చారల లుంగీని మోకాళ్ళ మధ్య నుంచి దోపుకొని, కేవలం 30 సెకన్ల కాలంలో 40 అడుగుల ఎత్తున్న తాటిచెట్టును సగం వరకు ఎక్కగలడు అజయ్ మహతో.
అతను ప్రతిరోజూ ఇదే పని చేస్తాడు – కళ్ళు తిరిగే ఎత్తున ఉండే తాటిచెట్లను అవలీలగా ఎక్కి, వాటి మట్టల దగ్గర ఉండే మొవ్వల నుండి నీరాను సేకరిస్తాడు.
బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో, మే మాసపు ఒక ఉదయాన, 27 ఏళ్ళ ఈ కల్లుగీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు. “ఆబ్ త తార్ కే పేర్ జైసన్ సక్కత్ హో గెలైహన్. కాంటా భీ నై భొకైతై (ఇవి తాటిచెట్టులా గట్టిగా మారిపోయాయి. ముల్లు గుచ్చుకున్నా ఏమీ కాదు),” తన కాయలుగట్టిన రెండు చేతులను చూపిస్తూ అన్నాడు అజయ్.
“చెట్టు ఎక్కుతున్నప్పుడు పట్టు బలంగా ఉండాలి. రెండు చేతులతో, కాళ్లతో చెట్టు మానును గట్టిగా పట్టుకోవాల”ని చెబుతూ, రెండు చేతుల వేళ్ళను ఎలా మెలిపెట్టి మాను చుట్టూ పెనవేయాలో అజయ్ చూపించాడు. సన్నగా, గరుకుగా ఉండే తాటి మానులను ఎక్కే కష్టతరమైన పని వలన అతని ఛాతీ పైన, చేతుల మీద, చీలమండల దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి.
“15 సాల్ కే రహియే తహియే సే ఇస్టార్ట్ కా దెలియే రా (నాకు 15 ఏళ్ళ వయసున్నప్పటి నుండి తాటిచెట్లు ఎక్కడం మొదలుపెట్టాను),” అంటూ 12 సంవత్సరాలుగా తాను చేస్తున్న పని గురించి ఈ గీత కార్మికుడు వివరించాడు.
రసూల్‌పుర్ గ్రామ నివాసి అయిన అజయ్, పాసీ సముదాయానికి చెందినవాడు. సంప్రదాయకంగా వీళ్ళు కల్లుగీత కార్మికులు – అజయ్ కుటుంబంలో కనీసం మూడు తరాలుగా ఇదే పని చేస్తున్నారు.














