గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని తన తోటి రైతులు తమ పొలాల్లోని మర్రి చెట్లను (ఫైకస్ బెంఘలెన్సెస్) అమ్మేస్తున్నప్పుడు 60 ఏళ్ళ వయసున్న సుబ్బయ్యకు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. రెండు దశాబ్దాల క్రితం సుబ్బయ్య కూడా తనకున్న రెండెకరాల పొలంలో ఒక మర్రి కొమ్మను నాటారు. అది ఒక పెద్ద చెట్టుగా విస్తరించి, ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎంతో చల్లని నీడను, ఆశ్రయాన్ని ఇచ్చేది.
ఇప్పుడు తన మర్రి చెట్టును కేవలం రూ.8,000కు అమ్మేయాల్సిన అవసరం సుబ్బయ్యకు వచ్చింది. తన భార్య చికిత్స కోసం ఆయన దానిని ఇష్టం లేకపోయినా అమ్మేశారు. రెండేళ్ల క్రితం, గౌరీ-గణేశ హబ్బా (కర్నాటకలో ఒక పండుగ)కు ముందు, సుబ్బయ్య భార్య 56 ఏళ్ళ మహదేవమ్మ మేకలను మేపుతూ ఒక రాయి మీద కాలు జారి పడిపోవడంతో, ఆమె తుంటి విరిగింది.
“మంద నుంచి తప్పిపోయిన మేకపిల్లను వెంబడిస్తూ ఆ కంగారులో రాయిని చూసుకోలేదు. కిందపడిపోయాక నేనింక పైకి లేవలేకపోయాను,” అని మహదేవమ్మ ఆ దురదృష్టకరమైన రోజును గుర్తు చేసుకున్నారు. “నేను చాలా తీవ్రమైన బాధను అనుభవించాను. అదృష్టవశాత్తు, అటుగా వెళుతున్న కొంతమంది నన్ను చూసి నేను ఇంటికి చేరుకోవడానికి సహాయం చేసారు."
ఈ సంఘటన అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ పరిస్థితులను తలక్రిందులు చేసింది.










