“రెండు ప్లస్ రెండు – ఎంత? ప్రతీక్, నువ్వు కూడికలు ఎలా చేసేవాడివో గుర్తుందా?”
ప్రతీక్ రావుత్ ఉపాధ్యాయుడైన మోహన్ తాలేకర్, ఒక పలకపై రాసిన సంఖ్యలను చూపిస్తూ, 14 ఏళ్ల ఆ పిల్లవాడిని వాటిని గుర్తించావా అని అడిగారు. పలక వైపు చూస్తూ ఉన్న పిల్లవాడి ముఖంలో వాటిని గుర్తించిన జాడలు లేవు.
అది జూన్ 15, 2022. మేం ప్రతీక్ చదువుకునే జ్ఞానప్రబోధన్ మతిమంద్ నివాసి విద్యాలయలో ఉన్నాం. ఇది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా, కర్మాలా తాలూకాలో ఉంది. ప్రతీక్ తన పాఠశాలకు రెండేళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చాడు. రెండేళ్ళంటే చాలా సుదీర్ఘమైన కాలం.
“ప్రతీక్ అంకెలను గుర్తుతెచ్చుకోలేకపోతున్నాడు. కోవిడ్‌కు ముందు అతను కూడికలు చేయగలిగేవాడు, మొత్తం మరాఠీ, ఆంగ్ల వర్ణమాలలను రాయగలిగేవాడు,” అని అతని గురువు చెప్పారు. "మేం ఇప్పుడతనికి ప్రతిదీ మొదటి నుండి నేర్పించాలి."
అక్టోబర్ 2020లో, ఈ విలేఖరి అహ్మద్‌నగర్ జిల్లాలోని రాశీన్ గ్రామంలో ప్రతీక్‌ని అతని ఇంటి దగ్గర కలిసినప్పుడు, అప్పటికి 13 సంవత్సరాల వయస్సున్న ప్రతీక్, వర్ణమాలలోని కొన్ని అక్షరాలను రాయగలిగేవాడు. డిసెంబర్ 2020 నాటికల్లా అతను రాయడం మానేశాడు.
ప్రతీక్ 2018లో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. తర్వాతి రెండేళ్లలో, నిలకడగా అభ్యాసం చేసి సంఖ్యలనూ, పదాలనూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. మార్చి 2020లో, అతను చదవడంలోనూ రాయడంలోనూ మరింత ముందుకువెళ్తున్న దశలో ఉండగానే, కోవిడ్-19 తాకింది. మేధోపరమైన వైకల్యాలు ఉన్న 6 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 25 మంది విద్యార్థులలో ప్రతీక్ ఒకడు. వారి రెసిడెన్షియల్ పాఠశాలను రెండేళ్లపాటు మూసివేయటంతో ఆ పిల్లలందరినీ వారి వారి కుటుంబాల వద్దకు తిరిగి పంపించేశారు.












