గోధుమ పంటకు నీళ్లు పట్టే సమయం వచ్చింది. సబరణ్ సింగ్ తన వ్యవసాయ భూమిలో ఈ కీలకమైన దశకు వెళ్ళకుండా ఉండలేకపోయా రు. అందుకే అతను డిసెంబర్ మొదటి వారంలో హరియాణా-ఢిల్లీ సరిహద్దులోని సింఘు నుండి పంజాబ్‌లోని తన ఊరికి తిరిగి వెళ్ళా రు.
కానీ నవంబర్ 26 నుండి నిరసన స్థలంలో స్థిరంగా ఉన్న అతను ఆ స్థలాన్ని వదిలిపెట్టి పొవట్లేదు. కొన్ని రోజుల తర్వాత, దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖంట్ గ్రామంలోని తన 12 ఎకరాల పొలం నుండి సింఘు వద్దకు తిరిగి వచ్చారు. “నేను మాత్రమే అలా చేయట్లేదు. ఇక్కడ చాలా మంది తమ ఊరికి నిరసన ప్రదేశానికి మధ్య తిరుగుతూనేవున్నారు." అని ఆ 70 ఏళ్ల రైతు చెబుతున్నారు.
రైతులు రూపొందించిన రిలే సింఘు వద్ద వాళ్ళ సంఖ్యను బలంగా ఉంచుతుంది. అదే సమయంలో తమ ఊరిలోని పొలాల్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంచుతుంది.
"ఇది మేము గోధుమను పండించడం ప్రారంభించే సమయం" అని నవంబర్-డిసెంబర్ కాలాన్ని ప్రస్తావిస్తూ సబరణ్ చెప్పారు. "నేను లేనప్పుడు మా ఊరికి చెందిన నా స్నేహితులు కొందరు నా స్థానంలో సింఘు వద్దకు వచ్చారు."
అనేక మంది నిరసనకారులు ఈ ఉద్యమ నమూనాని అనుసరించారు. "మాలో చాలా మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి," అని మాజీ సైనికుడు కూడా అయిన సబరణ్ చెప్పారు. “ఇవి ఇక్కడి నుండి మా ఊర్లకు అటూ ఇటూ వెళ్తూనే ఉంటాయి. కానీ ఈ కార్లు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. నలుగురిని ఊర్లో దింపుతుంటే, మరో నలుగురు అదే కార్లో తిరిగి ఇక్కడకు వస్తున్నారు.".







