లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ఒక వారం రోజుల ముందు, గడ్‌చిరోలి జిల్లాలోని 1,450 గ్రామ సభలు కాంగ్రెస్ అభ్యర్థి డా. నామ్‌దేవ్ కిర్సన్‌కు తమ షరతులతో కూడిన మద్దతును ప్రకటించాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఏడు దశల్లోని మొదటి దశలో, ఈ ప్రాంతం వోటు వేయడానికి - ఏప్రిల్ 19న - ఏడు రోజుల ముందు, ఇలా జరగటం ఒక అపూర్వమైన చర్య.
ఎందుకు ఇది ఒక అపూర్వమైన చర్య అయిందంటే, ఆదివాసీ సముదాయాలు బాహాటంగా ఏ రాజకీయ పక్షం వైపూ మొగ్గుచూపని ఈ జిల్లాలో, 12 తహసీళ్ళ కు చెందిన గ్రామ సభలు ఇలా మద్దతును ప్రకటించటం కాంగ్రెస్‌ను ఆశ్చర్యపరచింది, భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న బిజెపికి చెందిన పార్లమెంట్ సభ్యుడు అశోక్ నేతే వరుసగా మూడోసారి తిరిగి ఎన్నిక కావాలని ఆశిస్తున్నాడు.
గ్రామ సభలకు చెందిన వెయ్యిమందికి పైగా కార్యాలయ అధికారులు, ప్రతినిధులు ఏప్రిల్ 12న గడ్‌చిరోలి నగరంలోని సుప్రభాత్ మంగళ్ కార్యాలయ కల్యాణమండపంలో కాంగ్రెస్ అభ్యర్థి, నాయకులతో బహిరంగ సమావేశం కోసం ఓపికగా రోజంతా వేచి ఉన్నారు. సాయంత్రం వేళ, బలహీన ఆదివాసీ మాడియా సముదాయానికి చెందిన లాల్సూ నొగోటి అనే న్యాయవాది, తమ షరతులను నెమ్మదిగా చదివి వినిపించారు. ఈయన జిల్లాలోని ఆగ్నేయ బ్లాక్‌లోని భామ్రాగఢ్‌కు చెందినవారు. మద్దతు లేఖను స్వీకరించిన కిర్సన్, తాను పార్లమెంటుకు ఎన్నికైతే ఈ డిమాండ్లకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు.
జిల్లాలోని అటవీ ప్రాంతాలలో విచక్షణా రహితంగా, యథేచ్ఛగా కొనసాగిస్తోన్న గనుల తవ్వకాలను నిలిపివేయటం; అటవీ హక్కుల చట్టం నిబంధనలను సరళతరం చేయటం; హక్కులు అనిశ్చితంగా ఉన్న గ్రామాలకు సాముదాయక అటవీ హక్కులను (CFR) మంజూరు చేయటం; భారత రాజ్యాంగాన్ని కఠినంగా అమలుచేయటం - వంటి షరతులతో పాటు మరికొన్ని ఇతర షరతులు ఆ లేఖలో ఉన్నాయి.
"మా మద్దతు ఈ ఎన్నికల వరకూ మాత్రమే," అని ఆ లేఖ స్పష్టం చేసింది. "వాగ్దాన ద్రోహం జరిగితే, ప్రజలమైన మేము భవిష్యత్తులో భిన్నమైన వైఖరిని తీసుకుంటాం."
గ్రామ సభలు ఈ వైఖరిని ఎందుకు తీసుకున్నాయి?
"గనులు ఇచ్చేదాని కంటే ప్రభుత్వానికి మేం ఎక్కువ రాయల్టీని ఇస్తాం," అనుభవజ్ఞుడైన ఆదివాసీ కార్యకర్త, గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన సైను గోటా చెప్పారు. "ఈ ప్రాంతంలో అడవులను పడగొట్టటం, గనులు తవ్వడం చాలా తప్పవుతుంది."
హత్యలు, అణచివేత, అటవీ హక్కుల కోసం దీర్ఘకాలం వేచి ఉండటం, తన గోండు తెగలపై సాగిన దమనకాండ - వీటన్నిటినీ గోటా చూశారు. మెలితిప్పిన నల్లని మీసాలతో, పొడవుగా, దృఢంగా, అరవయ్యేళ్ళు దాటిన ఈయన, గడ్‌చిరోలిలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయితీ విస్తరణ (PESA) పరిధిలోకి వచ్చే గ్రామసభల న్నీ కలిసి ప్రస్తుతం పదవిలో ఉన్న బిజెపి ఎంపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థికి ఈ రెండు కారణాల వలన మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు: ఒకటి, అటవీ హక్కుల చట్టాన్ని నీరుకార్చటం; రెండు, అటవీ ప్రాంతాలలో తమ సంస్కృతినీ, ఆవాసాలనూ ధ్వంసం చేసే గనుల తవ్వకాలు. "ప్రజలపై ఎడతెగని పోలీసుల వేధింపులు మరింక సాగకూడదు," అన్నారతను. "వాటిని ఆపేయాలి."
ఒక ఏకాభిప్రాయానికి వచ్చి, మద్దతునిచ్చేందుకు తమ షరతులను రూపొందించడానికి ముందు ఆదివాసీ గ్రామ సభ ప్రతినిధులు మూడుసార్లు సంప్రదింపులు జరిపారు.
"ఇవి దేశానికి చాలా కీలకమైన ఎన్నికలు," 2017లో స్వతంత్ర అభ్యర్థిగా జిల్లా పరిషద్‌కు ఎన్నికైన నొగోటి అన్నారు. వకీల్-సాహెబ్ గా ఆయన ఆ జిల్లా అంతటా పేరుమోశారు. "ప్రజలు ప్రతిదీ తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు."
గత నవంబర్‌లో (2023), ఇనుప ఖనిజం సమృద్ధిగా ఉండే ఈ ప్రాంతంలో మరో గనిని ప్రారంభించే అవకాశాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సముదాయాలు 253 రోజుల పాటు మౌనంగా నిరసనలు చేపట్టిన ప్రదేశాన్ని, ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ, గడ్‌చిరోలి పోలీసులు ధ్వంసం చేశారు.
సుర్జాగఢ్ ప్రాంతంలో ప్రతిపాదించి, వేలం వేసిన ఆరు గనులకు వ్యతిరేకంగా దాదాపు 70 గ్రామాలకు చెందిన నిరసనకారులు తోడగట్టా గ్రామం వద్ద ఆందోళన చేస్తుండగా, భద్రతా బృందంపై నిరసనకారులు దాడి చేశారనే తప్పుడు ఆరోపణలు చేస్తూ, భారీ సాయుధ భద్రతా సిబ్బంది ఆ ప్రదేశాన్నిధ్వంసం చేసింది. వారి పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేశారు.
ప్రస్తుతం లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ నిర్వహిస్తోన్న సుర్జాగఢ్ గనుల వల్ల జరుగుతోన్న పర్యావరణ విధ్వంసాన్ని చూసిన చిన్న చిన్న గ్రామాలు, కుగ్రామాల ప్రజలు తడవకు 10-15 మంది, ప్రతి నాలుగు రోజులకు, దాదాపు ఎనిమిది నెలల పాటు ధర్నా-స్థలం వద్ద వంతులవారీగా నిరసనకు కూర్చున్నారు. వారి డిమాండ్ చాలా సరళమైనది: ఈ ప్రాంతంలో గని తవ్వకాలు వద్దు. ఇది కేవలం తమ అడవులను కాపాడుకోవడానికే కాదు. ఇది వారి సాంస్కృతిక సంప్రదాయం కోసం కూడా. ఎందుకంటే ఈ ప్రాంతం అనేక ప్రార్థనాస్థలాలకు నిలయం
పోలీసులు మిగతావారి నుంచి ఎనిమిదిమంది నాయకులను వేరుచేస్తూ చుట్టుముట్టారు, వారిపై కేసులు పెట్టారు. తద్వారా స్థానికులలో విస్తృతమైన అధిక్షేపణనూ అశాంతినీ ప్రేరేపించారు. అదే ఈ వ్యతిరేకత రగలటానికి తాజా కారణం.
ఇప్పుడు కొంత నిశ్శబ్దం నెలకొంది.
PESA పరిధిలోకి వచ్చే ప్రాంతాలలోనూ, వెలుపలా కూడా దాదాపు 1,500 గ్రామసభలతో CFR గుర్తింపుకు సంబంధించి గడ్‌చిరోలి జిల్లా దేశంలోనే అగ్రగామిగా ఉంది.
సముదాయాలు తమ అడవుల నిర్వహణను చూసుకోవడం, చిన్నపాటి అటవీ ఉత్పత్తులను పండించడం, మెరుగైన ధరల పెంపు కోసం వేలం నిర్వహించడాన్ని ప్రారంభించాయి. ఇది వారి ఆదాయాల పెరుగుదలకు దారితీసింది. CFRలు సామాజిక, ఆర్థిక స్థిరత్వాన్ని అందించాయి. దశాబ్దాల సంఘర్షణ, కలహాలలో ఒక మలుపును తీసుకువచ్చాయి.
సుర్జాగఢ్ గనులు చికాకును కలిగించాయి: కొండలను తవ్వేశారు; కొండల నుండి ప్రవహించే నదులు, వాగులు ఇప్పుడు ఎర్రటి కలుషిత నీటితో ప్రవహిస్తున్నాయి. కనుచూపు మేరా భారీ రక్షణతోనూ, కంచెలతోనూ గని ప్రదేశం నుండి ధాతువును బయటకు తీసుకెళ్తున్న ట్రక్కుల భారీ వరుసలను మీరు చూడవచ్చు. గనుల చుట్టూ ఉన్న అటవీప్రాంత గ్రామాలు కుంచించుకుపోయి వాటి అసలైన రూపుకు నీడలా మారాయి.
ఉదాహరణకు మల్లంపాడ్ గ్రామాన్ని తీసుకుందాం. స్థానికంగా మలంపాడి అని ఈ గ్రామాన్ని పిలుస్తారు. ఇది చామొర్శీ బ్లాక్‌లోని సుర్జాగఢ్ గనుల వెనుక ఉన్న ఓరాఁవ్ సముదాయానికి చెందిన చిన్న కుగ్రామం. గని నుంచి వెలువడే కాలుష్య కారకాల వల్ల వ్యవసాయం ఎలా తీవ్రంగా ప్రభావితమైందో ఇక్కడి యువకులు మాట్లాడతారు. వారు విధ్వంసం, వినాశనం, ప్రబలంగా ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడతారు. బయటివారు 'అభివృద్ధి' అని పిలిచే శాంతి విధ్వంసాన్ని అనేక చిన్న కుగ్రామాలు చూస్తున్నాయి.
గడ్‌చిరోలికి రాష్ట్ర భద్రతా దళాలు, సిపిఐ (మావోయిస్ట్) సాయుధ గెరిల్లాల మధ్య హింస, సంఘర్షణల సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా జిల్లాలోని దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతాలలో ఇది మరింత భీకరంగా ఉంది.
రక్తం పారింది. అరెస్టులు జరిగాయి. హత్యలు, వలపన్నడాలు, ఆంబుష్‌లు, కొట్టడాలు మూడు దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగాయి. ఆకలి, పస్తులు, మలేరియా, శిశు మరణాల, ప్రసూతి మరణాల రేటు పెరిగిపోయింది. ప్రజలు చనిపోయారు.
"మాకు ఏం అవసరమో, ఏం కావాలో ఒకసారి మమ్మల్ని అడగండి," ఎప్పుడూ నవ్వుతూ ఉండే నొగోటీ చమత్కరించారు. తన సముదాయంలో చదువుకున్న మొదటి తరం యువకులలో ఈయన ఒకరు. “మాకు మా స్వంత సంప్రదాయాలు ఉన్నాయి; మాకు మా స్వంత ప్రజాస్వామ్య వ్యవస్థలున్నాయి; మేం మా కోసం ఆలోచించుకోగలం.”
షెడ్యూల్డ్ తెగలకు (ఎస్‌టి) రిజర్వ్ చేసిన ఈ పెద్ద నియోజకవర్గంలో ఏప్రిల్ 19న జరిగిన పోలింగులో 71 శాతానికి పైగా వోటింగ్ నమోదైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత, దేశంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, గ్రామసభల వైఖరి ఏమైనా తేడాను తేగలిగిందా అనేది మనకు తెలుస్తుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి