సుశిక్షితమైన దీపికా కమాన్ కళ్ళు, దాదాపు ఒకేలా కనిపించే మగ-ఆడ పట్టు పురుగుల మధ్యనున్న తేడాను ఇట్టే పసిగట్టగలవు. “ఆ రెండూ ఒకేలా కనిపిస్తాయి కానీ, మగ పురుగు ఆడ పురుగు కంటే పొడవుగా ఉంటుంది,” దాదాపు 13 సెంటీమీటర్ల పొడవైన రెక్కలున్న గోధుమ-లేత గోధుమరంగు జీవులను చూపిస్తూ ఆమె వివరించింది. “పొట్టిగా, స్థూలంగా ఉన్నది ఆడ పురుగు.”
అస్సామ్‌లోని మాజులీ జిల్లా, బొరుణ్ సితదర్ సుక్ గ్రామానికి చెందిన దీపిక, మూడేళ్ళ క్రితం ఎరి పట్టుపురుగుల (సమియా రిసినీ) పెంపకాన్ని మొదలుపెట్టారు. దీనిని ఆమె తన తల్లి, అమ్మమ్మల దగ్గర నుంచి నేర్చుకున్నారు..
ఎరి అనేది అస్సామ్‌లోని బ్రహ్మపుత్ర లోయలోనూ, అలాగే పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్‌లలో సాగు చేసే ఒక రకమైన పట్టు. మిసింగ్ (మిషింగ్ అని కూడా అంటారు) సముదాయం సాంప్రదాయికంగా ఈ పట్టుపురుగులను సాగు చేసి, వారి సొంత ఉపయోగాల కోసం ఎరి వస్త్రాన్ని నేస్తుంటారు. అయితే, వాణిజ్య ప్రయోజనాల కోసం పట్టును నేయడమనేది ఈ సముదాయానికి సాపేక్షంగా కొత్త పద్ధతి.
“ఇప్పుడు కాలం మారింది. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా పట్టు పురుగుల పెంపకాన్ని నేర్చుకుని, పెంచుతున్నారు,” ఇరవై ఎనిమిదేళ్ళ దీపిక అన్నారు.













