"జూన్ నెలలో ఎస్‌డిఎమ్ [సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్] వచ్చి, 'ఇదిగోండి ఈ ప్రదేశాన్ని వదిలిపోవాలనే నోటీస్,' అని చెప్పాడు."
బాబూలాల్ ఆదివాసీ గాహ్‌దరా గ్రామ ప్రవేశద్వారం వద్ద ఉన్న పెద్ద మర్రి చెట్టును చూపించారు. అది సముదాయపు సమావేశాలు జరిగే ప్రదేశం - ఇప్పుడది అతని ప్రజల భవిష్యత్తు ఒక్క రోజులో మారిపోయిన చోటు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ (పిటిఆర్), ఆ చుట్టుపక్కల 22 గ్రామాల ప్రజలను ఆనకట్ట కోసం, నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కోసం వారి ఇళ్ళను, భూములను ఇవ్వాలని కోరారు. 2017 నాటికే తుది పర్యావరణ అనుమతులు వచ్చాయి, దేశీయ ఉద్యానవనంలో చెట్ల నరికివేత ప్రారంభమైంది. కానీ తొలగింపు బెదిరింపులు ఊపందుకున్నాయి
కేన్, బెత్వా నదులను 218 కిలోమీటర్ల పొడవైన కాలువతో అనుసంధానం చేసేందుకు రెండు దశాబ్దాలుగా ప్రక్రియలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రణాళిక రూ. 44,605 కోట్లు (దశ 1).
ఈ ప్రాజెక్ట్ అనేక విమర్శలపాలయింది. “ప్రాజెక్ట్ నిర్మాణానికి తగినంత కారణం లేదు, జలసంబంధమైన సమర్థన కూడా లేదు," 35 ఏళ్ళుగా నీటి రంగంలో పనిచేస్తోన్న శాస్త్రవేత్త హిమాంశు ఠక్కర్ అన్నారు. “అసలు చెప్పాలంటే, కేన్ నదిలో మిగులు జలాలు లేవు. విశ్వసనీయమైన అంచనా గానీ, వస్తుగతమైన అధ్యయనం గానీ లేవు. ముందుగానే నిర్ణయించిన నిర్ధారణలు మాత్రమే ఉన్నాయి," అని ఆయన చెప్పారు.
ఠక్కర్ సౌత్ ఆసియా నెట్‌వర్క్ ఆన్ డామ్స్, రివర్స్ అండ్ పీపుల్ (SANDRP)కు సమన్వయకర్తగా ఉన్నారు. నదుల అనుసంధానం కోసం 2004 ప్రాంతాల్లో జల వనరుల మంత్రిత్వ శాఖ (ఇప్పుడు జల్ శక్తి) ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీలో ఆయన ఒక సభ్యుడు. అసలు ప్రాజెక్ట్ ప్రాతిపదికే చాలా దారుణమైనదని ఆయన చెప్పారు: "నదుల అనుసంధానం అడవుల పైన, నది పైన, జీవవైవిధ్యంపైన పర్యావరణ సంబంధమైన, తద్వారా సామాజిక పర్యవసానాలపై భారీ ప్రభావాలను కలిగిస్తుంది. స్థానికంగానూ బుందేల్‌ఖండ్, ఇంకా చాలా దూరప్రాంతాల వరకూ కూడా ప్రజలను నిరుపేదలుగా మారుస్తుంది."





























