"మీరు వెలుగుతో పుట్టారు, మేం చీకటితో పుట్టాం," తన మట్టి ఇంటి బయట కూర్చొనివున్న నందరామ్ జామూన్కర్ అన్నారు. మేం 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏప్రిల్ 26, 2024న వోటు వేయబోతున్న అమరావతి జిల్లాలోని ఖడిమాల్ గ్రామంలో ఉన్నాం. నందరామ్ చెప్తోన్న చీకటి అక్షరాలా నిజం; మహారాష్ట్రలోని ఈ ఆదివాసీ గ్రామానికి ఎన్నడూ విద్యుత్ సౌకర్యమన్నదే లేదు.
"ప్రతి ఐదేళ్ళకోసారి ఎవరో ఒకరు వచ్చి గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని తెస్తామని వాగ్దానం చేస్తారు. విద్యుత్ సంగతి అలాగుంచి, వాళ్ళు కూడా తిరిగి కనిపించరు," అన్నారు 48 ఏళ్ళ నందరామ్. ప్రస్తుత ఎమ్‌పి నవనీత్ కౌర్ రాణా 2019లో శివ సేనకు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఆనందరావ్ అద్సుల్‌ను ఓడించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడామె అదే స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
చిఖల్‌దరా తాలుకాలోని ఈ గ్రామంలో ఉండే 198 కుటుంబాలు (2011 జనగణన), ప్రధానంగా మహాత్మాగాంధి దేశీయ ఉపాధి హామీ చట్టం (MNREGA) పనులపై అధారపడతారు. భూమి ఉన్న కొద్దిమంది వర్షాధార వ్యవసాయం చేస్తూ ఎక్కువగా మొక్కజొన్నను పండిస్తారు. ఎక్కువగా షెడ్యూల్డ్ తెగలకు (ఎస్‌టిలు) చెందినవారు నివసించే ఖండిమాల్ గ్రామానికి తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఎన్నడూ లేవు. కొర్కు భాషలో మాట్లాడే నందరామ్, కొర్కు ఆదివాసీ తెగకు చెందినవారు. కొర్కు భాషను అంతరించిపోతున్న భాషగా ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2019లో గుర్తించింది.








