వత్సల మణిరామ్ ప్రాణాలను కాపాడింది.
"మేం పాండవ జలపాతాల దగ్గరకు వెళ్ళాం," మణిరామ్ చెప్పటం మొదలుపెట్టారు. "వత్సల మేత కోసం వెళ్ళింది. నేను ఆమెను తీసుకురావటానికి వెళ్తుండగా ఒక పులి ప్రత్యక్షమయింది."
సహాయం కోసం మణిరామ్ కేకలు పెట్టారు. "ఆమె పరుగెట్టుకుంటూ వచ్చి, నేను ఆమె వీపు మీదకు ఎక్కటానికి వీలుగా తన ముందు కాలిని పైకెత్తింది. నేను ఎక్కి కూర్చోగానే, ఆమె కోపంగా తన కాళ్ళను నేలకు గట్టిగా తాటించి, చెట్లను పడగొట్టింది. పులి భాగ్ గయా [పులి పారిపోయింది]," అన్నారు ఉపశమించిన మహావత్ (మావటి)
పన్నా టైగర్ రిజర్వ్‌కు ఘనమైన మాత్రధికారిణి అయిన వత్సలకు వందేళ్ళ కంటే ఎక్కువ వయసుంటుందని చెప్తారు. తద్వారా ఆమె ప్రపంచంలోనే జీవించివున్న అత్యంత పెద్దవయసు ఏనుగుగా మారింది. "కొందరు ఆమెకు 110 ఏళ్ళనీ, మరికొందరు 115 ఏళ్ళనీ అంటున్నారు. అది నిజమే అయుంటుందనుకుంటున్నాను," 1996 నుండి వత్సల సంరక్షణను చేపట్టిన గోండు ఆదివాసి మణిరామ్ చెప్పారు.
వత్సల ఆసియా ఖండపు ఏనుగు (Elephas maximus). ఈమె కేరళలోనూ, మధ్యప్రదేశ్‌లోనూ నివాసముంటోంది. ఆమె చాలా సౌమ్యురాలని, చిన్న వయసులో ఉండగా చాలా ఉల్లాసంగా, సాహసంగా ఉండి ఉంటుందనీ మణిరామ్ అంటారు. ఇప్పటికి కూడా, తన కంటి చూపు, వినికిడి శక్తీ సన్నగిల్లిపోతున్నప్పటికీ, ఆమె ఎదురవ్వబోయే ప్రమాదాన్ని గురించి తన మందకు మొదటి సంకేతాన్ని అందిస్తుంది.
ఆమె ఘ్రాణ శక్తి ఇంకా చాలా బలంగా ఉందనీ, మరో జంతువు నుంచి వచ్చే అపాయాన్ని వాసన ద్వారా పసిగట్టగలదనీ మణిరామ్ అంటారు. అలా జరిగినప్పుడు, ఆమె మిగిలిన మందను హెచ్చరిస్తుంది. వెంటనే అవన్నీ ఏనుగు గున్నలను మధ్య ఉంచుకొని, వాటి చుట్టూ గుంపుకడతాయి. "ఆ జంతువు దాడిచేయటానికి ప్రయత్నించినపుడు అవి తమ తొండాలతో అందుబాటులో ఉన్న రాళ్ళనూ కర్రలనూ చెట్లకొమ్మలనూ పట్టుకొని విసురుతూ ఆ జంతువును తరిమేస్తాయి," అన్నారు మణిరామ్. "పెహలే బహుత్ తేజ్ థీ [మొదట్లో చాలా చురుగ్గా ఉండేది]."










