చేసిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) వాణిజ్య హోదాను ఉపసంహరించుకుని, దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. భారతదేశం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, వాణిజ్య ఆంక్షలు విధించి పాకిస్తాన్ ఇందుకు ప్రతీకారం తీర్చుకుంది.
ఈ సరిహద్దుకు దగ్గరి గ్రామాలలో నివసించే పోర్టర్లు, అమృత్‌సర్ జిల్లాకు చెందిన 900 కుటుంబాలకు పైగా ఈ పరిణామాల వలన దెబ్బతిన్నారని బ్యూరో ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇండస్ట్రీ అండ్ ఇకనామిక్ ఫండమెంటల్స్ (BRIEF) 2020లో చేసిన అధ్యయనం చెప్తోంది.
అమృత్‌సర్ నగరంలో పనులకు వెళ్ళాలంటే, స్థానిక బస్సులో 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. దీనికి అదనంగా సుమారు రూ. 100 ఖర్చవుతుంది. పని చేస్తే వచ్చేది దాదాపు రూ. 300. "రోజుకు 200 రూపాయలు ఇంటికి తీసుకురావడంలో ఉపయోగం ఏముంటుంది?" అంటారు షంషేర్.
దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకునే దిల్లీ నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, ప్రభుత్వం తమ మాట వినడం లేదని, అయితే అధికార పక్షానికి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు ఉంటే తమ స్వరాన్ని వినిపించడానికి సహాయపడతారని ఈ కూలీలు భావిస్తున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడు ఉంటే సరిహద్దును తిరిగి తెరవడానికి ఒత్తిడి చేస్తాడనీ, తద్వారా వారి ఉద్యోగాలు వారికి తిరిగి వస్తాయని కూడా వాళ్ళ భావన.
ఇప్పుడు సరిహద్దు వద్ద అఫ్ఘనిస్తాన్ నుంచి పంటలను తీసుకువచ్చే ట్రక్కులు వచ్చినప్పుడు మాత్రమే పని దొరుకుతోంది. ఆ పనులను తాము మామూలు కూలి పనులు దొరకటం కష్టమయ్యే పెద్దవయసు పోర్టర్లకు బదిలీ చేస్తుంటామని షంషేర్ చెప్పారు.
సరిహద్దును మూసివేయడం ప్రతీకారం తీర్చుకోవడానికి గుర్తని ఇక్కడి పోర్టర్‌లు అర్థం చేసుకున్నారు. " పర్ జెహ్డే ఎథే 1,500 బందే నే ఓహనా దే చులే ఠండే కరణ్ లగియాఁ సౌ వారీ సోచనా చాహిదా సీ [అయితే ఇక్కడ అనేక కుటుంబాల (1500) పొయ్యిల్లో మంటలను ఎలా ఆర్పేశారో కూడా వాళ్ళు ఆలోచించాలి]" అని షంషేర్ చెప్పారు.
ఐదేళ్ళుగా పోర్టర్లు అధికారులకు విన్నవిస్తూనే ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. "సరిహద్దును తిరిగి తెరవమని కోరుతూ గత ఐదేళ్ళలో మాంగ్ పత్ర [వినతి పత్రం]తో మేం సంప్రదించని ఏ పాలక ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ లేదు," అని ఆయన చెప్పారు
కౌంకే గ్రామానికి చెందిన దళిత పోర్టర్ సుచ్చా సింగ్ మాట్లాడుతూ, “అమృత్‌సర్ ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన గుర్‌జీత్ సింగ్ ఔజ్లా, ఇక్కడ నివాసముండేవారి జీవనోపాధి కోసం సరిహద్దును తిరిగి తెరవడం గురించి తరచుగా పార్లమెంటులో మోదీ ప్రభుత్వంతో మాట్లాడుతూనేవున్నారు. అయితే, ఆయన పార్టీ కేంద్రంలో అధికారంలో లేనందున ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవటంలేదు," అన్నారు.
పోర్టర్‌గా తన పనిని కోల్పోయిన తరువాత, 55 ఏళ్ళ ఈ దళిత మజహబీ సిక్కు తన కొడుకుతో కలిసి తాపీపని చేస్తూ రోజుకు రూ. 300 సంపాదిస్తున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, పెల్లుబుకుతోన్న ఏకాభిప్రాయం ఆసక్తికరంగా ఉంది. షంషేర్ ఇలా వివరించారు: “మేం ఈ ఎన్నికలలో నోటా(NOTA)ను నొక్కాలనుకుంటున్నాం, అయితే మా జీవనోపాధి [పోర్టర్లుగా] పూర్తిగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. బిజెపికి [భారతీయ జనతా పార్టీకి] ఓటు వేయాలనే కోరిక మాకు లేదు, కానీ అది ఒక అవసరం."
జూన్ 4, 2024న ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్‌జీత్ సింగ్ ఔజ్లా తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తేలింది. మరి సరిహద్దు రాజకీయాలపై ఆయన ప్రభావం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి వేచి చూడాల్సిందే.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి