సి వెంకట సుబ్బారెడ్డి తన డబ్బును ఇమ్మంటూ డిమాండ్ చేస్తున్న ఆరవ ధర్నా ఇది. పద్దెనిమిది నెలలు పైగానే వైస్సార్ జిల్లాలోని ఈ రైతు చెరుకుకు చెల్లింపులు జరగలేదు.
ఫిబ్రవరి 2020న సుబ్బారెడ్డి ఇంచుమించుగా 170 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరానికి, ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం నిర్వహించిన ధర్నా(స్ట్రైక్) కి వచ్చారు.
“2018 లో నేను సప్లై చేసిన చెరుకుగాను మయూర షుగర్ ఫ్యాక్టరీ నాకు 1.46 లక్షలు ఇవ్వాలి,” అన్నాడు సుబ్బారెడ్డి. ఇతనికి కమలాపురం మండల్, విభారంపురం గ్రామంలో 4.5 ఎకరాలున్నాయి. మయూర షుగర్స్ ఇతనికి టన్నుకు 2,500 రూపాయిలు ఇస్తామని 2018-19 కాలంలో చెప్పారు. “కానీ కంపెనీ దాని రేటును 2,300 రూపాయలకు తగ్గించేసింది. నాకు మోసం జరిగింది.” అన్నారు.
ఈ ధర్నాలో పాల్గొన్న ఆర్. బాబునాయుడు కూడా షుగర్ మిల్ నుండి తనకు రావలసిన 4.5 లక్షల కోసం ఎదురుచూస్తున్నారు. అతను చిత్తూరులోని రామచంద్రాపురం మండలం గణేశపురం గ్రామంలో తన బంధువు వద్ద 8 ఎకరాలు కౌలుకి తీసుకున్నారు. తన స్వంత భూమిలో బోర్ ఎండిపోయినందు వలన దానిని సాగుచేయడం మానేసారు. “నేను 2019-20 లో 80,000 రూపాయిలు ఆ పొలాన్ని సాగుచేసుకోవడానికి చెల్లించాను, కానీ ఆ భూమి యజమాని నా బంధువు. అందుకని నాదగ్గర తక్కువ డబ్బులు తీసుకున్నాడు. మామూలుగా అయితే ఒక ఎకరానికి కౌలు ఖరీదు 20,000 రూపాయిల పై మాటే.”
బాబునాయుడుకి రావలసిన 8.5 లక్షల్లో, మయూర షుగర్స్ అతనికి నాలుగు లక్షలే ఇచ్చింది. “ఇవ్వవలసింది ఇంకా ఉంది. రైతులకు వారి పొలాలు సాగు చేసుకోవడానికి డబ్బులు కావాలి.”
చిత్తూరు, వైస్సార్(కడప) జిల్లాలలో చెరుకు రైతులు మయూర షుగర్స్ చెల్లింపుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. “మేము మా నిరసన ని ఇంకా తీవ్రతరం చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాము”, అన్నాడు సుబ్బారెడ్డి. మార్చ్ 2020 లో కోవిడ్ లాక్ డౌన్ వలన ఎక్కువ నిరసనలు నిర్వహించలేకపోయారు.










